సబ్సిడీ విత్తన ధరలు ఖరారు

Updated By ManamSat, 08/18/2018 - 02:10
seeds
  • బహిరంగ మార్కెట్లలో కంటే అధికం.. శనగకు రూ.6500, వేరుశనగకు రూ.6400

seedsహైదరాబాద్: కాంట్రాక్టర్ల ఒత్తిడికి తలొగ్గారో.. లేక నిర్లక్ష్యంగా వ్యవహరించారో గానీ.. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రకటించిన విత్తన సబ్సిడీ ధరలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లలో కంటే అధిక ధరలకు సబ్సిడీ విత్తనాలను రైతులకు అంటగట్టేందుకు ప్రయత్నం జరిగినట్టు తెలుస్తోంది. కాంట్రాక్టర్ల నుంచి భారీగా ముడుపులు అందడంతోనే ఈ స్థాయిలో ధర లను వ్యవసాయ శాఖ నిర్ణయించినట్టు సమాచారం. ఈ ధరల నిర్ణయంలో ఓ కాంట్రాక్టర్ కీలకంగా వ్యవహ రించినట్టు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం సబ్సిడీ విత్తనాలను సరఫరా చేసే సదరు కాంట్రాక్టర్ కనుసన్నల్లో ధర నిర్ణయం జరిగినట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల్లో గుసగుసలు వినవస్తున్నాయి. యాసంగి సీజన్‌కు సంబంధించి శనగ, వేరుశనగ సబ్సిడీ విత్తన ధరలను రాష్ట్ర వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. శనగ క్వింటాల్‌కు రూ.6500 కాగా, వేరుశనగ క్వింటాల్‌కు రూ.6400గా నిర్ణయించింది. ఈ ధరలో క్వింటాకు 35శాతం చొప్పున ప్రభుత్వం సబ్సిడీ చెల్లించనుంది. దీంతో రైతులు క్వింటా శనగకు రూ.4225, వేరుశనగకు రూ.4160 చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది కంటే ధర తక్కువగా నిర్ణయించినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో, బహిరంగ మార్కెట్లలో శనగ, వేరుశనగ ధరలకు, ప్రభుత్వం ప్రకటించిన ధరలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. ప్రస్తుతం శనగకు మార్కెట్‌లో సాధారణ ధర క్వింటాల్‌కు రూ.5వేలు ఉంది. అలాగే వేరుశనగకు క్వింటాల్‌కు రూ.4200 నుంచి రూ.4500 వరకు ఉంది. పంట శుద్ధి, రవాణా, నిల్వ, పెట్టుబడిపై వడ్డీ ఖర్చులు అదనంగా రూ.1200 కలుపుకున్నా.. శనగకు, వేరుశనగ అమ్మకం ధర రూ.6వేలు మించకూడదు. రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసే విత్తనాల్లో సగానికి పైగా టెండర్ల నిర్వహణ ద్వారా కాంట్రాక్టర్ల నుంచి సేకరిస్తూ ఉంటాయి. కాంట్రాక్టర్ల లాభం, నిర్వహణ ఖర్చులూ కలుపుకుని బహిరంగ మార్కెట్లలో విత్తన ధరల కన్నా ఎక్కువ ధరలకు ఖరారు చేసున్నారు. ఈ విషయంలో కాంట్రాక్టర్ల ఒత్తిడి కారణంగా చెప్పొచ్చు. ప్రభుత్వం యాసంగి సీజన్‌లో 6 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయనుంది.

యాసంగిలో శనగ, వేరుశనగకు ప్రాధాన్యం..
రాష్ట్రంలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 31.92 లక్షల ఎకరాలు. ఇందులో సగం విస్తీర్ణం వరకు వరి పంటను సాగు చేస్తారు. మిగిలిన విస్తీర్ణం పప్పు ధాన్యాలు, చెరుకు వంటి పంటలను పండిస్తారు. రబీ సీజన్‌లో ఎక్కువగా వేరుశనగ, శనగ పంటలను అధికంగా సాగు చేసేందుకు రైతులు మొగ్గుచూపుతారు. ఎందుకంటే.. ఖరీఫ్ సీజన్‌లో పత్తి, మిర్చి వంటి తొమ్మిది నెలల పంటలను వేస్తారు. ఈ క్రమంలో మిగతా మూడు నెలల కాలానికి ఏ పంట సాగు చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. దీంతో శనగ, వేరుశనగ పంటలను పండించేందుకు రైతులు ఆసక్తి చూపుతారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు మాత్రం వేరుశనగకే అధికంగా ప్రాధాన్యమిస్తారు.

Tags
English Title
Subsidy Seed prices are finalized
Related News