చాపకింద నీరులా తెలంగాణ బీజేపీ బలోపేతం

Updated By ManamWed, 06/13/2018 - 00:41
bjp
  • రాష్ట్ర బీజేపీ  అధ్యక్షుడు లక్ష్మణ్.. దక్షిణాదిపై అదిష్టానం ప్రత్యేక దృష్టి 

  • తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటే.. దళితుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

imageహైదరాబాద్: తెలంగాణలో బీజేపీ చాపకింద నీరులా బలోపేతం అవుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఇటీవల అనేక మంది మేధావులు, యువత తమ పార్టీలో చేరారని, చేరుతూనే ఉన్నారని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోనిఆ పార్టీ కార్యాలయంలో జగిత్యాల, కార్వాన్ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ వారికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ నాలుగేళ్ల మోదీ పాలనకు ఆకర్షితులై అనేక మంది బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ప్రపంచలోనే అతిపెద్ద పార్టీగా కొనసాగుతూ దేశవ్యాప్తంగా విజయకేతనం ఎగురువేస్తోందన్నారు. పార్టీ అధిష్టానం దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలను నేరుగా ఎదుర్కోలేక కుల, మత, ప్రాంతాల పేరుతో వివిధ పార్టీలు విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస పార్టీ తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.

ప్రధాని మోదీని అడ్డుకోవడమే లక్ష్యంగా సిద్ధాంతాలకు విరుద్ధంగా పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు వేరు కాదని, కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ మాదిరిగా ఒక్కటేనన్నారు. మజ్లిస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి లభించాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కునే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు. దళితుల అభివృద్ధి సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, అధికార ప్రతినిధి ఎన్వీసుభాష్, సుధాకర్ శర్మ, అమన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

English Title
Strengthening the Telangana BJP as it is in the mat
Related News