35 లెవల్ క్రాసింగ్స్‌లో ఆగి.. సాగే బండి!

Updated By ManamWed, 07/11/2018 - 23:35
train
  • గేటు వేసి.. తీసేందుకు రైల్లోనే ఇద్దరు

  • తమిళనాడులో చికుబుకు రైలుకు గేటు చిక్కులు!

trainతిరుచిరాపల్లి: ‘‘చికుబుకు రైలు వస్తోంది.. ఆగిన తర్వాత ఎక్కండి’’... ఇది చిన్నప్పుడు అందరూ పాడుకునే ఉంటారు!! కానీ తమిళనాడులో ఇది కొంచెం భిన్నంగా చెప్పుకొంటున్నారు. ‘‘చికుబుకు రైలు వస్తుంది.. లెవల్ క్రాసింగ్‌లో ఆగీ.. ఆగీ.. సాగేనూ.. ముందే చూసుకు గేటు దాటండీ!!’’ అని జనం నవ్వులాటగా పాడుతున్నారు. ఎందుకా అనుకుంటున్నారా? దక్షిణ రైల్వే పరిధిలోని తిరుచురాపల్లి డివిజన్‌లో కరైకూడి - పట్టుకొట్టాయ్ మధ్య నడిచే రైలుకు ఇలా ప్రతి లెవల్ క్రాసింగ్ వద్ద బ్రేకులు పడిపోతున్నాయ్ కాబట్టే!! గత నెల 30వ తేదీనే ఈ మార్గంలో బై వీక్లీ (సోమవారం, గురువారం) రైలును ప్రారంభించారు. ఈ ఒక్క రైలు మాత్రమే ఆ మార్గంలో ప్రయాణిస్తుంది. దీనికి మొదటి స్టేషన్ నుంచి గమ్యం చేరేలోపు మొత్తం 7 స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఇది ఆగేది మాత్రం 42 చోట్ల!! దీనికి కారణం ఆ మార్గంలోని కాపలా లేని లెవల్ క్రాసింగ్ గేట్లే. అది గమ్యం చేరేలోపు 35 గేట్లు ఉన్నాయి. వాటన్నింటిలో సిబ్బందిని పెట్టాలంటే కనీసం 70 మంది అవసరమవుతారని దక్షిణ రైల్వే అధికారులు వినూత్న ఆలోచన ఆలోచన చేశారు. రైలు ఇంజన్‌లో ఒక ఉద్యోగిని.. చివరి బోగీలో మరోకరిని పెట్టింది. లెవల్ క్రాసింగ్‌కు కొద్ది మీటర్ల దూరంలోనే ఆ రైలు ఆగిపోతోంది. వెంటనే ముందున్న వ్యక్తి వెళ్లి గేటును మూసి మళ్లీ రైలు ఎక్కేస్తాడు. అలాగే గేటు దాటగానే వెనుకున్న వ్యక్తి గేటు తెరిచి వస్తాడు. ఇలా ఇద్దరు సిబ్బందితోనే రైల్వే పని కానించేస్తోంది. దీంతో కేవలం 72 కిలోమీటర్ల ప్రయాణానికి మూడున్నర గంటల సమయం పడుతోంది. అయితే తిరుచిరాపల్లి డివిజన్ రైల్వే మేనేజర్ ఉదయ్ రెడ్డి మాత్రం ఇంతకు మించి మరో ప్రత్యామ్నాయం లేదని, ఒకే ఒక్క రైలు కోసం లెవల్ క్రాసింగ్‌ల వద్దే భారీ సంఖ్యలో సిబ్బంది అంటే కష్టమని చెబుతున్నారు. త్వరలో మరో మార్గంలోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు. విరుధాచలం - కుడలోర్ (58 కిలోమీటర్ల మార్గం) మధ్య మూడే రైళ్లు నడుస్తున్నాయని, ఆ రూట్‌లో 62 లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే ఈ విధానాన్ని దక్షిణ రైల్వే ఉద్యోగ సంఘం ఉపాధ్యక్షుడు ఆర్ ఎలంగోవన్ తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. రైలు ప్రయాణం మరింత ఆలస్యం కావడంతో పాటు భద్రతకు కూడా నీళ్లు వదలడవేునని మండిపడ్డారు. 

Tags
English Title
Stop at 35th level crossings and go on!
Related News