బుర్ఖా వేసుకోను.. నా మతాన్ని కించపరచను.. ఆడలేను

Updated By ManamWed, 06/13/2018 - 14:53
Soumya Swaminathan Out of Iran Championship due to Burkha Rule
  • ఇరాన్ చెస్ చాంపియన్‌షిప్ నుంచి తప్పుకున్న సౌమ్య స్వామినాథన్.. ఆవేదనాభరితమైన పోస్ట్

Soumya Swaminathan Out of Iran Championship due to Burkha Ruleఒక్క నిబంధన.. ఒకే ఒక్క నిబంధన.. ఆమెను నేషనల్ చాంపియన్‌షిప్ నుంచి దూరం చేసేసింది. చెప్పాలంటే ఆ నిబంధనను భరించలేని ఆమె తనకు తానే దూరమైంది. తన హక్కులను, మత విలువలను వదులుకోలేక.. చాంపియన్‌షిప్‌నే వదిలేసుకుంది. ఆమె పేరు సౌమ్య స్వామినాథన్. చెస్ మహిళా గ్రాండ్ మాస్టర్ ఆమె. జూలై 26 నుంచి ఆగస్టు 4 వరకు ఇరాన్‌లో నిర్వహించే ఏషియన్ నేషన్స్ కప్ చెస్ చాంపియన్‌షిప్ 2018కి ఎంపికైంది. కానీ, ఆ చాంపియన్‌షిప్‌కు ఇరాన్ ఓ నిబంధన విధించింది. ఆ దేశ చట్టాల ప్రకారం ప్రతి మహిళా తలకు స్కార్ఫ్ ధరించాలి. లేదంటే బుర్ఖా వేసుకోవాలి. ఆ నిబంధనను జీర్ణించుకోలేకపోయిన సౌమ్య.. పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ప్రకటించింది.

‘‘ఇరాన్‌లో నిర్వహించే చాంపియన్‌షిప్‌లో పాల్గొనలేను. అందుకు నన్ను మన్నించాల్సిందిగా కోరుకుంటున్నాను. బలవంతంగా నా తలకు బుర్ఖా వేసుకోవడమో లేదంటే స్కార్ఫ్ కట్టుకోవడమో చేయలేను. బుర్ఖా వేసుకోవాలన్న నిబంధన నా ప్రాథమిక హక్కులను హరింపజేసేదే. భావ స్వేచ్ఛ, మత విశ్వాసాలను హరించేదే. కాబట్టి నా మత విలువలను వదులుకుని, నా హక్కులను కాల రాసే నిబంధనలను పాటించి చాంపియన్‌షిప్‌లో పాల్గొనలేను. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నా విశ్వాసాలు, హక్కులను కాపాడుకోవాలంటే ఇరాన్‌కు పోకుండా ఉండడమే మేలైన దారి. ఇలాంటి ప్రత్యేకమైన చాంపియన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆటగాళ్ల సంక్షేమం, హక్కులు పట్టించుకోకపోవడం అసంతృప్తికి గురి చేసింది. కనీసం మా జాతీయ టీం డ్రెస్సో లేదంటే ఫార్మల్సో వేసుకోవాలంటే వేసుకునేవాళ్లం. కానీ, ఒకరి మత విశ్వాసాలను వేరే వారి మీద రుద్దాలనుకోవడమే నచ్చలేదు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం నేను గౌరవంగా భావిస్తా. కానీ, ఈ సారి మాత్రం చాంపియన్‌షిప్‌లో పాల్గొనలేకపోవడంతో చింతిస్తున్నా’’ అని ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించింది సౌమ్య స్వామినాథన్. 

English Title
Soumya Swaminathan Out of Iran Championship due to Burkha Rule
Related News