ఫెయిలైతే అంబరాన్నంటేలా సంబరాలు

Updated By ManamWed, 05/16/2018 - 11:29
Son Tenth Failed; Father Celebrates in Cloud Nine
  • టెన్త్‌లో కొడుకు ఫెయిల్ అయినందుకు వీధుల్లో పండగ చేసిన తండ్రి

Son Tenth Failed; Father Celebrates in Cloud Nineభోపాల్: పరీక్షల్లో ఫెయిలైతే ఎవరైనా ఏం చేస్తారు? ఏ తండ్రైనా తన పిల్లలను ఏమంటారు? ఏ తల్లిదండ్రులైనా సరే దాదాపు తలంటేస్తారు. చివాట్లు పెడతారు. కానీ, మధ్యప్రదేశ్‌లో ఓ తండ్రి మాత్రం తన కొడుకు పదో తరగతిలో ఫెయిల్ అయినందుకు పండగ చేశాడు. అంబరాన్నంటేలా సంబరాలు చేశాడు. వీధుల్లో తన కొడుకును ఊరేగించాడు. టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేశాడు. ఎందుకయ్యా ఇది.. ఏమైనా శుభవార్తా అని చుట్టుపక్కల వాళ్లు అడిగితే.. నవ్వుతూ ‘అబ్బే అదేం లేదండీ.. నా కొడుకు టెన్త్‌లో ఫెయిలయ్యాడు’ అంటూ అందరి దిమ్మలు తిరిగిపోయేలా సమాధానం ఇచ్చాడు. కొడుకు ఫెయిలైతే ఎవరైనా తిడతారు ఇలా సంబరం చేయడమేంటయ్యా అని అడిగితే.. నిజమే కానీ, చాలా మంది పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న కారణంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అలా జరగకుండా ఉండాలంటే పిల్లలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆ తండ్రి సమాధానమిచ్చాడు.

‘‘జీవితంలో ఈ ఒక్కసారే పరీక్షలు ఉండవు కదా.. పరీక్ష తప్పితే మరోసారి రాసి పాసవ్వొచ్చు కదా.. అందుకే ఇలా తన కొడుకు ఫెయిల్ అయినా తనలో స్ఫూర్తి నింపేందుకే సంబరం చేస్తున్నా’’ అని ఆ తండ్రి గర్వంగా చెప్పాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో జరిగింది. ఇటీవలే మధ్య ప్రదేశ్ విద్యా బోర్డు పదో తరగతి ఫలితాలను వెల్లడించింది. ఆ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థి ఆయుష్. అలా తన కొడుకు ఆయుష్ ఫెయిల్ అయినందుకు ఇలా సంబరం నిర్వహించింది సివిల్ కాంట్రాక్టర్ అయిన సురేంద్ర కుమార్ వ్యాస్. తన లాగే ఇతర తల్లిదండ్రులూ ఫెయిలైన తమ పిల్లలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాడు సురేంద్ర కుమార్ వ్యాస్. ఇక, తన తండ్రి ఇలా సంబరాలు నిర్వహించడం పట్ల సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు ఆయుష్. వచ్చే సంవత్సరం ఫలితాల్లో కచ్చితంగా టాప్ క్లాస్ మార్కులతో పాస్ అవుతానని తన తండ్రికి మాటిచ్చాడు.

English Title
Son Tenth Failed; Father Celebrates in Cloud Nine
Related News