నిద్రలో.. టక టకా!

mobile chatting
  • యువత కొత్త అలవాటు స్లీప్ టెక్ట్సింగ్

  • నిద్రపోతుంటే చేతిపక్కనే సెల్‌ఫోన్.. సగం నిద్రలోనే వాట్సాప్.. ట్విట్టర్

  • మోత మోగగానే తక్షణం స్పందన.. అర్థం పర్థం లేని వాక్యాల టెక్ట్సింగ్

  • 25% పైగా యువతకు అలవాటు.. విల్లనోవా యూనివర్సిటీలో గుర్తింపు

  • ఫోనుకు బానిసలు కావడం వల్లే.. నిద్రకూ దూరమవుతున్న యువత

నిద్రలో నడవడం అంటే మనకు తెలుసు. నిద్రలో కలవరించడం గురించి కూడా బాగానే విని ఉంటాం.. కొంతమందిని చూసి కూడా ఉంటాం. కానీ, నిద్రలోనే ఫోన్ తీసుకుని, దాన్ని అన్‌లాక్ చేసి ఏకంగా మెసేజ్ పంపడం గురించి మీరెప్పుడైనా విన్నారా? దాన్నే ఇప్పుడు ‘స్లీప్ టెక్ట్సింగ్’ అంటున్నారు. ఫోన్ వాడకం బాగా ఎక్కువైన తర్వాత చేతులు ఆటోమేటిగ్గా పనిచేయడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అలా మెసేజ్ పంపినట్లు తెల్లవారి లేచిన తర్వాత కూడా గుర్తు ఉండట్లేదట! ఈ విషయాన్ని పెన్సల్వేనియాలోని విల్లనోవా యూనివర్సి టీ పరిశోధకులు గుర్తించి చెప్పారు. ముఖ్యంగా టీనేజర్లు, 20లలో ఉన్నవారిలో ఈ తరహా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు వేర్వేరు యూని వర్సిటీలకు చెందిన 372 మంది విద్యార్థులను పరిశోధ నకు నేతృత్వం వహించిన విల్లనోవా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎలిజబెత్ బి డావెల్ ఇంటర్వ్యూ చేశారు. వాళ్ల నిద్ర అలవాట్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారిలో నాలుగోవంతు మందికిపైగా నిద్రలో మెసేజిలు పంపుతు న్నట్లు గుర్తించారు. నిద్రపోయేటప్పుడు ఫోన్ దగ్గరలో పెట్టుకుని ఉన్నారా.. లేదా అనే విషయం అడి గారు. 25%మందికి పైగా నిద్రలో ఫోన్ చేతికి అందుబా టులో ఉండేలా పెట్టుకుని ఉంటున్నారని..వాళ్లంతా నిద్ర లోనే టెక్ట్సింగ్ చేస్తున్నారని తేలింది. ఇలా చేసేవారిలో 72% మందికి అసలు తాము మెసేజ్ పంపినట్లు గుర్తు కూడా లేదట. కొంతమందైతే ఈ అలవాటు మానుకోడా నికి చేతులు పూర్తిగా మూసి ఉంచే గ్లోవ్స్ కూడా ధరిస్తున్నారు. 

ఫోనుకు బానిసలు
ఆధునిక తరంలో చాలామంది ఫోనుకు పూర్తి స్థాయిలో బానిసలుగా మారుతున్నారని, అందువల్లే ఇలా ‘స్లీప్ టెక్ట్సింగ్’ అలవాటు అవుతోందని డోవెల్ తెలిపారు. నిద్రలో నడక అనేది శరీరంలోని అంతర్గత సిగ్నళ్ల కారణంగా వస్తే.. స్లీప్ టెక్ట్సింగ్ మాత్రం బయట నుంచి వినపడే శబ్దాల వల్ల వస్తోందని ఆమె వివరించారు. ఎక్కడి నుంచైనా చిన్న బీప్ గానీ, ట్వీట్ చేసినప్పుడు వచ్చే శబ్దం గానీ వినిపిస్తే చేతులు ఆటోమేటిగ్గా ఫోన్ మీదకు వెళ్లి ఏదో ఒకటి టైప్ చేసేస్తాయని ఆమె విశ్లేషించారు. ఆ శబ్దం విన్నప్పుడు వాళ్లకు ఒక రకమైన సంతోషంగా అనిపిస్తుందని, అందుకే వెంటనే ఫోన్ చేతుల్లోకి తీసుకుంటారని అన్నారు. ఒకోసారి ఇలా ట్విట్టర్ ఓపెన్ చేసి హ్యాష్‌ట్యాగ్‌తో అర్థం పర్థం లేని పదాలు పెట్టేస్తున్నారట. ఉదాహరణకు... ‘‘ఐ లెగిట్ విష్ వెగిర్డ్ వర్ ఇనఫ్ టూ ఫ్యూయల్‌మీ’’, ‘‘లిప్స్ ఐ డ్రిప్‌డ్ ఇట్’’ అని.. ఇలా రకరకాలుగా రాసేస్తున్నారు. ఇలా నిద్రలో టెక్ట్సింగ్ చేసేవాళ్లకు నిద్ర కూడా సరిగా పట్టడం లేదట. సగటున వీళ్లు 6 నుంచి 6.9 గంటలు మాత్రమే ప్రతిరోజూ రాత్రి పడుకుంటున్నారు. నిజానికి కనీసం 8 గంటల పాటు పూర్తి నిద్ర ఉంటేనే మెదడు బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇలా నిద్ర సరిపోకపోవడం, రాత్రిపూట ఎక్కువసేపు మెలకువగా ఉండి ఫోన్లలోనే గడిపేయడం, దానికితోడు డ్రగ్స్ కూడా తీసుకోవడం లాంటి కారణాల వల్ల వారి ఆయప్రమాణం కూడా కొంతవరకు తగ్గుతోందని పరిశోధనలలో తేలింది. 

అమెరికన్లలోనే ఎక్కువ...
నిద్రపోతూనే టెక్ట్సింగ్ చేసే అలవాటు ఎక్కువగా అమెరికన్లలో కనపడుతోంది. వాళ్లు స్మార్ట్ ఫోన్లకు బాగా బానిసలైపోయారు. దాదాపు ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసుకోకుండా ఉండలేకపోతున్నారట. అందుకే సగం నిద్రావస్థలో కూడా ఫోన్లకు అతుక్కు పోతున్నారని, నిద్రపోతున్నప్పుడు కూడా వదలడం లేదని చెప్పారు. ఈ విషయాలన్నీ జర్నల్ ఆఫ్ అమెరి కన్ కాలేజ్ హెల్త్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. 

తగినంత నిద్ర ఏదీ...
అమెరికన్లలో చాలామంది ఆరోగ్యంగా ఉండాలంటే కావల్సినంత నిద్ర పోవడం లేదు. ముఖ్యంగా కాలేజి విద్యార్థులు అసలు విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని, చాలామంది ఆరు గంటలు మాత్రమే సగటున నిద్రపోతున్నారని చెప్పారు. నిద్రపోయే సమయంలో కూడా చేతిపక్కనే ఫోన్ పెట్టుకోవడం వల్ల నిద్ర బాగా తగ్గిపోతోంది. అలా సగం నిద్రపోతూ అర్థం పర్థం లేని పదాలు, వాక్యాలు టైప్ చేసి ఎవరెవరికో పంపేస్తున్నారు. అయితే కాస్తలో కాస్త అదృష్టం ఏమిటంటే, టెక్ట్స్ పంపేటపుడు స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా ఎవరికి పంపుతుం టామో వాళ్ల పేర్లే ముందు వస్తాయి కాబట్టి బాగా తెలిసినవారికే ఎక్కువగా ఈ సందేశాలు వెళ్తున్నాయి. వీళ్ల సంగతి ఎటూ తెలుసు కాబట్టి.. అవతలి వాళ్లు కూడా ఊరుకుంటున్నారు. తెల్ల వారుజామున 3 గంటల సమయంలో మాజీ బోయ్ ఫ్రెండు లేదా గర్ల్‌ఫ్రెండుకు కూడా ఇలాంటి సందేశాలు వెళ్తున్నాయి. వాటిని చూసి వీళ్లు నిద్రలో పంపారులే అనుకుని వదిలేస్తున్నారట. అలా వదిలేయడం వల్ల సరిపోతోంది గానీ, వాటిని సీరియస్‌గా తీసుకుంటే మాత్రం కొంప కొల్లేరే అవుతుందని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు