శుభాల శ్రావణం

Updated By ManamTue, 08/07/2018 - 01:50
shravanam

శ్రావణమాసం శుభాలకు నెలవు. మనవారు ఈ మాసంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్రతాలు, నోములు చేపడతారు. మహావిష్ణువును, లక్ష్మిని, గౌరిని ప్రత్యేకంగా పూజిస్తారు. నోములు, పేరంటాలతో మహిళలందరూ ఈ నెల్లాళ్లూ కోలాహలంగా ఉంటారు. పసుపు పాదాలతో, శనగ వాయినాలతో శ్రావణమాసం ప్రతిరోజూ ఓ పండుగలా సాగిపోతుంది. ఈ ఆదివారం నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతున్న సందర్భంగా....

image


చాంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు నెలల్లో అయిదోది శ్రావణమాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తాడు. శ్రావణమాసంతో వర్షరుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తులలో స్థితికారుడు, దుష్టశిక్షకుడు శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసమిది. వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలను ప్రసాదించే దివ్యమాసం శ్రావణమాసం. శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం. అటువంటి శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసం శ్రీమహావిష్ణు పూజకు ఉత్క ష్టమైన మాసం.

మాఘమాసంలో ఆదివారాలు, కార్తికమాసంలో సోమవారాలు, మార్గశిరమాసంలో గురువారాలు పుణ్యప్రదమైనవి. శ్రావణమాసంలో మాత్రం మంగళ, శుక్ర, శనివారాలు మహత్తు కలిగినవి.... ప్రధానమైనవి. శ్రావణంలో మంగళవారాల్లో గౌరీదేవిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని, శనివారాల్లో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా పూజిస్తారు. 
మాసం మొదటి తిథి అయిన పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉండే పదిహేను రోజులనూ శుక్లపక్షం అంటారు. ఇవి ఎంతో విశేషమైనవి. ఒక్కోరోజు ఒక్కోదేవుని పూజించాలని, పవిత్రారోపణోత్సవాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పవిత్రం అంటే దర్భలతో తయారు చేసిన వేలి తొడుగు. దర్భ అత్యంత పవిత్రమైనది. అటువంటి దర్భను ఉపయోగించి 108 ముడులతో కాశీదారంలా తయారుచేసి దానితో ఆయాదేవుళ్లను అలంకరించి పూజిస్తారు. 

శుక్లపక్షంలోని పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు పూజించవలసిన దేవతల పేర్లు వరుసగా చెప్పాలంటే... పాడ్యమి-బ్రహ్మదేవుడు, విదియ- శ్రియఃపతి, తదియ-పార్వతీదేవి, చవితి- వినాయకుడు, పంచమి-చంద్రుడు, షష్ఠి- సుబ్రహ్మణ్యస్వామి, సప్తమి-సూర్యుడు, అష్టమి- దుర్గాదేవి, నవమి-మాత దేవతలు, దశమి- యమధర్మరాజు, ఏకాదశి-మహర్షులు, ద్వాదశి -శ్రీమహావిష్ణువు, త్రయోదశి-మన్మథుడు, చతుర్దశి -శివుడు, పూర్ణిమ-పిత దేవతలు..... ఈ విధంగా శుక్లపక్షంలోని ఒక్కోరోజుకు ఒక్కోదేవతను పూజించడం వల్ల సంవత్సరంలో చేసే పూజలన్నీ పవిత్రమవుతాయంటారు. ఎటువంటి సమస్యలూ రావని, సంపద వృద్ధి చెందుతుందని చెబుతారు. 
వ్రతాలు, నోములను చేపట్టడానికి శ్రావణం శుభకరమైన మాసం. శ్రావణమాసంలోని మంగళవారాల్లో కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు మంగళగౌరీ వ్రతం చేస్తారు. అయిదేళ్లపాటు కొనసాగించే మంగళగౌరీ వ్రతం సౌభాగ్యాన్ని వృద్ధి చేస్తుందని నమ్ముతారు. ఇంకా పౌర్ణమి తరువాత వచ్చే శుక్రవారం నాడు స్త్రీలందరూ వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు. వర్షరుతువులో తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవలసిన శనగలను నానబెట్టి మహిళలు పంచుకుంటారు. బురదనీటిలో తిరిగే కాళ్లకు అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా ముత్తయిదువలు ఒకరి కాలికి మరొకరు పసుపు పారాణి దిద్దుతారు. వాయినాల పేరుతో స్త్రీల మధ్య ఆప్యాయత, అనురాగాలు వెల్లివిరుస్తాయి.

వేంకటేశ్వరస్వామి భక్తులకు శ్రావణమాసం అతిముఖ్యమైనది. వేంకటేశ్వరుని వద్ద శ్రావణంలోని ఏదో ఒక శనివారం నాడు పిండి దీపారాధన చేస్తారు. బియ్యపు పిండి, నెయ్యి, బెల్లం లేదా చక్కెర కలిపి చలిమిడిలా సిద్ధం చేసుకోవాలి. దానిని ప్రమిదలా నొక్కి తయారు చేసుకుని ఆవునెయ్యి పోసి దీపాలు వెలిగించాలి. శ్రీవేంకటేశ్వరుని శక్తికొద్దీ పూజించి నైవేద్యం సమర్పించాలి. దీపం కొండెక్కిన తరువాత చలిమిడిని ప్రసాదంగా స్వీకరించాలి. మాసాలలో కెల్లా శుభకరమైన శ్రావణమాసంలో ఆచరించిన పూజలు శీఘ్రఫలితాలను ఇస్తాయి.

English Title
Shubhaala shravanam
Related News