టపాసులు కాల్చారని.. అరెస్టు!

Updated By ManamFri, 11/09/2018 - 23:39
india-supreme-court
  • ఢిల్లీలోనే 562 కేసులు నమోదు.. ఇప్పటికి 310 మంది అరెస్టు

  • దేశవ్యాప్తంగా భారీగా కేసులు

  • సుప్రీం ఆదేశాల ఉల్లంఘనలు

  • పలు రాష్ట్రాల్లో అరెస్టుల పర్వం

india-supreme-courtన్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా టపాసులు కాల్చినందుకు పలువురిపై పోలీసు కేసులు నమోదయ్యాయి. దీపావళికి ముందు, తర్వాత కాలుష్యం స్థాయిని నమోదుచేసిన అధికారులు.. అది ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎవరెవరు ఎక్కువ సేపు టపాసులు కాల్చారో గుర్తించి వారిపై 562 కేసులు నమోదుచేశారు. ఇప్పటివరకు 310 మందిని అరెస్టు చేశారు. ఆదేశాలు పాటించనందుకు ఐపీసీ సెక్షన్ 188 కింద వీరు అరెస్టయ్యారు. ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని, అవి కూడా ఎక్కువ శబ్దం రానివి, అధిక కాలుష్యం వెదజల్లని ‘హరిత టపాసులు’ మాత్రమే కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ ఢిల్లీ సహా దేశంలోని పలు నగరాల్లో అక్రమంగా అన్నిరకాల టపాసులను అమ్మడంతో కాలుష్యం స్థాయి అత్యంత దారుణమైన స్థితికి దిగజారింది. నిషేధించిన టపాసులు అమ్మినా, రెండు గంటలకు మించి కాల్చినా ఆయా ప్రాంతాల పరిధిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లను బాధ్యులుగా చేస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ, అలాంటి టపాసులు ఢిల్లీలో చాలాచోట్ల అమ్మారు. అరెస్టు చేసిన వారికి తర్వాత బెయిల్ మంజూరుచేసి విడిచిపెట్టామని, అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించనందుకు 24 మంది పిల్లలపై బాలనేరస్తుల చట్టం కింత తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ పోలీసుల అధికార ప్రతినిధి మాధుర్ వర్మ చెప్పారు. గురువారం మధ్యాహ్నం వరకు ఢిల్లీ వాయు నాణ్యత ‘అత్యంత దారుణం’గానే ఉంది. తర్వాత ఉష్ణోగ్రత పెరగడంతో కలుషితాలు కాస్త తగ్గాయి. ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో అయితే పర్టిక్యులేట్ మేటర్ ఏకంగా క్యూబిక్ మీటరుకు 1800 మైక్రోగ్రాములు నమోదైంది. నిజానికి ప్రమాణాల ప్రకారం అది 60 మైక్రోగ్రాములు మాత్రమే ఉండాలి. గురువారం నుంచి ఆదివారం వరకు ట్రక్కులు నగరంలోకి రాకూడదని ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే పాలు, కూరగాయలు, ఇతర సరుకుల్లాంటి నిత్యావసర సరుకులు తెచ్చేవాటిని దీన్నుంచి మినహాయించారు. ఢిల్లీకి ఇరుగుపొరుగునున్న గౌతమబుద్ధ నగర్‌లో 58 కేసులు, చండీగఢ్‌లో 34 కేసులు పెట్టారు. నవంబరు ఐదో తేదీ నుంచే అరెస్టులు మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. రోహతక్‌లో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి టపాసులు అమ్ముతున్న నలుగురు దుకాణదారులను అరెస్టు చేశారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం నాటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) దారుణం, అత్యంత దారుణంగానే ఉంది. అసోంలో 150 మందిని అరెస్టు చేయగా, కోల్‌కతాలో 306 మందిని అరెస్టు చేశారు. 

English Title
Shoots bosses .. arrested!
Related News