సర్వీసుల్లోనూ జోష్

Nikai India Services Business
  • సర్వీసుల పి.ఎం.ఐ నవంబర్‌లో నాలుగు నెలల అధిక స్థాయి 53.7గా నమోదైంది

న్యూఢిల్లీ: దేశంలో సర్వీసుల రంగంలో కార్యకలాపాలు నవంబర్‌లో అత్యంత వేగవంతమైన రీతిలో విస్తరించాయని నెలవారీ సర్వే ఒకటి వెల్లడించింది. కొత్త పని ఆర్డర్లు, సానుకూల మార్కెట్ పరిస్థితులు ఉద్యోగాల సంఖ్య పెరగడం కొనసాగడానికి దారితీశాయని, జూలై తర్వాత, తిరిగి అత్యంత వేగవంతమైన రీతిలో సేవల రంగ కార్యకలాపాలు విస్తరిచాయని సర్వే పేర్కొంది. నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ కార్యకలాపాల సూచి నవంబర్‌లో నాలుగు నెలల గరిష్ఠ స్థాయి 53.7 వద్ద నిలిచింది. ఇది అక్టోబర్‌లో 52.2గా ఉంది. సానుకూల మార్కెట్ పరిస్థితులు, అమ్మకాల్లో వృద్ధి వంటి అంశాలు కార్యకలాపాలను పెంపొందింపజేశాయని సంస్థలు వెల్లడించాయి. దీనితో సర్వీసుల పి.ఎం.ఐ వరుసగా ఆరవ నెలలోనూ విస్తరించినట్లయింది. పి.ఎం.ఐ పరిభాషలో 50కి ఎగువ వ్యాకోచం, 50కి దిగువ సంకోచం కింద లెక్క. 

ఎగబాకిన కాంపోజిట్ సూచి
వస్తూత్పత్తి, సర్వీసుల రంగాలు రెంటినీ మేళవించుకున్న నికాయ్ ఇండియా కాంపోజిట్ పి.ఎం.ఐ ఔట్‌పుట్ ఇండెక్స్ కూడా అక్టోబర్‌లో ఉన్న 53 నుంచి నవంబర్‌లో 54.5కి పెరిగింది. ప్రైవేటు రంగ కార్యకలాపాలు 2016 అక్టోబర్ తర్వాత తిరిగి అంత అత్యంత వేగవంతమైన విస్తరణను చవిచూశాయి. ‘‘వస్తూత్పత్తి పరిశ్రమ నుంచి కూడా ఇదే రకమైన ఆశావహమైన ఫలితాలు ఈ వారం మొదట్లో వెల్లడయ్యాయి. దానికి ఇప్పుడు సేవల రంగ ఫలితాలు కూడా తోడయ్యాయి. ఇంతవరకు అవి 2018-19 ఆర్థిక సంవత్సరం క్యూ 3 జి.డి.పి ఫలితాలకు ప్రైవేటు రంగ ఆర్థిక వ్యవస్థ ఊతమివ్వబోతోందని సూచిస్తున్నాయి’’ అని ఈ నివేదిక రూపశిల్పి, ఐ.హెచ్.ఎస్ మార్కిట్‌లో ముఖ్య ఆర్థికవేత్త అయిన పాలియాన డి లిమా అన్నారు. ఉపాధి రంగంలో వరుసగా 16వ నెలలో కూడా కొత్తగా ఉద్యోగాల సంఖ్యను జోడించడం కనిపించిందని సర్వే తెలిపింది. ‘‘ఒక దశాబ్ది కాలంలోనే ఉద్యోగాల వృద్ధిలో 2018 పటిష్టమైన ఏడాదిగా  నిరూపితమవబోతోంది’’ అని లిమా అన్నారు. ధరలపై సర్వే, సర్వీసుల రంగంలో నిర్వహణ వ్యయాలు పెరగడం కొనసాగుతోందని వెల్లడించింది. మార్జిన్లు కాపాడుకునేందుకు సర్వీసు ప్రొవైడర్లు నవంబర్‌లో తిరిగి తమ అమ్మకాల ధరలు పెంచారని పేర్కొంది. మార్కెట్ స్థితిగతులలో క్రమానుగతమైన మెరుగుదలలు ఉంటాయనే జోస్యాలు ఇచ్చిన ఉత్సాహంతో సర్వీస్ ప్రొవైడర్ల వ్యాపార సెంటిమెంట్ నవంబర్‌లో పటిష్టపడిందని సర్వే తెలిపింది. ప్రైవేటు రంగంలో ఆత్మస్థయిర్యం అక్టోబర్‌లో 20 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఇపుడు నవంబర్‌లో వస్తూత్పత్తి ఆర్థిక వ్యవస్థలో కూడా ఆశావాదం అధికంగా ఉండడంతో తిరిగి బిజినెస్ కాన్ఫిడెన్స్ బలపడింది.

సంబంధిత వార్తలు