రికార్డు దిశగా ‘సెన్సెక్స్’ పరుగు

Updated By ManamWed, 07/11/2018 - 22:13
stock-market-bull
  • టీసీఎస్ ఫలితాలతో జోష్

stock-marketముంబై: సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగ దిగ్గజం టీసీఎస్ ఏప్రిల్-జూన్‌లో అంచనాలకు మించి రాణించి నికర లాభంలో 23 శాతం వృద్ధిని కనబరచడం మార్కెట్‌కు టానిక్‌లా పనిచేసింది. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) ‘సెన్సెక్స్’ వరుసగా నాల్గో సెషన్‌లోనూ పెరిగి, దాని ఆల్-టైమ్ శిఖర స్థాయికి మరింత చేరువైంది. బి.ఎస్.ఇ 30 షేర్ల ‘సెన్సెక్స్’ 26 పాయింట్లు పెరిగి బుధవారం 36,265.93 వద్ద ముగిసింది. దాని జీవిత కాల గరిష్ఠ ముగింపు (జనవరి 29 నాటి) 36,283.25కి అది తిరిగి చేరువైంది. నాలుగు సెషన్లలో ‘సెన్సెక్స్’ 691.38 పాయింట్లను పుంజుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన టీసీఎస్ నికర లాభం రూ. 7,340 కోట్లుగా నమోదైంది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో టీసీఎస్ రూ. 5,945 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మంగళవారం వెల్లడైన ఈ ఫలితాలతో బుధవారం టీసీఎస్ షేర్ ధర 5.47 శాతం పెరిగి జీవితకాల అత్యధిక స్థాయి 1979.60ని చేరింది. ‘సెన్సెక్స్’ గైనర్ల లిస్ట్‌లో దానిదే మొదటి స్థానం. ఊహించిన దానికన్నా మెరుగైన ఫలితాలు ప్రకటించిన టీసీఎస్ సెంటిమెంట్‌తో మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ కంపెనీల షేర్లన్నీ పెరిగాయి. బి.ఎస్.ఇలోని ఐటీ ఇండెక్స్ 2.38 శాతం పెరిగింది. త్రైమాసిక ఫలితాల సీజన్‌కు శుభారంభం కావడంతో, బలహీనంగా ఉన్న ప్రపంచ ధోరణిని పక్కనపెట్టి దేశీయ మదుపరుల సెంటిమెంట్ ఆశావాదంతో నిండిపోయింది. అదనంగా 200 బిలియన్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తామని అవెురికా చెప్పిన తర్వాత, ఆసియా మార్కెట్లు పతన దిశలో సాగాయి. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. తిరిగి భారత్ విషయానికి వస్తే, పార్టిసిపెంట్ల ఆశావాద కొనుగోళ్ళతో ‘సెన్సెక్స్’ పటిష్టమైన స్థితిలో ప్రారంభమై 36,362.30 స్థాయిని తాకింది. తర్వాత, లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో, అది కొన్ని పాయింట్లు కోల్పోయి 36,169.70 కనిష్ఠ స్థితిని చూసింది. చివరకు 26.31 పాయింట్ల లాభంతో 36,265.93 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ నామమాత్రంగా 1.05 పాయింట్ల లాభంతో 10,948.30 వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో అది 10,923 నుంచి 10,976.65 మధ్య ఊగిసలాడింది. దేశీయ మదుపు సంస్థలు మంగళవారం రూ. 293.96 కోట్ల విలువ చేసే ఈక్విటీలను కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 20.73 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించినట్లు తాత్కాలిక డాటా సూచించింది. 

English Title
'Sensex' runs on record
Related News