యూపీలో బీజేపీకి భారీ షాక్

Savitribai Phule
  • ఎంపీ సావిత్రిభాయి ఫూలె బీజేపీకి రాజీనామా

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ సావిత్రిభాయి ఫూలె భారతీయ జనతా పార్టీకి గురువారం రాజీనామా చేశారు. హనుమంతుడు దళితుడేనని, అందుకే ఆయన అవమానాలు ఎదుర్కొవాల్సి వచ్చిందంటూ వ్యాఖ్యలు చేసి కలకలం రేపిన ఆమె... బీఆర్ అంబేద్కర్ వర్థంతి రోజే బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజైన్ చేశారు. బీజేపీలో తాను చేయడానికి ఏమీ లేదని సావిత్రిభాయి ఫూలె వ్యాఖ్యానించారు.  బీజేపీ సమాజంలో అంతరాలు పెంచుతుందని, అసమానతలు సృష్టిస్తోందంటూ విమర్శించారు. రానున్న కాలంలో దళితులు, బీసీలకు అమలు అవుతున్న రిజర్వేషన్లు దూరం చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు.  

దళితుల అభ్యున్నతికి తన పోరాటం కొనసాగుతుందన్న సావిత్రిభాయి ఫూలె... వచ్చే జనవరి 23న లక్నోలో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పనిలో పనిగా ఆమె యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. యోగి ఆదిత్యనాథ్‌ ఎప్పుడైనా దళితులను కౌగిలించుకున్నారా? అని ప్రశ్నిస్తూ... ఎన్నికల కోసం యోగి డ్రామాలాడుతున్నారని సావిత్రిఫూలె వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని దేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలు గమనించాలని ఆమె కోరారు.

నిజంగా దళితులంటే యోగికి ప్రేమ ఉన్నట్లు అయితే హనుమంతుడిని అభిమానించే దాని కంటే రెట్టింపుగా వారిని ప్రేమించాలని సూచించారు. కాగా సావిత్రిభాయి ఫూలె ఉత్తరప్రదేశ్ లోని బరేక్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తాను బీజేపీ సభ్యత్వనికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, తన పదవి కాలం ముగిసేవరకు ఎంపీగా కొనసాగుతానని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు