సరైనోళ్లు

Updated By ManamSat, 11/10/2018 - 00:30
grand parents

imageపెద్దల వద్ద పెరిగిన పిల్లల ప్రవర్తన చక్కగా ఉంటుంది.. ఇలా పెరిగిన వాళ్లే సరైనోళ్లు. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపీ) కూడా తాజాగా ఇదే తేల్చింది. తల్లిదండ్రుల సమక్షంలో పెరిగిన పిల్లలకు, అమ్మమ్మా-తాతయ్య, నాన్నమ్మ-తాతయ్య వద్ద పెరిగిన పిల్లలకు మధ్య చాలా వ్యత్యాసాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని చిన్న పిల్లల వైద్య నిపుణులు గట్టిగా చెబుతున్నారు. ఇంట్లో పెద్దవారుంటే గారాబంగా పెరిగే పిల్లలు కాస్త అల్లరి ఎక్కువ చేస్తారన్నది నిజమే కానీ.. వీరి చేతుల్లో గడిపిన బాల్యం భవిష్యత్‌లో మంచి బాటలకు పునాదులు వేస్తుంది.  
 

image

బిజీలో పడి..
దీనికి ప్రధాన కారణం పేరెంట్స్ ఇద్దరూ బిజీ, రొటీన్ జీవితంలో పడిపోయి పిల్లలకు అవసరమైనంత సమయం కేటాయించలేక.. వారితో ఎక్కువ సమయం గడపలేకపోవడమే. ఆఖరుకి చిన్నారుల చిన్న చిన్న సరదాలు కూడా తీరకుండా అటకెక్కడంతోనే పసితనం మాయమవుతుండడం నగరాల్లో కనిపించే సాధారణ సన్నివేశంగా మారిపోయింది. రేయింబవళ్లు తమ మనవళ్లు, మనవరాళ్ల కంటి ముందే ఉంటూ.. అన్ని అవసరాలను ఇట్టే క్షణాల్లో తీర్చే పెద్దల వద్ద చిన్నారులకున్న స్వేచ్ఛ చాలా ఎక్కువ.  దీంతో పిల్లలంతా వీరివద్ద చాలా ఫ్రీగా మెలుగుతూ, బాల్యాన్ని చక్కగా ఆస్వాదిస్తారు.
 

image


 ఉదయం లేచిన దగ్గరి నుంచి, రాత్రి పడుకునే వరకూ ఆటలు, పాటలు, మాటలు, కథలు, చిరుతిండ్లు.. ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల సందడిని మానసికంగా పెద్దలు ఎంజాయ్ చేస్తుంటే గ్రాండ్ చిల్డ్రన్ కూడా వీరి సురక్షితమైన చేతుల్లో హ్యాపీగా ఇట్టే పెరుగుతారని ఏఏపీ కూడా బల్లగుద్ది మరీ చెబుతోంది.

మూడు తరాలు
నిజానికి తల్లిదండ్రులకు కూడా ఇది చాలా బరువును తగ్గిస్తుంది. తమ బాధ్యతలు పంచుకోవడానికి ఇంట్లో పెద్దలు సహకరిస్తారు కనుక వీళ్లకు కూడా రిలీఫ్ లభిస్తుంది. మూడు తరాలు కలిసి ఉంటున్న ఇంట్లో ఎమోషనల్ సపోర్ట్ అన్ని వయసుల వారికి ఈజీగా దొరుకుతుంది కనుక పిల్లలకు సరదాగా బాల్యం గడిచిపోతుందని ఏఏపీ అంచనా వేసింది. ’గ్రాండ్ ఫ్యామిలీస్’ సరైన జీవన విధానమని పాశ్చాత్య దేశాల్లో పీడియాట్రీషియన్లు నేటి తరానికి చెవులో ఇల్లు కట్టుకుని చెప్పడాన్ని పనిగా పెట్టుకున్నారు. ఈమేరకు స్పెషల్ కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. ఇందుకు ఆన్‌లైన్‌లో కూడా గ్రూపులు ఏర్పాటు చేస్తూ నవతరంలో ఉమ్మడి కుటుంబాలను పునరుద్ధరించే పనిలో మానసిక నిపుణులు కూడా నిమగ్నమై ఉన్నారు. 
 

image

 

English Title
Sarainollu, right persons




Related News