రెండో రోజూ అదే వేగం

Updated By ManamFri, 05/25/2018 - 22:21
bse
  • సెన్సెక్స్ 34,900లకు చేరగా, నిఫ్టీ 10,600 వద్ద స్థిరపడింది

bseముంబయి: ఇటీవల బాగా దెబ్బతిన్న  ఇంధన, లోహ రంగ షేర్ల పట్ల శుక్రవారం అపారమైన కొనుగోలు ఆసక్తి వ్యక్తమవడంతో స్టాక్ సూచీలు వరుసగా రెండవ సెషన్‌లో పతనాన్ని నిలువరించి ఎగువ గతిలో సాగాయి. కోలుకుంటున్న రూపాయి, ప్రోత్సాహకరంగా ఉన్న కంపెనీల రాబడులు, నిర్విరామంగా సాగుతున్న దేశీయ మదుపు సంస్థల కొనుగోళ్ళు ఉత్సాహాన్ని పెంచాయని బ్రోకర్లు చెప్పారు. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి 261 పాయింట్లకు పైగా లాభపడి 34,924.87 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి నిఫ్టీ 91.30 పాయింట్లు పెరిగి 10,605.15 వద్ద స్థిరపడింది. ఉత్తర కొరియా నాయకుడు కిమ్‌తో జరగాల్సిన సమావేశాన్ని అవెురికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసుకుని, మోటారు వాహనాల రంగ దిగుమతులపై సుంకాలు విధిస్తామని హెచ్చరించడంతో అంతర్జాతీయంగా మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. బి.ఎస్.ఇ సెన్సెక్స్ శుక్రవారం 34,753.47 వద్ద పటిష్టమైన స్థితిలో ప్రారంభమై ఆరోహణను కొనసాగించి 35,017.93 స్థాయిని తాకింది. చివరకు అది 261.76 పాయింట్ల లాభంతో 34,924.87 వద్ద ముగిసింది. క్రితం సెషన్‌లో సెన్సెక్స్ 318.20 పాయింట్ల ర్యాలీని చూసింది. నిఫ్టీ కూడా భారీగా 91.30 పాయింట్లు లాభపడి 10,605.15 వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో అది 10,524 నుంచి 10,628 మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే, సెన్సెక్స్ ఓ మోస్తరుగా 76.57 పాయింట్లు పుంజుకోగా, నిఫ్టీ 8.75 పాయింట్లు మాత్రమే పెరిగింది.

మోదీ రాకతో మోదం
ఇదిఇలాఉండగా, నరేంద్ర మోదీ ప్రభుత్వ మొదటి నాలుగేళ్ళ పాలనలో  భారతీయ మార్కెట్లు గణనీయమైన పెరుగుదలను చూశాయి. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి  సెన్సెక్స్ 10,207.99 పాయింట్లు లేదా 41.30 శాతం పెరిగింది. అలాగే,  నిఫ్టీ కూడా 3,246.10 పాయింట్లు లేదా 44.11 శాతం పెరుగుదలను చూసింది.  సెన్సెక్స్ 2018 జనవరి 29న జీవితకాల అత్యధిక స్థాయి 36,443.98 పాయింట్లను తాకింది. కాగా, దేశీయ మదుపు సంస్థలు గురువారం రూ. 1,480.51 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 701.93 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించాయని తాత్కాలిక డాటా సూచించింది.

Tags
English Title
The same speed for the second day
Related News