‘RX 100’ మూవీ రివ్యూ

Updated By ManamThu, 07/12/2018 - 12:00
rx 100
rx 100

బ్యాన‌ర్‌: KCW... కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్
ఆర్టిస్టులు:  కార్తికేయ, పాయల్ రాజపుత్‌, రావు రమేష్, రాంకీ ( సింధూర పువ్వు ఫేమ్ ), సత్య, గిరిధర్, లక్ష్మణ్ త‌దిత‌రులు.
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్
లిరిక్స్:  చైతన్య ప్రసాద్, సిరాశ్రీ, శ్రీమణి
ఎడిటింగ్: ప్రవీణ్. కే .ఎల్ ( కబాలి ఫేమ్ ),  
సినిమాటోగ్రఫీ: రామ్, 
కొరియోగ్రఫీ: స్వర్ణ, అజయ్, సురేష్ వర్మ,
 స్టంట్స్: రియల్ సతీష్ 
 ఆర్ట్ డైరెక్టర్: రఘు కులకర్ణి, 
నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ , 
రచన-దర్శకత్వం: అజయ్ భూపతి.

‘‘రెగ్యుల‌ర్ సినిమాలు చూసేవాళ్లు మా సినిమాకు రావొద్దు. మేం చాలా బోల్డ్ సినిమా చేశాం. సెన్సార్ ఎ ఇచ్చిందంటేనే మా సినిమా ఎంత బోల్డ్ గా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు’’ అని డైర‌క్ట్‌గా ప‌బ్లిసిటీలో చెప్పారు `ఆర్ ఎక్స్ 100` చిత్ర యూనిట్‌. గురువారం విడుద‌లైన ఆర్ ఎక్స్ 100 నిజంగానే అంత బోల్డ్ గా ఉందా? ఈ సినిమాలో అంత బోల్డ్ గా ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకున్న‌ది ఏంటి?  చెప్పే ప్ర‌య‌త్నం చేశారు స‌రే, అందులో స‌క్సెస్ అయ్యారా? అనేది కీల‌కం. చూసేయండి మీరు..

క‌థ‌:
శివ (కార్తికేయ‌) చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రుల‌ను పోగొట్టుకుంటాడు. డాడీ (రామ్‌కీ)సంర‌క్ష‌ణ‌లో పెరుగుతాడు. ఆ ఊళ్లో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో విశ్వ‌నాథ‌మ్ (రావు ర‌మేశ్‌) ఎంపిక‌వుతాడు. అత‌ని కుమార్తె ఇందు (పాయ‌ల్). సెల‌వుల‌కు ఇంటికి వ‌స్తుంది. త‌న తండ్రి విజ‌యోత్స‌వాల్లో భాగంగా చొక్కా విప్పి డ్యాన్సులు చేస్తున్న శివ‌ని చూస్తుంది. అత‌ని శ‌రీరం మీద మ‌న‌సు ప‌డుతుంది. అలాంటి ప‌ల్లెటూరి కుర్రాడితో శారీర‌కంగా గ‌డ‌పాల‌ని అనుకుంటుంది. ప్రేమ పేరులో అత‌న్ని ముగ్గులోకి దింపి మోజు తీర్చుకుంటుంది. తండ్రికి తాను ప్రేమిస్తున్న వ్య‌క్తిగా మ‌హేశ్‌ని ప‌రిచ‌యం చేసి, అత‌న్ని వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది. అయితే ఆమె క‌ప‌టం తెలియ‌ని శివ ఆమె ప్రేమ నిజ‌మ‌నుకుంటాడు. విశ్వ‌నాథ‌మ్ త‌న‌కు  కాకుండా ఆమెకు వేరే ఒక‌రితో వివాహం చేశాడ‌ని అత‌డిని ఇబ్బంది పెడుతుంటాడు. తీరా ఆమె కోసం వెయిట్ చేసిన శివ‌కు నిజం తెలిసిందా?  లేదా? ఏం చేశాడు? అనేది ఆస‌క్తిక‌రం.

rx 100ప్ల‌స్ పాయింట్లు
- వాస్త‌వ ఘ‌ట‌న‌
- న‌టీన‌టుల ప‌నితీరు
- కొన్ని పాట‌లు
- లొకేష‌న్స్

మైన‌స్ పాయింట్లు
- క‌థ‌లో స్పీడ్ లేక‌పోవ‌డం
- ముద్దు సీన్లు ఎక్కువ కావ‌డం
- క‌న్విన్సింగ్‌గా లేక‌పోవ‌డం

స‌మీక్ష‌
ఇన్నాళ్లూ తెర‌మీద అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేయ‌డాన్ని చూశాం. కానీ ఈ చిత్రంలో అందుకు రివ‌ర్స్ లో వింత కోరిక‌లున్న అమ్మాయి, అందుకు ప్రేమ పేరుపెట్టుకున్న అమ్మాయిని చూడొచ్చు. క‌న్న కూతురు గురించి అంతా తెలిసినా ఏమీ తెలియ‌న‌ట్టు ఉండి, ఆమెకు ఇంకొక‌రితో పెళ్లి చేసే తండ్రి, త‌న కూతురి వ‌ల్ల మోసపోయాడ‌ని తెలుసుకుని శివ ప‌ట్ల లోలోన సానుభూతి ఉన్న పెద్ద మ‌నిషిని చిత్రంలో చూడొచ్చు. వాస్త‌వ ఘ‌ట‌న ఆధారంగా తీసిన‌ట్టు చూపించారు ద‌ర్శ‌కుడు. లొకేష‌న్లు కూడా నేచుర‌ల్ గా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో చూపిన‌ట్టు అమ్మాయి, అబ్బాయి ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ అంత విచ్చ‌ల‌విడిగా తిరిగే సంస్కృతి మ‌న ద‌గ్గ‌ర ఇంకా రాలేదు. ఇలాంటి సున్నిత‌మైన అంశాల‌ను తెర‌పై చూపించే ముందు మ‌న స‌మాజాన్ని గురించి ఒక‌టికి రెండు సార్లు సునిశితంగా ఆలోచిస్తే బావుంటుంది. సెన్సార్ ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రాన అన్నీ చూపించేయాల‌నేం లేదు. కుర్ర‌కారును ఆక‌ట్టుకోవ‌డానికి లిప్‌లాక్‌లు, ఇంటిమ‌సీ సీన్లే సినిమాలో ఉండాల్సిన అవ‌స‌రం లేదు. హృద్యంగా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తే చాలు . ఈసినిమాలో లిప్‌లాక్‌లకు, ఇంటిమ‌సీ సీన్ల‌కు, రికార్డ్ డ్యాన్స్ లో అందాల ఆర‌బోత‌కు ఇచ్చిన ప్రాముఖ్య‌త భావోద్వేగాల‌కు ఇవ్వ‌లేద‌న్న సంగ‌తి అర్థ‌మ‌వుతోంది. హీరో ఎంత నేచుర‌ల్‌గా చేశాడో, హీరోయిన్ అంత‌కుమించి ఇంట‌న్సిటీతో న‌టించింది. ఫ్రేమ్‌లో రావు ర‌మేశ్‌కి, రామ్‌కీకి ధీటుగా క‌నిపించింది.. ఎదిగిన పిల్ల‌ల ముందు ఇలాంటి విష‌యాల‌ను మాట్లాడుకోవ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని, మ‌న ఇళ్ల‌ల్లో ...  ఆర్ ఎక్స్ 100 ఎంత మందికి న‌చ్చుతుందో చూడాల్సిందే.

రేటింగ్: 2/5
బాట‌మ్ లైన్‌:  మైలేజ్ త‌క్కువ‌.. సౌండ్ పొల్యూష‌న్ ఎక్కువ‌.

English Title
RX 100 Movie review
Related News