రూపాయి ‘అనారోగ్యం’ తాత్కాలికమే

Updated By ManamWed, 08/15/2018 - 00:43
Subhash Chandra Garg
  • భారత్ కరెన్సీపై ఆందోళన చెందాల్సిన పని లేదంటున్న గర్గ్

Subhash Chandra Gargన్యూఢిల్లీ: డాలరుతో రూపాయి మారకం విలువ పతనమవడానికి ‘‘బాహ్య అంశాలే’’ కారణమని, దాని తరుగుదల ఇతర కరెన్సీల బాణీలోనే ఉన్నంత వరకు ఆందోళన చెందాల్సిన పని లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ స్పష్టం చేశారు. మంగళవారం లావాదేవీల్లో రూపాయి రికార్డు స్థాయిలో రూ. 70.09కి పతనమైంది. టర్కీ ఆర్థిక కష్టాలపై ప్రపంచ దేశాల ఆందోళనలు వివిధ ప్రవర్థమాన మార్కెట్లపై ప్రభావం చూపాయి. రూపాయితోపాటు వివిధ దేశాలకు చెందిన ఇతర కరెన్సీలకు వ్యతిరేకంగా అవెురికన్ డాలర్ బలపడింది. ‘‘బాహ్య అంశాల వల్ల రూపాయి క్షీణిస్తోంది....ఈ దశలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు’’ అని గర్గ్ అన్నారు. రానున్న కొద్ది రోజుల్లో ఆ అంశాలు సడలిపోగలవని ఆయన అన్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 80కి క్షీణించినా కూడా, ‘‘ఇతర కరెన్సీలు కూడా ఇంచుమించుగా అదే స్థాయిలో పతనమవుతున్నంత కాలం కంగారు పడాల్సిన అవసరం లేదు’’ అని ఆయన అన్నారు. కొన్ని ఇతర కరెన్సీలతో పోలిస్తే, భారతీయ కరెన్సీ ఇప్పటికీ మెరుగ్గానే ఉందని గర్గ్ అన్నారు. ఏప్రిల్ 1తో మొదలైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవెురికన్ డాలరుతో మారకంలో రూపాయి విలువ దాదాపు 6.7 శాతం క్షీణించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ) వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగినన్ని ఉన్నాయని ఆయన తెలిపారు. కరెన్సీ మార్కెట్లో అది జోక్యం చేసుకున్నా ప్రస్తుత స్థితిలో పెద్దగా సహాయపడకపోవచ్చని అన్నారు. బాహ్య అంశాల ఫలితంగానే రూపాయి బలహీనపడడం దానికి కారణమన్నారు. ఆగస్టు 3తో ముగిసిన వారాంతానికి ఆర్.బి.ఐ వద్ద 402.70 బిలియన్ డాలర్ల రిజర్వులు ఉన్నాయి. అంతకుముందు వారంలో ఉన్న నిల్వలకన్నా అవి 1.49 బిలియన్ డాలర్లు తక్కువని కేంద్ర బ్యాంక్ విడుదల చేసిన డాటా సూచిస్తోంది. డాలరుతో రూపాయి మారకం విలువ ఫలానా స్థాయిలో ఉండాలనే లక్ష్యాన్ని పెట్టుకోకపోవడం ఆర్.బి.ఐ ప్రకటిత వైఖరి. కాకపోతే, కరెన్సీ మార్కెట్లో తీవ్ర హెచ్చు తగ్గులు చోటు చేసుకున్నప్పుడు వాటిని సడలింపజేయడానికి అది తన దగ్గరున్న రిజర్వులను ఉపయోగించుకుంటుంది. 

ఎస్బీఐ చైర్మన్‌దీ అదే మాట
డాలరుకు వ్యతిరేకంగా అన్ని కరెన్సీలు బలహీనపడ్డాయని, ఇతర కరెన్సీలతో పోలిస్తే భారతీయ కరెన్సీ చాలా ఎక్కువగా ఏమీ బలహీనపడలేదని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్.బి.ఐ) చైర్మన్ రజనీశ్ కుమార్ అన్నారు. ‘‘రూపాయి రూ. 69-రూ. 70 మధ్య స్థిర పడాలని నేను భావిస్తున్నాను. దేశంలోకి (బాండ్లు, ఈక్విటీల రూపంలో)వచ్చిపడుతున్న పెట్టుబడుల సంఖ్యలను పరిశీలిస్తే అలానే అనిపిస్తుంది. విదేశీ పెట్టుబడికి ఈ స్థాయి ఆకర్షణీయమైనదిగా మారింది’’ అని రజనీశ్ కుమార్ అన్నారు. అన్ని ప్రవర్థమాన మార్కెట్లతోపాటు రూపాయి కూడా టర్కిష్ సంక్షోభ ప్రభావానికి లోనైందని ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్‌కు చెందిన బి. ప్రసన్న అన్నారు. ‘‘డాలరుతో మారకం విలువలో యువాన్ (చైనా) క్షీణించింది. మన కరెంట్ అకౌంట్ లోటు 2017 ఆర్థిక సంవత్సరంలో జి.డి.పిలో 0.6 శాతంగా ఉన్నదికాస్తా ఈ ఏడాది జి.డి.పిలో దాదాపు 2.5 శాతానికి బాగా పెరిగింది. ముడి చమురు ధరలు పెరగడం దానికి ప్రధాన కారణం. విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల స్థితి అప్పటికే నెగిటివ్‌గా ఉండి, మరింత అధ్వానంగా తయారవడం కూడా దానికి కారణాలే. వీటివల్ల డాలరుతో మారకంలో రూపాయి విలువ క్రమంగా రూ. 69 వరకు క్షీ ణిస్తూ వచ్చింది’’ అని ఆయన అన్నారు. ఇతర వాణిజ్య భాగస్వాముల ద్రవ్యోల్బణ తారతమ్యాలకు తగ్గట్లుగా ఉండేందుకు రూపాయి మరింత క్షీణించడం అవసరమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. 

English Title
Rupee 'illness' is only temporary




Related News