పోలింగ్ ఎఫెక్ట్: బస్సు ఎక్కితే చాలు.. బాదేస్తున్నారు..!

RTC Bus, bus fare charges, Telangana RTC, Voters, Passengers rush in Bus stations
  • సొంత ఊళ్లకు బయల్దేరిన ఓటర్లకు ఇక్కట్లు

  • 50 శాతం మేర టికెట్ రేట్లను పెంచేసిన ఆర్టీసీ

  • ఆర్టీసీ అదనపు ఒడ్డింపులతో దిక్కు తోచని స్థితిలో ఓటర్లు..

  • పోలింగ్ సందర్భంగా బస్ స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ  

  • రేపే ఎన్నికల పోలింగ్.. ఓటు కోసం సొంత ఊళ్లకు పయనం.. 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగరం నుంచి ఓట్ల కోసం తమ సొంత ఊళ్లకు బయల్దేరిన ప్రయాణికులకు ఆర్టీసీ చుక్కలు చూపిస్తోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ టికెట్లను రేట్లను అమాంతం పెంచేసింది. ఇప్పటికే పలు బస్సులు రిజర్వేషన్లతో నిండిపోవడంతో ప్రయాణికులు బస్ స్టేషన్ల వద్ద పడిగాపులు కాస్తుంటే.. సొంత ఊళ్లకు వెళ్లేందుకు బస్సులు దొరకడం లేదు.. ఒకవైపు ప్రయాణికుల నుంచి 50 శాతం మేర టికెట్ల రేట్లు పెంచేసి ఆర్టీసీ బాదుతుంటే.. మరోవైపు ఎన్నికల సంఘం.. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రచారం చేస్తోంది.

ఈ క్రమంలో ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు బయల్దేరిన ప్రయాణికులకు ఆర్టీసీ నుంచి ఇక్కట్లు తప్పడం లేదు. ముందస్తు సమాచారం లేకుండా అనధికారికంగా ఆర్టీసీ టికెట్లను పెంచేసి ఎన్నికల పోలింగ్‌‌ను సొమ్ము చేసుకోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అదనపు వడ్డింపులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓటర్లు.. దిక్కుతోచని స్థితిలో బస్సు స్టేషన్ల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఎన్నికల పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు