హక్కుల కార్యకర్తల అరెస్టు.. సుప్రీం తీర్పు వాయిదా

Updated By ManamThu, 09/20/2018 - 22:04
supreme court

supreme-courtన్యూఢిల్లీ: బీమా కోరేగావ్ అల్లర్ల కేసులో అరెస్టయిన ఐదుగురు హక్కుల కార్యకర్తలను విడుదల చేయాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. హక్కుల కార్యకర్తలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలా? వద్దా? అనే అంశంపై తుది తీర్పులో వెల్లడించింది. హక్కుల కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ప్రముఖ చరిత్రకారిని రోమిల్లా థాపర్, ఇతరులు వేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. కేసు విచారణ వివరాలను (కేస్ డైరీ)ని ఈ నెల 24న కోర్టుకు సమర్పించాలని పుణె పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. హక్కుల కార్యకర్తల తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, హరీశ్ సాల్వే, ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆసిక్తకర వాదనలు జరిగాయి.  హక్కుల కార్యకర్తల్లో ఒకరైన రోనా విల్సన్ ల్యాప్‌టాప్ నుంచి రికవరీ చేసిన లేఖలను తుషార్ మెహతా కోర్టుకు నివేదించారుజ హార్డ్ డిస్క్ నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు ఫోర్జ్ చేసినవి కావని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ రిపోర్ట్ ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. అయితే ఈ లేఖలతో మొత్తం ఐదుగురు అరెస్టయినవారికి ఎలాంటి సంబంధం ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నిష్పాక్షికంగా ఈ కేసు దర్యాప్తు జరిగిందని స్పష్టం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఫిర్యాదుదారుడి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే  దర్యాప్తులో సంఘ విద్రోహ చర్యలు లేదా చట్ట వ్యతిరేక చర్యలున్నట్టు తేలితే, ఆ దర్యాప్తు కొనసాగించాల్సిందేన న్నారు. ఇక పిటిషనర్ల తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి  ఈ కేసులో దర్యాప్తు తీరును ఆక్షేపించారు. 

English Title
Rights activists arrested .. Supreme Court postponed




Related News