జనాభా ప్రాతిపదికనే.. బీసీలకు రిజర్వేషన్లు

Updated By ManamThu, 07/12/2018 - 00:19
Uttam kumar reddy
  • పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్.. కేసీఆర్‌ది కపటప్రేమ: షబ్బీర్ అలీ

  • అఖిలపక్షం ఏర్పాటు చేయండి: పొంగులేటి.. బీసీలకు అన్యాయం సీఎం అసమర్థతే: దాసోజు

uttham హైదరాబాద్: పంచాయితీరాజ్ ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను కోర్టులు తప్పు పడితే కాంగ్రెస్‌ను విమర్శించడమేంటని ప్రశ్నించారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం నాడు గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను శాసన సభ నుంచి సస్పెండ్ చేసి, పంచాయితీరాజ్ బిల్లును ఆమోదించుకున్న ప్రభుత్వం ఇప్పుడు నెపం మాపై ఎలా వేస్తుందన్నారు. కేసీఆర్ బీసీ వ్యతిరేక వైఖరి తీసుకున్నారని, అన్ని అబద్దాలే చెబుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. బీసీల రిజర్వేషన్లపై కేసీఆర్ ఎందుకు అఖిల పక్ష సమావేశం నిర్వహించడంలేదని ప్రశ్నించారు. మరోవైపు, సీఎం కేసీఆర్ బీసీలపై కపట ప్రేమ కనబరుస్తున్నారని శాసన మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి ఆయన అసెంబ్లీ మీడియా హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కేసీఆర్ ప్రభుత్వానికి బుద్దిరాదన్నారు. 2013లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులను ఒప్పించిందన్నారు. 50 శాతం నిబంధన పక్కన పెట్టి 60 శాతం రిజర్వేషన్ అమలు చేశామన్నారు. పంచాయితీరాజ్ చట్టంపై కాంగ్రెస్ సలహాలు ఇస్తామన్నా అంగీకరించకుండా ఇప్పుడు మాపై నిందలు ఎలా వేస్తారని షబ్బీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద సమస్యపై కోర్టులో వాదనలు జరుగుతుంటే అడ్వకేటు జనరల్ ఎందుకు హాజరు కాలేదో చెప్పాలన్నారు. తాను చెప్పిందే ఫైనల్ అనే కేసీఆర్ వైఖరి వల్లే కోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ స్వామ్యమే తప్ప ప్రజా స్వామ్యం లేదని పొంగులేటి సుదాకర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు బీసీల రిజర్వేషన్లపై చిత్తశుద్ది ఉంటే ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం అసమర్థతే కారణం: దాసోజు
కేసీఆర్ అసమర్థత వల్లే బీసీలకు రిజర్వేషన్లు దక్కలేదని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. రిజర్వేషన్లు కల్పించలేక, కాంగ్రెస్‌పై నిందలు వేయడం బట్టకాల్చి మీద వేయడమేనన్నారు. 1999లోనే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చారని, ఇప్పుడు కూడా అంతే పెడితే ఎలా అని ప్రశ్నించారు. బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలని దాసోజు డిమాండ్ చేశారు. పంచాయితీ రాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని, ఇందు కోసం వెంటనే అసెంబ్లీని పిలవాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల విషయం లో వర్గీకరణ పాటించాలని డిమాండ్ చేశారు. కేసు వేశారని కాంగ్రెస్‌ను నిందిస్తు న్న కేసీఆర్, ఈ కేసు వేసిన వారిలో టీఆర్ ఎస్‌కు చెందిన నాగర్‌కర్నూలు ఎంపీ టీసీ గోపాల్‌రెడ్డి కూడా ఉన్న విషయాన్ని ఎందుకు మరిచిపోయారని ప్రశ్నించారు.

దేవుడి భూములు ఆక్రమించారు: వీహెచ్ 
బాలాపూర్‌లో దేవుని భూములు ఆక్రమణలకు గురవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హన్మంతరావు ప్రశ్నించారు. ఈ భూముల విష యంలో వాస్తవాలు తెలుసుకునేందుకు తాను బాలాపూర్ వెళ్తున్నట్లు వీహెచ్ ప్రకటించారు. కబ్జాదారుల వెనుక ఎవరు ఉన్నారో బయటపెట్టాలన్నారు. కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ ప్రభుత్వం భూములు కబ్జాకు గురవుతుంటే ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. డి.శ్రీనివాస్ తిరిగి పార్టీలోకి రావొద్దని తాను అనలేదని వీహెచ్ స్పష్టంచేశారు. ఆయన చేరిక విషయాన్ని సంప్రదింపుల కమిటీ చూసుకుం టుందన్నారు. పార్టీకి ప్రయోజనం అనుకుంటే ఎవరినైనా పార్టీలో చేర్చుకుంటామన్నారు.

English Title
Reservations for BSc population
Related News