హాలీవుడ్ సీక్వెల్స్.. రిలీజ్ సెంటిమెంట్‌

Updated By ManamThu, 05/17/2018 - 20:42
jurasic world

avataarఓ సినిమా ఘ‌న‌విజ‌యం సాధిస్తే.. దానికి కొన‌సాగింపుగా సీక్వెల్ పేరుతో మ‌రిన్ని సినిమాలు రావ‌డం స‌హ‌జం. టాలీవుడ్‌లో ఇలాంటి ట్రెండ్ ఇటీవ‌ల కాలంలో పుంజుకుంటే.. కోలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ మ‌న కంటే ముందే ఈ ట్రెండ్ స‌క్సెస్‌ఫుల్‌గా మొద‌లైంది. ఇక సినిమాల‌కు పుట్టినిల్లు అయిన హాలీవుడ్ గురించి చెప్పాలంటే.. అస‌లు ఈ త‌ర‌హా సినిమాలు రావ‌డం మొద‌లైందే అక్క‌డ‌నే చెప్పాలి. విజ‌య‌వంత‌మైన సినిమాకి సీక్వెల్ రావ‌డం స‌హ‌జ‌మైనా.. మొద‌టి భాగం ఏ నెల‌లో విడుద‌లైందో స‌రిగ్గా అదే నెల‌లో సీక్వెల్‌ సినిమాలు రావ‌డం అరుదు. అయితే గ్లోబ‌ల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘జురాసిక్‌ వరల్డ్‌’, 'అవ‌తార్' చిత్రాల సీక్వెల్‌లు మాత్రం తొలి భాగం విడుద‌లైన నెల‌లోనే తెర‌పై సంద‌డి చేసేందుకు ముస్తాబ‌వుతున్నాయి. 'జురాసిక్ వ‌రల్డ్' సీక్వెల్స్‌ హాలీవుడ్ వేస‌వి సీజ‌న్‌ను టార్గెట్ చేసుకుని జూన్‌లో విడుద‌ల‌వుతుంటే.. 'అవ‌తార్' సీక్వెల్స్ క్రిస్మ‌స్ సీజ‌న్‌ను టార్గెట్ చేసుకుని డిసెంబ‌ర్‌లో రిలీజ్ అవుతున్నాయి. కాస్త ఆ వివ‌రాల్లోకి వెళితే..

‘జురాసిక్‌ పార్క్‌’ సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు నాలుగు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చాయి. అవే.. ‘జురాసిక్‌ పార్క్‌’ (1993), ‘ది లాస్ట్‌ వరల్డ్‌: జురాసిక్‌ పార్క్‌’ (1997), ‘జురాసిక్‌ పార్క్‌-3’ (2001), ‘జురాసిక్‌ వరల్డ్‌’ (2015). ఈ సిరీస్‌లో ఐదో చిత్రంగా ‘జురాసిక్‌ వరల్డ్‌: ది ఫాలెన్‌ కింగ్‌డమ్‌’ (2018) రాబోతోంది. ఇంకా చెప్పాలంటే.. ‘జురాసిక్‌ వరల్డ్‌’కి సీక్వెల్‌గా ‘జురాసిక్‌ వరల్డ్‌: ది ఫాలెన్‌ కింగ్‌డమ్‌’ రూపొందింది. జె.ఎ. బయోనా దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే ‘జురాసిక్ వరల్డ్‌’లో మూడో చిత్రంగా రాబోతున్న ‘జురాసిక్‌ వరల్డ్ 3’ (2021) కూడా జూన్ నెల‌లోనే తెర‌పైకి రానుంది. అంటే జూన్ నెల‌లోనే 'జురాసిక్‌ వరల్డ్' సీక్వెల్స్ సంద‌డి చేయ‌నున్నాయ‌న్న‌మాట‌. విశేష‌మేమిటంటే.. ‘జురాసిక్‌ వరల్డ్‌’ కూడా జూన్ నెల‌లోనే సంద‌డి చేసింది. ఒక‌విధంగా.. ‘జురాసిక్‌ వరల్డ్‌’ సంద‌డంతా జూన్ నెల‌కే ప‌రిమిత‌మ‌వుతోంద‌న్న‌మాట‌.

ఇక జేమ్స్ కామెరాన్ ఎపిక్ సైన్స్ ఫిక్ష‌న్ 'అవ‌తార్‌' విష‌యానికి వ‌స్తే.. 2009లో క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ నెల‌లో సంద‌డి చేసిందీ చిత్రం. పండోర అంటూ ఓ కొత్త ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేసిన ఈ సినిమా గ్లోబ‌ల్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డులు సృష్టించింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్స్ రూపొందించే ప‌నిలో ఉన్నారు జేమ్స్‌. విశేష‌మేమిటంటే.. ఈ సినిమాల‌న్నిటిని కూడా డిసెంబ‌ర్ నెల‌లోనే విడుద‌ల చేసేందుకు ఆయ‌న ప్లాన్ చేశారు. 'అవ‌తార్ 2'ను 2020 డిసెంబ‌ర్‌లోనూ.. 'అవ‌తార్ 3'ను 2021 డిసెంబ‌ర్‌లోనూ విడుద‌ల చేయ‌నున్నారు. ఇవి విడుద‌ల‌య్యాక నాలుగు, ఐదు భాగాల‌ను కూడా ప్లాన్ చేసే దిశ‌గా జేమ్స్ ఉన్నారు. 2024 డిసెంబ‌ర్‌లో 'అవ‌తార్ 4'ను.. 2025 డిసెంబ‌ర్‌లో 'అవ‌తార్ 5'ను రిలీజ్ చేసే అవ‌కాశ‌మున్న‌ట్లు ఆ మ‌ధ్య కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ చిత్రాలే కాకుండా.. మ‌రికొన్ని హాలీవుడ్ చిత్రాలు కూడా ఇదే బాట‌లో వెళుతుండ‌డం విశేషం.

English Title
release sentiment for hollywood sequels
Related News