సంస్కరణల్లో సడలింపు

Updated By ManamFri, 08/10/2018 - 00:18
Indian cricket control board

సుప్రీం కోర్టు నిర్ణయంతో బీసీసీఐ, రాష్ట్ర సంఘాల్లో ఆనందం.. ఒక స్టేట్, ఒక ఓటు పాలసీ రద్దు.. మహారాష్ట్ర, ముంబై, విదర్భ సంఘాలకు పూర్తి సభ్యత్వం.. కూలింగ్ ఆఫ్ పీరియడ్‌లోనూ మార్పులు.. కొత్త రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశం.. అమలయ్యే బాధ్యత సీఓఏకు అప్పగించిన సుప్రీం
 

Indian cricket control board

న్యూఢిల్లీ: ఎట్టకేలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన పంతాన్ని నెగ్గించుకుంది. జస్టిస్ లోధా ప్రవేశపెట్టిన సంస్కరణల్లో మార్పులు చేసేలా కొత్త రాజ్యాంగాన్ని రూపొందించి సుప్రీం కోర్టు చేత ఆమోద ముద్ర వేయించుకుంది. భారత క్రికెట్ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసుల్లో కొన్ని సడలింపులు చేస్తూ గురువారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో బీసీసీఐతో పాటు రాష్ట్ర సంఘాల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ముఖ్యంగా ‘ఒక రాష్ట్రం, ఒక ఓటు’, ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’, ‘70 ఏళ్లు పైబడ్డ వారు బోర్డు పదవుల్లో కొనసాగకూడదు’ వంటి ముఖ్యమైన సిద్ధాంతాల్లో ఉన్నత న్యాయస్థానం సడలింపు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో మహారాష్ట్రలో ఎప్పటిలాగే మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, ముంబై క్రికెట్ అసోసియేషన్, విదర్భ క్రికెట్ అసోయేషన్‌లు ఫుల్ మెంబర్స్‌గా కొనసాగుతాయి. అంతేకాకుండా ఒక స్టేట్, ఒక ఓటు పాలసీ రద్దు కావడంతో ఈ మూడు రాష్ట్ర సంఘాలకు మళ్లీ ఓటింగ్ హక్కు వచ్చినట్టయింది. అంతేకాదు ఈ మూడు సంఘాలు ఏజీఎంలలో పాల్గొంటాయి. రైల్వేస్, సర్వీసెస్, అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్‌కు కూడా పూర్తి సభ్యత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. నిజానికి ఈ అసోసియేషన్లు వందేళ్లకు పైగా క్రికెట్‌కు తమ సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం ఈ సౌలభ్యాన్ని కల్పించింది.

తాము క్రికెట్‌కు ఎనలేని సేవలందిస్తున్నా ఓటింగ్ హక్కును కోల్పోవడాన్ని వ్యతిరేకించిన ఈ సంఘాలకు బీసీసీఐ అండగా నిలిచింది. బీసీసీఐ రాజ్యాంగ ముసాయిదాను ఆమోదించిన బెంచ్ కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను రద్దు చేసింది. ఒకసారి పదవీ కాలం ముగిసిన తర్వాత మరోసారి ఆ పదవికి పోటీ చేయడానికి మూడేళ్ల అంతరం ఉండాలన్న లోధా సిఫారసును సుప్రీం రద్దు చేసి దానికి బదులు వరుసగా రెండోసార్లు ఆ పదవిలో కొనసాగిన తర్వాత మూడేళ్ల అంతరం ఉండాలని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. క్రికెట్ బోర్డు రూపొందించిన కొత్త రాజ్యాంగాన్ని బీసీసీఐతో పాటు రాష్ట్ర సంఘాలు వెంటనే అనుసరించాలని సుప్రీం పేర్కొంది. ఈ కొత్త రాజ్యాంగం అన్ని రాష్ట్ర సంఘాల్లో అమలయ్యేలా చూడాలని.. దీనికి అంగీకరించని సంఘం ఏదైనా ఉంటే తెలపాలని కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ)కు ఆదేశించింది. 30 రోజుల్లోగా ఈ నూతన రాజ్యాంగాన్ని అమల్లోకి తేచ్చి సీఓఏకు తెలియజేయాలని బీసీసీఐని ఆదేశించింది. ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఉన్నత న్యాయస్థానం హెచ్చరించింది. అంతేకాకుండా ఈ నూతన రాజ్యాంగంతో తమిళనాడు రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీలో నాలుగు వారాల్లోపు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. 

స్వాగతించిన సీఓఏ
సుప్రీం కోర్టు తీర్పును సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ స్వాగతించారు. ‘గౌవరనీయ న్యాయస్థానం అద్భుతమైన తీర్పు వెలువరించింది. బోర్డు అధికారులు వరుసగా రెండుసార్లు పదవిని చేపట్టడంలో నాకు ఎటువంటి ఇబ్బందీ లేదు. నిజానికి కూలింగ్ ఆఫ్ పీరియడ్‌కు ముందు ఆరేళ్ల పదవీ కాలం ఉండాలని భావించాను. కానీ దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు’ అని రాయ్ అన్నారు. అయితే ఈ కొత్త రాజ్యాంగాన్ని అనుసరించేందుకు నిర్ణీత కాలాన్ని పేర్కొనడం ఆనందంగా ఉందని చెప్పారు. బోర్డు ఎన్నికలకు తగిన ప్రణాళికను సిద్ధం బాధ్యతను కూడా సీఓఏకు సుప్రీం కోర్టు అప్పగించింది. 

English Title
Relaxation in versions
Related News