రాజధాని ‘రియల్’మాయే!

Updated By ManamMon, 08/06/2018 - 01:03
amaravathi

imageసాధారణంగా సారవంత మైన సాగుభూములున్న ప్రదేశంలో రాజధాని నగరం నిర్మించరు. కారణం, భూసేకరణ చాలా ఖర్చుతో కూడుకున్నది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 6 ప్రకారం, తరలించాల్సిన జనాభా సంఖ్య కనీసంగా ఉండాలి. వ్యవసాయ భూములకు జరిగే నష్టం తక్కువగా ఉండాలి. కానీ రాజధాని పేరిట జరుగుతున్నది ఇందుకు పూర్తిగా విరుద్ధం. తెనాలి, గుంటూరు, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్‌కి ధాన్యాగారం వంటివి. తుళ్లూరు, మంగళగిరిలలో సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. రాజధాని పేరిట రైతులు ఈ భూముల్ని అమ్మేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంతో లాభం గానే కనబడుతుంది. కానీ వచ్చిన డబ్బుని వాణిజ్య రంగాలలో వె చ్చించలేదు. ఎందుకంటే, వాణిజ్య సముదాయం వినియోగదారుల సంఖ్యపై ఆధారపడుతుంది.

 అమరావతిలో మౌలిక సదుపాయాల రూపకల్పన సాకారం కావడానికి కనీసం 10 ఏళ్ళు పడుతుంది. చి న్న రైతుల చేతుల్లో ఈ డబ్బు మహా అయితే 5 సంవత్సరాలు ఉంటుంది. ఎక్కువ ఎకరాలున్న భూస్వామ్య రైతులు ఇక్కడ వ్యవసాయం చేయని భూయజమానులు, ఈ డబ్బుని ఇతర ప్రదేశాలలో వినియోగించి లాభపడతారు. అమరావతి ప్రాంతంలో రైతు కూలీలకు రోజుకి రూ.900 కూలీ వస్తుంది. వారి పరిస్థితి ఇప్పుడు ఒడ్డున పడ్డ చేపల్లాగా తయాైరెంది. భూపరిహారం సింహభాగం ఇక్కడ వ్యవసాయం చేయని ధనిక రైతుల చేతుల్లోకి వెళ్తోంది. ఇప్పటికే వాళ్లు రాజధాని అవతల భూములు కొనుక్కున్నారు. మరో సింహ భాగం దళారీ, రియల్ ఎస్టేటర్ల చేతుల్లోకి పోయింది. 2013 లాండ్ ఎక్విజిషన్, రిహాబిలిటేషన్ చట్టాన్ని పక్కన బెట్టి, లాండ్ పుల్లింగ్ విధానాన్ని ముందుకి తెచ్చారు. అంటే, పచ్చటి భూముల్ని తీసుకుని  రియల్ ఎస్టేటర్ లాగా డెవలప్‌చేసి, అక్కడ కొంత భూమినివ్వడం. ఈ విధానం ద్వారా 2015 నుంచి 2016 చివరి దాకా 8,000 ఎకరాలు మాత్రమే వచ్చాయి. 2017లో స్వచ్ఛందంగా ఇవ్వకపోతే బలవంతంగా తీసుకుంటామని అనేక రకాలుగా ప్రచారం చేస్తే అసలుకే మోసం వస్తుందనే భయంతో 2017 ఫిబ్రవరిలో రైతులు 20,000 ఎకరాలు అయిష్టంగానే అప్పజెప్పారు. ఈ రకంగా 25 శాతం ఇష్టపడి, 75 శాతం భయపడీ రైతులు భూముల్ని అప్పజెప్పారు. తర్వాత 27,000 ఎకరాల బంజరు భూమిని ప్రభుత్వం రాజధానికి కేటాయించింది. మళ్లీ 2018లో కేంద్రం దగ్గర నుంచి సెమీ ఫారెస్ట్ భూమి 45,000 ఎకరాలను డీఫారెస్ట్ చేసి తెచ్చుకున్నారు. అంటే అక్షరాలా లక్ష ఎకరాల పంట భూముల్నీ, ఫారెస్ట్ భూముల్నీ, బంజరు భూముల్నీ రాజధానికి కేటాయించారు. దీంట్లో 15,000 ఎకరాలు జరీ భూములు, సారవంతైమెన భూములు, ఎత్తిపోతల పథకాలతో సంవత్సరానికి 3 పంటలు పండే భూములూ ఉన్నాయి.

ముఖ్యమంత్రి అంచనా ప్రకారం 2050 నాటికి అమరావతి జనాభా 25 లక్షలకు చేరుతుందిట. ఇది నిజమా? హర్యానా, పంజాబ్ రెండు రాష్ట్రాల రాజధాని అయిన చండీగఢ్ 1966లో ఏర్పడింది. ఇప్పటికీ దాని జనాభా 11,50,000 చిల్లర. దీని కోసం 20,000 ఎకరాల్ని ఎంతో ఇష్టంగా ఇచ్చారు రైతులు. పోనీ, పక్క దేశాన్ని చూద్దాం. చైనా జనాభా సుమారు 137 కోట్లు. ఇక్కడ నిర్మిస్తున్న కొత్త నగరాల్లో అనుకున్నదాంట్లో కనీసం 25 శాతం కూడా వచ్చి చేరడం లేదు. ‘తియాందుచంగ్’ నగరాన్ని 2003లో 10 లక్షల జనాభా కోసం నిర్మించారు. ఇప్పటికీ అక్కడికి 30,000 జనాభా మాత్రమే వచ్చారు. ‘ఝంగ్‌దాంగ్’ నూతన ప్రాంతం. దీన్ని వేలాది ఎకరాల గోధుమ పొలాల్లో, శాన్‌ఫ్రాన్సిస్కో కన్నా రెండురెట్లు ఉండేలా మహానగరాన్ని నిర్మించారు. ఇక్కడా అదే పరిస్థితి. దీని చుట్టుప్రక్కల జనాభా పెరిగిందిగానీ ఇక్కడి రియల్ ఎస్టేట్ జూదానికి భయపడి ప్రజలు రావడం లేదు. ఇక్కడే ఉన్న ప్రజ లు అద్దెలు భరించలేక వెళ్లిపోతున్నారు. ‘కుమింగ్’ అనే ప్రాంతంలో వెల్లువెత్తుతున్న జనాల కోసం ‘చంగ్‌గాంగ్’ అనే పట్టణాన్ని నిర్మించారు. అక్కడికి జనాలు చేరుకోవడం లేదు. వాళ్ల సొంత ఆవాసాల్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. చైనాని చూసైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి.

అసలు ఇంత సమాచార వ్యవస్థ, రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందిన ఈ కాలంలో అన్ని రంగాలనూ ఒకే చోట కేంద్రీకరించేటట్లు, రాజధాని నిర్మించడం, దాని కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఒక తప్పుడు ప్రయోగం. ఇలా ఎందుకు జరుగుతోందం టే, ఇది కేవలం కొన్ని వర్గాల, కులాల, అధికారుల ఇష్టం మీద రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పనికి వచ్చే ప్లాట్ల రాజధాని అమరావతి. ఇది ఒక తటస్థ ప్రదేశంలో గానీ, వెనకబడ్డ ప్రాంతంలో గానీ, భిన్న ప్రాంతాల మధ్య ఒక సర్దుబాటు ప్రాంతంలో గానీ ఏర్పడింది కాదు. ఇప్పటికే అభివృద్ధి చెందిన జిల్లాల మధ్య నిర్మించబడుతున్న ఈ రాజధాని ‘రియల్’ వ్యాపారం కోసం కాక మరెందుకు?

మహి డెస్క్

English Title
real eastate in amaravathi
Related News