వార్తలు చదువుతున్నది.. ఏఐ!

Updated By ManamFri, 11/09/2018 - 23:38
china
  • చైనాలో తొలిసారి ‘కృత్రిమ మేధస్సు’ న్యూస్‌రీడర్

  • అధికార చానల్ సిన్హూవాలో ప్రవేశపెట్టిన సర్కారు

  • 24 గంటలూ...365 రోజులూ వార్తలు చదివే రోబో

chinaబీజింగ్: అనేక భారీ నిర్మాణాలతో సంచలనాలు సృష్టించే చైనా.. మరో అద్భుతం సాధించింది. ప్రపంచంలోనే తొలిసారి కృత్రిమమేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ)తో నడిచే న్యూస్ యాంకర్‌ను రూపొందించింది. చైనా అధికారిక మీడియా సిన్హూవాలో ఇకపై ఏడాదిపాటు.. 24 గంటలూ అలుపూసలుపూ లేకుండా వార్తలు చదివి వినిపించనుంది. ఈ మేరకు శుక్రవారం లాంఛనంగా ఆ ఏఐ న్యూస్ రీడర్ వార్తలు చదివాడు. ఈ న్యూస్ రీడర్ ఏ మాత్రం ఆలసిపోకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తలను 24 గంటలు.. 365 రోజులూ అందిస్తాడని ఆ చానల్ సగర్వంగా ప్రకటించింది. ప్రస్తుతం తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో జరుగుతున్న ప్రపంచ ఐదో ఇంటర్నెట్ సదస్సులో ఈ ఏఐ న్యూస్ రీడర్‌ను ఆ ఛానల్ ఆవిష్కరించింది. ముదురు రంగు సూట్, టై ధరించి.. అచ్చం మనిషిలాగే భావోద్వేగాలు వ్యక్తం చేస్తూ ఏఐ న్యూస్ రీడర్ వార్తలు చదవడం విశేషం. ఈ న్యూస్ రీడర్‌ని సిన్హూవా న్యూస్ ఏజెన్సీ, చైనా సెర్చ్ ఇంజిన్ సొగోవ్.కామ్ సంయుక్తంగా రూపొందించాయి. మెషీన్ లెర్నింగ్ ద్వారా దీన్ని అభివృద్ధి చేశారు. ఏయే సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, ముఖ కవళికలను ఎలా మార్చాలి తదితర అంశాల్లో తర్ఫీదునిచ్చారు. దీంతో తెరపై అచ్చం ఓ మనిషే వార్తలు చదువుతున్నాడన్న భావన కలుగుతుంది. ఆ న్యూస్ రీడర్ తమ రిపోర్టింగ్ బృందంలో సభ్యుడిగా మారాడని.. 24 గంటలూ పనిచేస్తాడని సిన్హూవా తెలిపింది. తమ అధికారిక వెబ్‌సైట్, ఇతర సామాజిక మాధ్యమాల్లో అతని సేవలు వినియోగించుకుంటామని పేర్కొంది. ఖర్చులు తగ్గించుకోవడం.. సామర్థ్యాలను పెంచుకోవడంలో భాగంగా కృత్రిమ మేధను ఉపయోగించుకుంటున్నామని ఆ చానల్ వెల్లడించింది.

Tags
English Title
Reading the news .. ai!
Related News