పునః ప్రవేశం అంత సులువు కాదు

Sania Mirza
  • హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా

బెంగళూరు: పోటీతత్వ టెన్నిస్‌లోకి పునః ప్రవేశం చేయాలని హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సన్నద్ధమవుతోంది. అయితే పునః ప్రవేశం అంత సులువేమీ కాదని ఆమె పేర్కొంది. షోయబ్ మాలిక్, సానియా మీర్జా దంపతులకు ఇటీవలే తొలి సంతానం కలిగిన సంగతి తెలిసిందే. ఆరు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు గెలిచిన సానియా ట్రెయినింగ్‌ను ప్రారంభించింది. ఇక ముందు తాను అనేక పాత్రలు పోషించాల్సివుంటుందని 32 ఏళ్ల సానియా పేర్కొంది. ‘మున్ముందు నేను కొన్ని కీలకమైన పాత్రలు పోషించాలి. వాటిని చాలా వేగంగా కూడా చేయాలి. కొన్నేళ్లుగా ఒకరికి భార్యగా ఉంటున్న నేను ఇప్పుడు తల్లి పాత్ర కూడా పోషించాలి. అంతేకాకుండా టెన్నిస్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకోవాలి. ఇది అంత సులువేమీ కాదని నాకు తెలుసు. కానీ ప్రయత్నించడంలో తప్పు లేదు. మళ్లీ క్రీడల్లోకి రావడమే నా తుది లక్ష్యం. బహుశా ఈ ఏడాది చివరికల్లా అది జరుగుతుందని భావిస్తున్నా. 2020లో పునః ప్రవేశం చేస్తానని గతంలోనూ చెప్పాను. దానికి ఒక కారణముంది. నేను ఎటువంటి ఒత్తిడికీ గురికాకూడదన్నదే ఆ కారణం’ అని సానియా చెప్పింది. కుమారుడు ఇజ్‌హాన్‌కు జన్మనిచ్చిన తర్వాత తన జీవితమే మారిపోయిందని సానియా తెలిపింది. ‘పసి పల్లలు ఇంట్లో ఉంటే ఆ జీవితమే వేరు. మనకు పెద్దగా ప్రాధ్యానతలుండవు. మొన్నటి వరకు స్వార్థంగా జీవించాను. నా ఫిట్‌నెస్‌పై, విశ్రాంతిపై, వర్క్‌పై దృష్టి పెట్టాను. పసి పిల్లలు ఇంట్లో ఉంటే మనదంటూ ఏదీ ఉండదు. ప్రతీది ఆ పిల్లల కోసమే ఆలోచిస్తాం. మాతృత్వం అంటే అదే. ఇప్పుడు నా జీవితం నిస్వార్థంగా మారింది’ అని ఓ ప్రైవేటు కార్యక్రమంలో సానియా పేర్కొంది. 

సంబంధిత వార్తలు