రంజాన్

Updated By ManamThu, 06/14/2018 - 06:52
ramjan
jama

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలంతా జరుపుకునే ఏకైక అతిపెద్ద పండుగ రంజాన్ లేదా రమదాన్. రంజాన్ సర్వశుభాల మాసం. ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల. దివ్యఖురాన్ అవతరించిన మాసం. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాస వ్రతం. దీన్నే పార్సీలో ‘రోజా’ అని, అరబ్బీలో ‘సౌమ’ అంటారు. మండు టెండల్లో...చలిలో, వర్షాల కాలం ఏదైనా సరే రోజా పేర అత్యంత కఠినంగా ఈ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు చేస్తుంటారు. దీక్షలో కనీసం ఉమ్మి కూడా మింగరాదు. పవిత్రమైన ఈ మాసంలో పేదలకు దానధర్మాలు చేయడం..

ఇంద్రియ నిగ్రహం, తమకున్నంతలో ఇతరులకు సాయం చేయటం రంజాన్ మాసం ప్రత్యేకత. ఉపవాస దీక్ష మూలంగా అల్లాహ్ పట్ల విశ్వాసం పెంపొందటం, దుర్వ్యసనాల నుంచి విముక్తి, దీనులపై జాలికలుగుట, మునుషులంతా ఒక్కటే అనే భావన. రంజాన్ పర్వదినం నాడు ఈద్గాలలో నమాజ్ అనంతరం ప్రతి ఒక్కరూ ఇతరులతో భుజాలకు భుజాలు ఆనించి కలవడం ఆనవాయితీ..

నెలవంకే ఆధారం
moonముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం షాబాన్ నెల పూర్తికాగానే కనిపించే నెలవంక దర్శనంతో ప్రారంభమవుతుంది. దీంతో ముస్లింలు ‘తరావీ’ నమాజ్‌ను రోజా(ఉపవాస దీక్షలు) ప్రారంభిస్తారు. రాత్రి ‘ఇషా’ నమాజ్ అనంతరం సామూహికంగా తరావీ నమాజ్ చేస్తారు. తరావీ నమాజ్‌లో పవిత్ర ‘ఖురాన్’ శ్లోకాలను పఠిస్తారు. ఈనెలలో ఆఖరి శుక్రవారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.  ‘జమాతుల్ విదా’గా పిలిచే ఈ శుక్రవారానికి అందరూ మసీదులకు చేరుకుని ‘జుమా’ ప్రార్థనలు చేస్తారు.  రంజాన్ నెల ప్రారంభంలోని మొదటి భాగం కారుణ్య భరితమని, మధ్య భాగం దైవ మన్నింపు లభిస్తుందని, చివరి భాగం నరకం నుంచి విముక్తి కలిగి సాఫల్యం కలుగుతుందని ఖురాన్‌లో పేర్కొన్నట్టు ముస్లిం మత పెద్దలు పేర్కొంటున్నారు. రంజాన్ నెలలో 29, 30 రోజుల పాటు ముస్లింలు వేకువజామునే ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. వేకువ జామున ‘ఫజర్’ నమాజ్‌ను ముందు తీసుకునే ఆహారాన్ని ‘సహార్’ అంటారు. 

జకాత్
రంజాన్ మాసంలో మరో ముఖ్యమైనది ‘జకాత్’. పేదలకు దాన ధర్మాలు చేయటం, ధనవంతుల వద్ద నుంచి సేకరించిన డబ్బు, ఇతరత్రా వాటిని పేదలకు పంచటం రంజాన్ మాసంలో జకాత్ పేర చేస్తుంటారు. జకాత్‌తో పాటు ‘ఫిత్రా’ దానానికి ఈ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.  నిరుపేదలకు తిండి గింజలు లేదా వస్త్రాలు, లేదా వాటికి సమానమైన దనాన్ని పంచిపెడ్తారు.  సాయంత్రం సూర్యాస్తమయం వేళ ‘మగ్‌రీబ్’ నమాజ్‌కు ముందు ఉపవాస దీక్ష ముగిస్తారు. దీక్ష విరమణ కోసం ‘ఇఫ్తార్’ చేస్తారు. ఉపవాస దీక్షలతో పాటు క్రమం తప్పకుండా ఐదు పూటలు నమాజ్, ప్రత్యేకంగా తరావీ నమాజ్ చేస్తారు. షవ్వాల్ నెల చంద్రున్ని చూసి మరుసటి రోజు యావత్తు ముస్లింలు ‘ఈద్ ఉల్ ఫితర్’ జరుపుకుంటారు.  పవిత్ర గ్రంథం ‘ఖురాన్’ రంజాన్ నెలలోనే అవతరించింది. రంజాన్ మాసం ముస్లింలకు ఒక నైతిక శిక్షణలాంటిదని, ఉపవాస దీక్షలతో పాటు ఐదు వేళల్లో నమాజ్ చేయడం వల్ల క్రమశిక్షణ, తల్లిదండ్రులు, పెద్ధల పట్ల మర్యాదపూర్వకంగా, పిల్లల పట్ల ప్రేమాభిమానాలతో మెలగడం అలవాటు అవుతుందని పెద్దలు తెలుపుతున్నారు.  

ఖురాన్ బోధనలే శిరోధార్యం
ఇస్లాం మతం ఐదు ముఖ్య మూలస్తంభాలపై పయనిస్తుంది. అందులో మొదటిది‘కల్మా’ (దేవున్ని విశ్వసించడం). రెండోది ప్రతిరోజు ఐదువేళల్లో నమాజ్ ఆచరించడం, మూడోది రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించడం, నాలుగోది ‘జకాత్’ రూపంలో పేదలకు దాన ధర్మాలు చేయడం, ఐదోది‘హజ్’(మక్కా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం) యాత్ర చేయడం. ఈ ప్రధాన ఐదు సూత్రాలను ముస్లింలు పాటిస్తారు. రంజాన్ నెలలో పాటించే పద్ధతులు విజయవంతమైన జీవనానికి భరోసా ఇస్తాయి.  మానవ జీవితం ఎలా ఉండాలో మార్గదర్శకాలను సూచించే ఇస్లాం మత పవిత్ర గ్రంథం ఖురాన్. రంజాన్ మాసంలో ‘లైలతుల్ ఖద్’ర (పవిత్రమైన రాత్రి) నాడు అరబ్బీ భాషలో ఖురాన్ గ్రంథం అవతరించింది. ఖురాన్‌లో 30 భాగాలున్నాయి. ఉపవాసాలు పాటించినంత మాత్రాన ముస్లింల బాధ్యత నెరవేరదు. ప్రతి దినం చేసే ఐదు పూటల నమాజ్‌తో పాటు ఇషా వేళలో ఫర్జ్ తర్వాత అదనంగా 20 రకాల ‘తరావీహ్’ నమాజ్ చేయాలి. లోగడ చేసిన పాపాలన్ని తరావీహ్ నమాజ్ ద్వారా తొలగిపోతాయని ముస్లింల విశ్వాసం. ఈ నమాజ్‌తోనే దివ్య ఖురాన్ పఠనం పూర్తి అవుతుంది. 

జాగరణ
రంజాన్ మాసంలో నమాజ్ చదువుతూ, పవిత్ర గ్రంథమైన ఖురాన్ పఠిస్తూ భగవంతున్ని నిత్యం స్మరించుకుంటారు. ఇస్లామిక్ మాసాల్లో అన్నింటికంటే రంజాన్ నెల చాలా గొప్పది. భగవంతుడు అన్ని మాసాల్లో రంజాన్ మాసాన్ని ‘సర్ధార్’ చేసినట్టు ముస్లిం పెద్దలు చెప్తుంటారు. ఈనెలలో రాత్రి జాగరణ ముఖ్యమైనది.  ‘షబ్ ఏ ఖదర్’ రోజు ‘ఇబాదత్’ చేస్తే వెయ్యి మాసాల ‘సవాబ్’ (దేవుడి ఆశిస్సులు) దొరుకుతుందని విశ్వాసం. 

సహర్‌తో ప్రారంభం
రంజాన్ మాసంలో తెల్లవారు జాములో నమాజ్‌కు ముందు రోజా ఉండేందుకు ముస్లింలు సహర్ చేస్తారు. సహర్  కోసం నిద్ర నుంచి లేపేందుకు మస్జీద్‌లలో సైరన్ ఏర్పాటు చేస్తారు. సహర్‌కు ముందు ఆహారం తీసుకుంటారు. అనంతరం ఉపవాస దీక్ష కఠినంగా పాటిస్తారు. రోజా ముగింపు సందర్భంగా సాయంత్రం ‘ఇఫ్తార్’తో దీక్షను విరమిస్తారు. ఇఫ్తార్‌లో పండ్లు, ఇతర తీపి పదార్థాలు తీసుకుంటారు. లేకుంటే కనీసం ఒక ఖర్జూర పండు, కొంచెం నీరు తాగి ఇఫ్తారు చేస్తారు.  ఇఫ్తార్‌లో బాదం, అక్రోట్, జీడిపప్పు, ఖర్జూరం, కిస్‌మిస్, అరటిపండు, నల్లద్రాక్ష, సపోటా, దానిమ్మ, నిమ్మ వేసిన వంటకాలను ఆరగిస్తారు.

పోషక విలువలు
సూర్యోదయానికి ముందు చేసే సహర్ భోజనంలో తగినన్ని పాలు, మాంసం, రొట్టెలు, అన్నం తీసుకుంటే వీటి ప్రభావం మూడు నుంచి నాలుగు గంటలకు పరిమితం. దాదాపు 12 గంటల పాటు ఆహారం, నీరు తీసుకోకుండా ఉండాలంటే ఎండు ఫలాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే.  అందుకే సూర్యాస్తమయం తర్వాత ఖర్జూరంతో ఉపవాసం ముగిస్తారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న పండ్లు తీసుకోవడం ఆనవాయితీ. తర్వాత నమాజ్ చేస్తారు. రాత్రి 8 గంటల సమయంలో భోజనం చేస్తారు. అప్పుడు బియ్యం, గోధుమలతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకుంటే మంచిది. వీటితో పాటు మాంసంతో తయారు చేసిన పదార్థాలు తీసుకుంటే శరీరానికి పోషకాలు అందుతాయి.

స్వీట్లు కూడా
అఫ్ఘనిస్తాన్ నుంచి తెప్పించిన ఎండు ఖుబాని ఫలాల్ని ఉడికించి చేసే ఖుబాని కా మీఠా, దహీ వడ రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని ఇళ్లల్లో చేయటమే కాకుండా బంధుమిత్రులకు పంచుతారు. ఇది ఉపవాసం ఉన్న వ్యక్తి శరీర తాపాన్ని తగ్గిస్తాయి. ‘కద్దూకి ఖీర్’ అంటే సొరకాయతో తయారు చేసే ఈ తీపి వంటకం రంజాన్ మాసంలో ఎక్కువగా చూస్తాం. మహ్మద్ ప్రవక్త సొరకాయను అమితంగా ఇష్టపడే వారని అందుకే ఈ వంటకాన్ని ఎక్కువ మంది డిమాండ్ చేస్తారు. లేత సొరకాయను చిన్నముక్కల్లా తరిగి ఉడకబెట్టి పాలల్లో వేస్తారు. ఈ మిశ్రమాన్ని తగినంత సేపు మరగబెడుతారు. సగ్గు బియ్యం, బాస్మతి బియ్యం తగినన్ని పాళ్లలో కలిపి ఒక కేజీ ఖీర్‌కు 2 గ్రాముల చొప్పున కోవా వేసి చేస్తారు. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడ్డాక ఇస్తారు. 

ఏడాదికి 354 రోజులే
ముస్లిం పండగ ఏదైనా ఇంగ్లీష్ క్యాలెండర్‌తో పోల్చి చూస్తే 10-11రోజులకు ముందుకు జరుగుతుంది. రంజాన్ 2013లో జులై 11న, 2014లో జూన్ 30న, 2015లో జూన్ 19న, 2016లో జూన్ 6న, 2017లో మే 26న, ఈ సారి మే 16న మొదలైంది. ఆంగ్ల, హిజ్రీ క్యాలెండర్‌లోని రోజుల సంఖ్యలో ఉండే వ్యత్యాసమే దీనికి ప్రధాన కారణం. ఇంగ్లీష్ క్యాలెండర్‌లో ఫిబ్రవరి మినహా కొన్ని నెలలకు 30 రోజులు, మరికొన్ని నెలలకు 31రోజులుంటాయి. ముస్లింలు ఇస్లాం కాలమానిని ప్రామాణికంగా తీసుకుంటారు. దీనికి నెల వంక దర్శనమే కీలకం. హిజ్రీ క్యాలెండర్ చంద్రమాసం ఆధారం. ఇంగ్లీష్ క్యాలెండర్‌లో 365 రోజులుంటే హిజ్రిలో 354 రోజులు మాత్రమే ఉంటాయి.  మక్కా నుంచి మదీనా వరకు ఇస్లాం మత ప్రచారం కోసం వెళ్లిన మహమ్మద్ ప్రవక్త ఆ తర్వాతి కాలాన్ని హిజ్రీగా నామకరణం చేశారు. అప్పటి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. మొదట్లో దీనికి హిజ్రత్ కాలమానిని అని పేరు. కాలక్రామేణ ఇది హిజ్రీగా పేరు వచ్చింది. ప్రస్తుతం హిజ్రీ కాలమానినిలో 1439 సంవత్సరం నడుస్తోంది. ఇందులో మొదటి నెల మొహర్రం కాగా రంజాన్ 9వ నెల. రంజాన్ అంటే అల్లాహ్‌తో ఉండటంగానే భావిస్తారు.     - పి.రాజేంద్ర

హలీం.. మొదలైందిలా
రంజాన్ మాసంలో హరీస్, హలీం ప్రత్యేకమైన వంటకం. రోజా అనంతరం ఎక్కువ మంది హరీస్, హలీంలను తీసుకుంటారు. ఇది haleemరుచికరంతో పాటు చాలా మంచి పోషకాహారం కూడా.  దీని తయారు మొదలైనదాని వెనుక పెద్ద కథే ఉంది. ఆరో నిజాం నవాబ్ మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. రంజాన్ ఉపవాసదీక్ష విరమణకు వడ్డించే వంటకాల్లో ఓ ప్రత్యేక డిష్ గురించి పర్షియా ప్రతినిధులు ప్రస్తావించారు. వెంటనే నవాబ్‌షాహీ దస్తర్‌ఖానా (వంటగది) సిబ్బందిని పిలిపించి ఆ వంటకాన్ని సిద్దం చేయించారు. అదే హరీస్, హలీం. హరీస్, హలీంలో ఎన్నో పోషక విలువలు లభిస్తాయి. ఈ వంటకాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. కోడి మాంసం, గోదుమలు, నెయ్యి, జీలకర్ర, షాజీరా, దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, పుదీనా, బాదం, పిస్తా, ఇలాచీ, డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులతో హరీస్‌ను తయారు  చేస్తారు. ఇదే క్రమంలో హలీంలో గొర్రె మాంసంతో హరీస్‌లో వాడిన పదార్థాలతో పాటు మరికొన్నింటిని కలిపి తయారు చేస్తారు.

ఫలాలకే ప్రాధాన్యం
imageమహమ్మద్ ప్రవక్త(స.అ.సం) తన ఉపవాస దీక్షను ఖర్జూరంతోనే విరమించేవారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ముస్లింలు ఖర్జూరానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇఫ్తార్ విందులో ఖర్జూరం విధిగా ఏర్పాటు చేసుకుంటారు.  వీటిలో బోలెడు వెరైటీలున్నాయి...రూ.80 నుంచి రూ.3 వేలకు కిలో చొప్పున దొరికేవి ఉన్నాయి.  ముస్లింలు సీజనల్‌గా దొరికే పండ్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఖర్జూరంతో పాటు మరికొన్ని ఎండు ఫలాలు దీర్ఘకాల ఉపవాసంలో సత్తువ ఇచ్చేందుకు దోహదపడుతాయి. తర్భూజ, కర్భూజ, సపోట, అరటి, ఆపిల్స్, నారింజ పండ్లు తింటారు. రంజాన్ సీజన్‌లో వీటికి ఎక్కువ గిరాకీలు ఉంటాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. అలాగే ముస్లింలు ఎండు అంజీర పండును ఎక్కువగా ఇష్టపడతారు. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది.

కఠోర నియమాలతో ఉపవాసాలు
రంజాన్‌లో రోజా అత్యంత ప్రాముఖ్యమైనది. ఇది ఒక ఉపవాస వ్రతం. కోరికలను  జయించడం. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండటం. హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం వంటివి రోజాలో ప్రధానమైనవి.  పాపాల బాధల నుంచి కాపాడే ఒక దివ్య మార్గం రోజా అని అంటారు. ఈ నెలలో వారు కఠోర నియమాలతో ఉపవాసాలు చేస్తారు. ఈఏడాది రంజాన్ మాసం ఆరంభం నుంచే మండుటెండలున్నాయి.  తెల్లవారుజాము కాకముందే అన్నపానీయాలు ముగించుకోవాలి. తిరిగి సూర్యాస్తమయం వరకు కనీసం నీళ్లయినా ముట్టకుండా రోజా పాటిస్తారు. దీంతో వారి శరీరాలు శక్తిని, పలురకాల పోషక విలువలను కోల్పోతుంటాయి. ముస్లింలు ఈ మాసంలో తీసుకునే భోజనాలు, ఫలహారాలు వారికి తిరిగి శక్తిని అందిస్తాయి. ఈ మాసంలో వారు తీసుకునే ఆహారం వాటి పోషక విలువలపై ధ్యాస పెట్టాలి. లేదంటే శరీరం సమతుల్యాన్ని కోల్పోతుంది.

సంప్రదాయ వస్త్రధారణ
రంజాన్ మాసంలో ముస్లింలు ఎక్కువగా లాల్చి, పైజామాల్లో కన్పిస్తారు. నమాజ్ చేసే సమయంలో ఈ దుస్తులు ఎంతో imageఅనుకూలంగా ఉంటాయి. ముస్లిం పెద్దలు, యువకులు షేర్వానీ ధరిస్తుంటారు. షేర్వానీ దర్జానే వేరు. మెడపై రుమాలు ధరిస్తారు.  రంజాన్ పండుగ కోసం షాపింగ్ సెంటర్లు అన్నీ కిటకిటలాడుతున్నాయి. చిన్నా, పెద్దా అంతా రంజాన్ షాపింగ్ సందడిని ఎంజాయ్ చేస్తున్నారు.  హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ఉన్న లాడ్ బజార్‌తో పాటు ఓల్డ్ సిటీలో రాత్రంతా షాపులు తెరిచే ఉంటాయి. 
 

Tags
English Title
ramjan
Related News