కోటీశ్వరులు రయ్.. రయ్!

Updated By ManamTue, 10/23/2018 - 06:58
Money
  • నాలుగేళ్లలో 60 శాతం  పెరిగిన సంఖ్య

  • ఆదాయపన్ను రిటర్నులలో నమోదు

Moneyన్యూఢిల్లీ: దేశం పేదరికంలో మగ్గిపోతోందని, దేశవాసుల సంపద కరిగిపోతోందని ఒకవైపు అంతా గగ్గోలు పెడుతుంటే.. ఆదాయపన్ను శాఖ వెల్లడిస్తున్న విషయాలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం గడిచిన నాలుగేళ్లలో భారతదేశంలో కోటీశ్వరుల సంఖ్య ఏకంగా 60 శాతం పెరిగింది. మొత్తం పన్ను చెల్లించేవారిలో (కార్పొరేట్లు, సంస్థలు, హిందూ అవిభాజ్య కుటుంబాలు.. తదితరులు) తమ వార్షికాదాయం కోటి రూపాయలకు పైగా ఉందని చెప్పేవాళ్ల సంఖ్య బాగా పెరిగింది. ఏడాదికి కోటి రూపాయల పైబడి సంపాదిస్తున్నవారి సంఖ్య 2014తో పోలిస్తే 1.40 లక్షలకు పెరిగినట్లు సీబీడీటీ తెలిపింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కోటి రూపాయలకు పైబడిన ఆదాయం ఉన్నవారు 88,649 మంది ఉండగా, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 1,40,139 దాటిందని.. దీన్ని బట్టి చూస్తే 60 శాతం వృద్ధి ఉందని సీబీడీటీ అధికారులు తెలిపారు. ఆదాయపన్ను, ఇతర ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన కీలక గణాంకాలను ఢిల్లీలో వెల్లడించారు. పన్ను చెల్లించే వ్యక్తులలో కోటీశ్వరుల సంఖ్య ఇంకా ఎక్కువగా పెరిగింది. వీరి పెరుగుదల 68 శాతంగా నమోదైంది. ఇంతకుముందు కోటి రూపాయల పైబడి ఆదాయం ఉన్న వ్యక్తులు 48,416 మంది మా త్రమే ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 81,344కు చేరుకుంది. గత నాలుగేళ్లలో పలు రకాల చర్యల కారణంగానే పన్ను చెల్లింపుదారుల ఆదాయం గణనీయంగా పెరిగిందని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు.

Tags
English Title
Rakshatra ray .. ray!
Related News