రక్షణ కవచం.. దువా

Updated By ManamMon, 07/09/2018 - 23:07
duva
  • దైవవాణి 


imageదువా అంటే వేడుకోవడం. ప్రశ్నించ డం, అర్థించడం అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇస్లాం పరిభాషలో చెప్పా లంటే మనపై వచ్చిపడిన ఆపదలు, విపత్తుల నుంచి గట్టెక్కించేదే దువా. ఇది ఆరాధనలకు ఆయువులాంటిది. అల్లాహ్ ను వేడుకోవడం, అర్థించడం దైవారాధనకు నిదర్శనం. అల్లాహ్ సముఖంలో అసహాయతను, దాస్యభావాన్ని వ్యక్తం చేయడం కూడా ఆరాధనే. మనం ఎక్కడున్నా ఏరోజైనా, ఏ సమయంలో అయినా దువా చేసుకోవచ్చు. దాసుడికి, దైవానికి మధ్య బంధం దువాతోనే పటిష్టమవుతుంది.

దువా వేడుకోలు విశ్వాసి చేతిలోని వజ్రాయుధం వంటిది. అన్ని మార్గాలూ మూసుకుపోయినప్పుడు, అన్ని ఆధారాలూ కోల్పోయినప్పుడు, అన్ని ఆశలూ అడుగంటిపోయినప్పుడు దువా రక్షణగా నిలుస్తుంది. ఏ కార్యం తలపెట్టినా ప్రణాళిక ప్రకారం చేపట్టాలి. శక్తియుక్తులన్నీ లక్ష్యసాధనకు ధారపోయాలి. ఆపై దైవాన్ని సహాయం అర్ధించాలి. మనం అనుకున్న లక్ష్యాలు, ఆశయాలు సిద్ధించాలంటే ప్రయత్నం, ప్రణాళికలు మాత్రమే సరిపోవు. దువా కూడా అవసరమే. మహాప్రవక్త (స) జీవితం ఈ విషయాన్నే తెలియచేస్తుంది. బద్ సంగ్రామంలో గెలుపుకోసం ప్రవక్త చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి, వనరులన్నీ సమకూర్చుకుని తరువాత దువా చేశారు. ప్రవక్త అర్థించిన ప్రతిసారీ దైవం జవాబు పలికారు. 

ఒకసారి ముగ్గురు మిత్రులు కలిసి ఒక గుహలో తలదాచుకున్నారు. అనుకోకుండా పర్వతంపై నుంచి ఒక పెద్ద బండరాయి జారి ముఖద్వారానికి అడ్డుగా పడింది. బయటకు వచ్చే మార్గం లేదు. అప్పుడు ఆ ముగ్గురూ తమ జీవితాలలో చేసుకున్న పుణ్యకార్యాలను సాక్షిగా ఉంచి దువా చేశారు. అల్లాహ్ వాటిని స్వీకరించాడు. వారికి మార్గం కల్పించాడు. మనం కూడా మన జీవితంలో నిత్యం పుణ్యకార్యాలను చేస్తూ అల్లాహ్ ను వేడుకుందాం. నిజమైన ముస్లింకు దువాలను మించిన ఆయుధం లేదన్నది తిరుగులేని వాస్తవం.
    - ముహమ్మద్ లియాఖత్ ఉద్దీన్

Tags
English Title
రక్షణ కవచం.. దువా
Related News