రాజీవ్ హంతకులను విడుదల చేసేది లేదు

Updated By ManamFri, 08/10/2018 - 12:44
Rajiv gandhi

Rajiv Gandhi killers cannot be released: Centre tells Supreme Courtన్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసు నిందితులను విడుదల చేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజీవ్ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను విడుదల చేసేది లేదని కేంద్రం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియచేసింది. రాజీవ్ హత్యకేసు దోషులను విడుదల చేస్తే దేశంతో పాటు ప్రపంచానికి కూడా తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుందుని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేయడం ప్రపంచానికి చెడు సంకేతాలు పంపిస్తోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ సమర్పించిన పత్రాన్ని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం స్వీకరించి, కేసును వాయిదా వేసింది. ఈ కేసులో ఏడుగురు దోషులను విడుదల చేయుడానికి తాము సుముఖంగానే ఉన్నామంటూ తమిళనాడు ప్రభుత్వం 2016లో పంపిన లేఖపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు జనవరి 23న కేంద్రానికి తెలిపింది. తాము సుముఖంగానే ఉన్నా, 2015 నాటి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కూడా తీసుకోవాలని తమిళనాడు సర్కారు తెలిపింది.

దాంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ వీబీ దూబే సమాధానం పంపారు. ఏడుగురు దోషులను విడిచిపెట్టద్దని కోరారు. కేసు విచారణ సమయంలో నిందితులకు మరణశిక్ష విధించేందుకు తగిన కారణాలను తాము దిగువ కోర్టుకు తెలిపామని, సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి హత్య దేశంలోనే దారుణాతి దారుణమని చెప్పామని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. దేశ మాజీ ప్రధానమంత్రిని చంపిన నలుగురు విదేశీయులను విడుదల చేయడం సరికాదని, అలా చేస్తే భవిష్యత్తులో ఇలాంటి మరింతమంది నేరస్తులు కూడా ఇదే తరహాలో మినహాయింపులు కోరుతారని అన్నారు. 

రాజీవ్ గాంధీని 1991 మే 21 రాత్రి తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌లో థాను అనే మహిళా మానవబాంబుతో చంపించారు. ఈ ఘటనలో థానుతో పాటు మరో 14 మంది కూడా మరణించారు. ఒక ఉన్నతస్థాయి అంతర్జాతీయ నాయుకుడిని చంపేందుకు ఇలా ఆత్మాహుతి బాంబర్లను వాడటం అదే మొదటిసారి. ఒక మాజీ ప్రధానమంత్రిని అత్యంత దారుణంగా చంపేశారని, ఇందుకు ఒక విదేశీ ఉగ్రవాద సంస్థ చాలా పకడ్బందీగా కుట్ర పన్నిందని హోం శాఖ తన లేఖలో తెలిపింది. ఈ హత్య కారణంగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా స్తంభించిందని, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయని తెలిపారు.

రాజీవ్‌గాంధీ హంతకులు ఏడుగురికి ఉరి శిక్ష వేస్తూ గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హత్యకేసులో వేలూరు సెంట్రల్‌ జైలులో మురుగన్, శాంతన్, పేరరివాలన్, నళినితో పాటు ఏడుగురు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఏడుగురు 27 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నందున విడుదల చేసేందుకు అనుమతివ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం గతంలో కేంద్రానికి నివేదిక పంపింది. అయితే కేంద్రం కూడా వారి విడుదలకు విముఖత వ్యక్తం చేయగా, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. కూడా దోషుల, క్షమాభిక్షకు  నిరాకరించారు. 

పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో  తమిళనాడులోని 1991, మే 21న రాజీవ్‌గాంధీని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్ (ఎల్టీటీఈ) కు చెందిన ఓ మహిళ మానవబాంబుగా మారి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే తమ తండ్రి హంతకులను తాను, తన సోదరి ప్రియాంకా గాంధీ పూర్తిగా క్షమించామంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవలే చెప్పారు. 

English Title
Rajiv Gandhi killers cannot be released: Centre tells Supreme Court
Related News