20న రాష్ట్రానికి రాహుల్

Updated By ManamMon, 10/15/2018 - 23:42
utham
  • సన్నాహక సమావేశాల్లో నేతలు.. భారీ జనసమీకరణకు కసరత్తు

  • భైంసా, కామారెడ్డిలో ఏర్పాట్ల పర్యవేక్షణ.. కేసీఆర్‌ను తరిమికొట్టాలి: ఉత్తమ్ 

imageహైదరాబాద్ః తెలంగాణలో ఒక రోజు పర్యటన నిమిత్తం ఈ నెల 20న రాష్ట్రానికి వస్తున్న ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభలను విజయవంతం చేసేందుకు టీపీసీసీ వ్యూహాత్మకంగా వెళుతోంది. టీఆర్‌ఎస్ సభలకు మించి ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల పరిశీలనకు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె జానారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, ఎఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్ క్రిష్ణన్, సలీం అహ్మద్, అదిలాబాద్ ఇంచార్జీ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎఐసీసీ నేత శ్రీనివాస్ తదితరులు భైంసా, కామారెడ్డి పట్టణాలకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, జన సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక నేతలను కోరారు.సన్నాహక సమావేశాలను నిర్వహించారు. భైంసాలో మెయిన్‌రోడ్డులో ఉన్న స్థలాన్ని పరిశీలించారు. imageకామారెడ్డిలో ఆర్ట్ట్‌‌స కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ డాక్టర్ రామచంద్ర కుంటియా, మండలిలో విపక్ష నాయకుడు మహ్మద్‌అలీ షబ్బీర్, ఎఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయని, ఈ సమరంలో దద్దమ్మ కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. చేతగాక 9 నెలల ముందుగానే  కాడివదిలేసిన కేసీఆర్‌కు బుద్ధిచెప్పాలని కోరారు. టీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ఇంటింటా చాటాలని పిలుపునిచ్చారు. రాహుల్ సభలతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా కాంగ్రెస్ కు అనుకూలంగా మారబోతోందని, టీఆర్‌ఎస్ బడా నాయకులు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారని చెప్పారు.

వినోద్ విషయం పునఃపరిశీలించాలి: వీహెచ్
కాంగ్రెస్ పార్టీలో జి వెంకటస్వామి కుటుంబం అన్ని పదవులు అనుభవించిందని, టీఆర్‌ఎస్ లో చేరిన ఆయన కొడుకు జి వినోద్ తిరిగి కాంగ్రెస్ లో చేర్చుకునే అంశంపై పునః పరిశీలించాలని ఎఐసీసీ కార్యదర్శి వీహెచ్ కోరారు. చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పారు. వారికిష్టం వచ్చినప్పుడు పార్టీలు మారుతారు..,మళ్లీ వస్తారా ? అని సోమవారం ఇక్కడ ప్రశ్నించారు. ఇందిరాగాంధీ కాలి గోటికి కూడా కేసీఆర్ సరిపోరని విమర్శించారు. కేసీఆర్ కు లివర్ ఫెయిలైందని మేమెలా చెబుతామని ప్రశ్నించారు. జనసేన అధినేత వచ్చే ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని, కేసీఆర్‌కు ప్రయోజనం కలిగించే విధంగా వ్యవహరించవద్దని వీహెచ్ కోరారు.

17 నుంచి ప్రచారంలోకి  - జగ్గారెడ్డి
ఈ నెల 17 నుంచి ఎన్నికల ప్రచారంలోకి వెళుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. సంగారెడ్డి నుంచి తనతో పాటు తన సతీమణి నిర్మల కూడా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.తన కూతురు జయారెడ్డి ప్రచారం ఈ నెల 17 తో ముగుస్తుందన్నారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పారు.ఈ విషయం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పినట్లు జగ్గారెడ్డి తెలిపారు. నిరుద్యోగులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు మేనిఫెస్టో కమిటీకి వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు.

కేసీఆర్ పద్దతి నచ్చకే కాంగ్రెస్‌లో చేరికలు: గజ్జల 
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహార ధోరణి నచ్చకనే పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జల కాంతం చెప్పారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ కు ప్రజలు బుద్ధిచెప్పబోతున్నారని తెలిపారు.

English Title
Rahul to the state on 20th
Related News