మోదీకి కౌంటర్ ఇచ్చిన రాహుల్

Updated By ManamTue, 06/26/2018 - 16:50
modi-rahul

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా సమాధానమిచ్చారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల మాటేమిటంటూ మోదీని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై మోదీ ఆరోపణల నేపథ్యంలో రాహుల్ మంగళవారం స్పందించారు.

Modi-rahul

భారత దేశంలో మహిళలపై ఆకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆయన మండిపడ్డారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. అంతర్జాతీయ సర్వే ప్రకారం.. మహిళల రక్షణ విషయంలో భారత్ ర్యాంకు కనిష్ఠానికి పడిపోయిందని తెలిపారు. యుద్ధాలతో అతలాకుతలమవుతున్న సిరియా, అఫ్ఘానిస్థాన్‌ల కన్నా భారత్ వెనకబడి ఉండడం బాధాకరమంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్‌కు స్వార్థమే ముఖ్యం
ముంబయి :‘స్వార్థపూరితంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశం మొత్తాన్ని జైలుగా మార్చిన చరిత్ర గాంధీ కుటుంబానిది.. ఎమర్జెన్సీ పాలన దేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఈ రోజును నిరసన దినంగా వ్యవహరించడం కన్నా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరాన్ని, అవగాహనను కల్పించే దినంగా పాటించాలి’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.Modi-rahul

దేశ ఆర్థిక రాజధానిలో జరిగిన పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పాలనకు 43వ వార్షికోత్సవం జరుపడంపై ఆయన మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాలకు దేశాన్నే కాదు సొంత పార్టీని కూడా నాశనం చేయడానికి వెనకాడని చరిత్ర కాంగ్రెస్ నేతలకుందని విమర్శించారు. 

ఎమర్జెన్సీ పాలనకు నిరసనగా బ్లాక్ డే నిర్వహించడం కన్నా దేశంలో ఎమర్జెన్సీ విధించి కాంగ్రెస్ చేసిన పాపాన్ని ప్రజలకు వివరించి చెప్పేందుకు ప్రయత్నించాలిని మోదీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని చాటిచెప్పాలని కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేసే ఉహాత్మక భయాందోళనలపై మాట్లాడుతూ.. దళితులు, మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమను చూపుతోందని విమర్శించారు. ఇక ఆ పార్టీ కానీ, నేతలు కానీ ఎదగబోరని హేళన చేశారు. వారికి స్వప్రయోజనాలే ముఖ్యమంటూ మండిపడ్డారు. 

ప్రఖ్యాత గాయకుడు కిషోర్ కుమార్ తమ ప్రచారం కోసం పాటలు పాడలేదనే కోపంతో ఆల్ ఇండియా రేడియోలో ఆయన పాటలు ప్రసారం కాకుండా అనధికారిక నిషేధం విధించిన చరిత్ర కాంగ్రెస్ నేతలదని ఆరోపించారు. ఇక సార్వత్రిక ఎన్నికలలో అతికష్టమ్మీద కాంగ్రెస్ 44 సీట్లను గెలుచుకోవడాన్ని జీర్ణించుకోలేక ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని ప్రచారం చేశారని మోదీ గుర్తుచేశారు. అయితే, ఇటీవల నిర్వహించిన కర్నాటక ఎన్నికల ఫలితాలు వెలువడినపుడు కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేయలేదని మోదీ పేర్కొన్నారు.

English Title
Rahul Gandhi counters PM Narendra Modi
Related News