బీజేపీ వ్యతిరేక పక్షాలకు రాహుల్ గాలం

Updated By ManamFri, 07/13/2018 - 01:06
rahul

rahulgandhiకర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు అవకాశం వస్తే తాను ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన రాహుల్ గాంధీ తిరిగి ఆ విషయాన్నీ మరెక్కడా ప్రస్తావించక పోవడం గమనార్హం. ప్రధాన మంత్రి అభ్యర్థి విషయమై ఇప్పుడు వివాదంలోకి దిగడం కన్నా బీజేపీని ఓడించడం  ప్రధాన అంశమని రాహుల్‌తో పాటు మమతా బెనర్జీ వంటి పలువురు భావిస్తున్నారు.

కర్ణాటకలో విజయవంతంగా బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయనీయకుండా అడ్డుకోగలిగిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు రాబోయే సాధా రణ ఎన్నికలపై ద్రుష్టి సారించారు. దేశం అంతటా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒకే అభ్యర్థిని నిలబెట్టే విధంగా చేయడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బీజేపీతో నేరుగా కాంగ్రెస్ పొటీపడుతున్న రాష్ట్రాలలో ఇబ్బందులు లేకపోయినా, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలలో, కాంగ్రెస్‌కు చెప్పుకోదగిన బలంలేని చోట్ల పొత్తుల విషయంలో చాల ప్రయాస పడవలసి వస్తున్నది. సీతారాం ఏచూరి సీపీఎం ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఆయనకు సోనియా గాంధీతో ఉన్న సాన్నిహిత్వం కారణంగా కాంగ్రెస్ పార్టీతో చెట్టపట్టా లు చేసుకు తిరగడానికి సిద్దపడుతున్నారు. ఈ విషయమై పార్టీ కాంగ్రెస్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురైనా వెనుకడుగు వేయలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పా ర్టీ వ్యూహరచన అంతా రాహుల్ చేబట్టడంతో ఏచూరి ఉత్సాహానికి చెక్ పెట్టిన్నట్లు అవుతున్నది. రాజకీయం గా బలహీన పడుతున్న వామపక్షాలతో పొత్తు పట్ల ఆ యన పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు కనబడటం లేదు. బీజేపీని ధీటుగా ఎదుర్కోవడంలో సీపీఎంకు మంచి సంబంధాలు లేని తృణమూల్ కాంగ్రెస్, తెలు గుదేశం వంటి పార్టీలే ఎక్కువగా ఉపయోగపడతా యి అనే ఆలోచనలు రాహుల్ ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షం సీపీఎంతో జట్టు కట్టా లని ఆ పార్టీ రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ పట్టుబడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో లోపా యికారీగా ఆ పార్టీతో పొత్తు ఏర్పరచుకున్నారు కూడా. సీపీఎంతో చేతులు కలపని పక్షంలో రాష్ట్రంలో బీజేపీ బలమైన పక్షంగా మారుతుందనే వాదనను చేస్తున్నా రు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో నాల్గవ స్థానానికి దిగ జారిన సీపీఎంతో కన్నా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ఎక్కువ ఉపయోగకారి కాగలరని రాహుల్ భావిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీకి దిగాలని రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి, ఎమ్మెల్యే మైనుల్ హక్ వర్గం పట్టుబడుతున్నది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్యెల్యేలు ఎక్కువగా ఆయనకే ఈ విషయంలో మద్దతు ఇస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో సీపీఎంతో కలసి పోటీ చేసినా ఆ పార్టీ ఓట్లు కాంగ్రెస్‌కు పడలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో చెప్పుకోదగిన పట్టు లేని ఆ పార్టీతో కలసి పోటీచేయడం ఆత్మహత్య సదృ శ్యమే అని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో జరిగిన సమావేశంలో ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకోకుండా రాహుల్ దాటవేశారు. మొన్నటి వరకు బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకం గా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి మాట్లాడుతున్న మమతా సహితం కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి తనకు అభ్యంతరం లేదని ప్రకటించారు. అయితే సోనియా గాంధీతో వలే రాహుల్ గాంధీతో తనకు పెద్దగా సాన్నిహిత్వం లేదని, అతను ‘చాలా జూని యర్’ కావడమే కారణమంటూ పరోక్షంగా రాహుల్ ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఒప్పుకొనే ప్రసక్తి లేదని సంకేతం ఇచ్చారు.  

మమతకు 30కు పైగా లోక్‌సభ సీట్లు గెల్చుకొనే అవకాశం ఉండడంతో ఆమెతో చేతులు కలిపితే రాష్ట్రంలో కొన్ని సీట్లు గెల్చుకోవడంతో పాటు 2019 లో ప్రభుత్వం ఏర్పాటులో సహాయకారిగా ఉండగల దని రాహుల్ భావిస్తున్నారు. పార్లమెంట్‌లో సీపీఎం బలం రెండంకెలకు చేరుకొనే అవకాశాలు కనబడటం లేదు. మరోవంక ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్‌లో ఎవరూ ఇష్టపడటం లేదు. అరవింద్ కేజ్రీ వాల్ పట్ల మమత సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఆసక్తి చూపుతున్నా ఆప్‌కు ప్రస్తుతం బలం గల ఢిల్లీ, పంజాబ్‌లలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థి కావడంతో పొత్తుకు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో కూడా రాహుల్ ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది. 80 మంది ఎంపీలను అందించే ఉత్తరప్రదేశ్, 40 మంది ఎంపీలు గల బీహార్‌లో పొత్తులు రాహుల్‌కు సవాల్‌గా మారనున్నాయి. యూపీలో సీట్ల సర్దుబాటు కు అఖిలేష్ యాదవ్, మాయావతి సిద్ధపడుతున్నా కాంగ్రెస్‌కు కేటాయించే సీట్ల విషయంలో ఒక అవగా హనకు రాలేక పోతున్నారు. పొత్తు రాష్ట్రానికి పరి మితం కారాదని, కాంగ్రెస్‌కు బలం ఉన్న మధ్య ప్ర దేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలలో సహితం పొత్తు ఉండాలని మాయా వతి షరతు విధిస్తు న్నారు. లేదా ఎస్పీకి ఇచ్చే సీట్లలో కాంగ్రెస్‌కు కొన్ని వదులుకోమని అఖిలేష్ కు సూచిస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ నేత లు బీఎస్పీతో పొత్తు పట్ల పెద్దగా ఆసక్తి కనబర చడం లేదు. మహారాష్ట్రలో కాంగ్రె స్‌తో పొత్తుకు శరద్ పవా ర్ సంసిద్ధత వ్యక్తం చేసినా పోటీచేసే సీట్ల సంఖ్యపై ఏకాభిప్రాయం ఏర్పడటం లేదు. గతంలో పోటీచేసిన విధంగా కాంగ్రెస్ 26, ఎన్సీపీ 22 సీట్లలో పోటీచేయాలనీ కాంగ్రెస్ నేతలు ప్రతిపాదిస్తున్నారు. అయితే 2014 ఎన్నికలలో కాంగ్రెస్ రెండు సీట్లే గెల్చుకున్నదని, కానీ ఎన్సీపీ 4 సీట్లు గెల్చుకోవడంతో పాటు ఈ మధ్య ఒక ఉపఎన్నికలో గెలుపొందడంతో ప్రస్తుతం ఐదుగురు ఎంపీలు ఉన్నారని గుర్తుచేస్తు న్నది. అందుకనే చేరి సగంగా సీట్ల సర్దుబాటు ఉండా లని పట్టుబడుతున్నారు. బిహార్‌లో ‘మహాకూటమి’లోకి ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను తీసుకు రావాలని రాహుల్ పట్టు దలగా ఉన్నారు. ఆ విధంగా చేయడం ద్వారా అక్కడ బీజేపీతో కలసి ఏర్పాటుచేసిన ప్రభుత్వాన్ని పడగొట్టా లని చూస్తున్నారు. అయితే అందుకు ఆర్జేడీ కుమా రులు విముఖంగా ఉన్నారు. బీజేపీతో పొత్తు కొనసాగి స్తామని అంటూనే సీట్ల విషయంలో బెట్టుచేస్తున్న నితీష్ బీజేపీ మొండి పట్టుదల చూపితే తన దారి తాను చూసుకొంటానని స్పష్టమైన సంకేతం ఇస్తు న్నారు. నితీష్ కుమార్‌ను వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేయించడం ద్వారా మోదీ యూపీ నుంచి పారిపోయే విధంగా చేయాలనీ కాంగ్రె స్ ఎత్తుగడగా కనిపిస్తున్నది. 

బీజేపీని ఒంటరి చేసి, ప్రతిపక్షాల మధ్య ఐక మత్యం సాధించడం ద్వారా నరేంద్ర మోదీ ప్రభం జనాన్ని 2019లో అడ్డుకోవాలనే రాహుల్ ప్రయత్నా లకు ఒకొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సమస్య ఎదురవు తున్నది. మోదీని ఓడించడం కోసం ప్రతి ఒక్కరు ప్రతిన బూనుతున్నా తమ రాజకీయ ప్రయోజనాలను త్యాగం చేయడం కోసం ఎవ్వరు సిద్ధపడటం లేదు. కర్ణాటకలో అతిచిన్న పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తే, కుమారుడు కుమారస్వామికి కాంగ్రెస్ వారెవ రైనా ఇబ్బందులు కలిగిస్తే బీజేపీతో చేతులు కలప డానికి వెనుకాడను అని మాజీ ప్రధాని దేవెగౌడ సంకేతాలు ఇవ్వడం గమనార్హం. అందుకనే పలు ప్రాంతీయ పార్టీల బీజేపీ వ్యతిరేకత ధోరణుల పట్ల జాగురతతో వ్యవహరించవలసిన అవసరాన్ని రాహు ల్ గుర్తించారు. తమిళనాడులో ప్రస్తుతం కాంగ్రెస్ పొత్తు ఏర్పర్చుకున్న డీఎంకే ఎన్నికల నాటికి బీజేపీకి చేరువ య్యే అవకాశాలు లేకపోలేదని ప్రధాని మోదీ... డీఎంకే అధినేత కరుణానిధి ఇంటికి వెళ్లి పరామర్శించి వ చ్చినప్పటి నుంచి అనుమానా లు చెలరేగుతున్నాయి. అందు కనే అక్కడ ప్రత్యామ్న్యాయం గా మరో కూటమి కోసం సిద్దపడవలసిన అవసరం కాం గ్రెస్‌కు ఏర్పడింది. ఈ సంద ర్భంగా సినీ నటుడు కమల్ హాసన్‌తో చేతులు కలిపే అవ కాశాలు లేకపోలేదు. డీఎంకే, అన్నాడీఎంకేలలో ఎవరిని విశ్వ సించాలో అనే విషయమై బీజేపీ ఒక నిర్ణయానికి రాలేక పోతున్నది. జాతీయ నాయకత్వం డీఎంకే పట్ల మొగ్గు చూపుతున్నా రాష్ట్ర నేతలు మాత్రం అన్నాడిఎంకే పట్ల ఆసక్తి చూపుతున్నారు. గత ఎన్నికలలో ఒక్క సీట్ కూడా గెల్చుకోలేక పోయిన ఆంధ్రప్రదేశ్ రాహుల్ గాంధీకి మరో సవాల్ గా పరిణమించింది. ఎన్డీయే నుంచి వైదొలిగిన తెలుగుదేశం పార్టీ పట్ల ఆసక్తి చూపుతున్నా కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల నుంచి ఆవిర్భవించిన టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్‌తో చెలిమిని ఏమాత్రం తమా యించుకోగలరన్నది ప్రశ్నార్ధకరంగా మారనున్నది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విముఖంగా లేకపోయినా కాంగ్రెస్‌తో చేతులు కలిపితే రాజకీయాలకు స్వస్తి అంటూ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొనడం సంచలనం కలిగిస్తున్నది. జనసేన అధినేత ఏమాత్రం ఓట్లు చీల్చగలరో తేల్చుకోలేకపోతున్న చంద్రబాబునాయుడుకు కాంగ్రె స్ నుండి 5 శాతం ఓట్లు కలిసినా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడంలో కీలకం కాగలవు. పైగా తనను రాజకీయంగా ‘సమాధి’ కావించాలని పట్టుదలగా ఉన్న బీజేపీ అధిష్టానాన్ని ఎదుర్కోవడం కోసం జాతీ యస్థాయిలో కొంత అండ అవసరమని భావిస్తు న్నారు. దానితో టీడీపీ, కాంగ్రెస్ ఏ విధమైన అవగా హనకు రాగలవో అన్నది ఆసక్తి కలిగిస్తున్నది. కర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు అవ కాశం వస్తే తాను ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన రాహుల్ గాంధీ తిరిగి ఆ విషయాన్నీ మరెక్కడా ప్రస్తావించక పోవడం గమనార్హం. ప్రధాన మంత్రి అభ్యర్థి విషయమై ఇప్పు డు వివాదంలోకి దిగడం కన్నా బీజేపేని ఓడించడం  ప్రధాన అంశమని రాహుల్‌తో పాటు మమతా బెనెర్జీ వంటి పలువురు భావిస్తున్నారు. హంగ్ పార్లమెంట్ ఏర్పడితే 40-50 మంది ఎంపీల మద్దతుతో ప్రధాని పీఠం ఎక్కవచ్చని చాలామంది ప్రాంతీయ పక్షాల నాయకులు కలలు కంటున్నారు. అటువంటివారిని నిరుత్సాహపరచకుండా, వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా అందరినీ సమీకరించే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నారు. 

ఇప్పటికిప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు సాధ్యంకాదని దాదాపుగా అందరూ గుర్తిస్తున్నారు. ఈ విషయమై మమతా బెనెర్జీ స్పష్టమైన అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేరుగా బీజేపీతో తలబడుతున్న రాష్ట్రాలలో ఆ పార్టీ దృష్టి సారిస్తే, మిగిలిన రాష్ట్రాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కూటమి ఏర్పాటులో చొరవ తీసుకుంటారని చెప్పారు. ఎన్నికల అనంతరమే కనీ స కార్యక్రమం ప్రాతిపదికగా బీజేపీ వ్యతిరేక పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు గురించి, ప్రధాన మంత్రి అభ్యర్థి గురించి దృష్టి సారించాలని సూచించారు. ఇప్పుడు ప్రధాన మంత్రి అభ్యర్థి అంటూ ఒకరిని ప్రకటిస్తే ఆ అభ్యర్థిపై బీజేపీ దృష్టి సారించి, ప్రతిపక్ష శిబిరంలో చీలిక తీసుకు వచ్చేందుకు ప్రయత్నించడం సులభం అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలను ఇద్దరు, ముగ్గురు ప్రధానమంత్రి పదవికి పోటీ పడే వారి మధ్య పోటీగా కాకుండా, మోదీకి వ్యతిరేకంగా జరిగే ఎన్నికలుగా మలచాలనే విషయంలో ఒక విధం గా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడినట్లు కనిపిస్తున్నది. అయినా ప్రతిపక్ష శిబిరం లో చీలికలు తీసుకు రావడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే కుమారస్వామి రెండ సార్లు ప్రధాని మోదీని కలువగలిగారు. మొదట్లో ప్రభుత్వాన్ని పడ గొట్టేందుకు కాంగ్రెస్, జేడీఎస్‌లలో అసంతృప్తులకు గాలం వేయడం ప్రారంభించిన బీజేపీ ఇప్పుడు పరోక్షంగా కుమారస్వామి బలపడటం కోసం తోడ్పా టు అందిస్తున్నది. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం గా జరగడం ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరింప చేసుకొంటుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయ విజ యన్ రెండేళ్లుగా ప్రధానిని కలవడం కోసం నాలు గుసార్లు ప్రయత్నించి విఫలం కావడం గమనార్హం. చివరకు బీజేపీ ముఖ్యమంత్రులు సహితం తరచుగా ప్రధానిని కలవలేకపోతున్నారు. అట్లాగే తెలంగాణ ముఖమంత్రి కె చంద్రశేఖర రావుకు వ్యతిరేకంగా బీజేపీ మాట్లాడుతూ తమ ఉనికి చాటుకొనే ప్రయత్నం చేస్తున్నా ఢిల్లీలో మాత్రం తెలం గాణ నుంచి వచ్చిన ఏ ఫైల్‌నైనా పెండింగ్‌లో ఉంచ కుండా సానుకూలంగా సత్వరం పరిష్కరించమని మంత్రులందరికీ ‘అనధికార ఆదేశాలు’ జారీ అయి నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక ఏ కూట మిలో లేని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పట్ల కూడా మోదీ ప్రభుత్వం సానుకూల ధోరణి ప్రదర్శిస్తున్నది. ఈ ఎత్తుగడలను అధిగమించి 2019 ఎన్నికలను ఎదుర్కోవడం రాహుల్‌కు సవాల్‌గా మారనున్నది. 
 చలసాని నరేంద్ర 
9849569050

English Title
Rahul Gandhi for anti-BJP parties
Related News