ఆకర్షణీయంగా పీఎస్‌యూ బ్యాంకు షేర్లు!

psu bank

న్యూఢిల్లీ: ప్రస్తుత మార్కెట్లో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని అజ్కాన్ గ్లోబల్ అనలిస్టు ఆకాశ్ జైన్ చెప్పారు. భూషన్ పవర్ సహా పలు కేసుల్లో విచారణ పూర్తయి బ్యాంకులకు త్వరలో పెద్ద మొత్తంలో రుణాలు వసూలు కానున్నాయని ఇటీవల ఆర్థిఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దీనికితోడు ఇప్పటికే ఎన్‌సీఎల్‌టీలో దాదాపు66 కేసులు పరిష్కారమై సుమారు రూ.80వేల కోట్లు బ్యాంకులకు రికవరీ అయ్యాయి. ఇదే సమయంలో బ్యాంకుల ఎన్‌పీఏలు కూడా క్రమంగా తగ్గుతూవస్తున్నాయి. బ్యాంకులు రుణాలిచ్చే విధివిధానాల్లో కీలక మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ కలిసి పీఎస్‌యూ బ్యాంకులను ఉత్సాహంగా ముందుకు నడిపిస్తాయని ఆకాశ్ అంచనా వేశారు. మరికొన్నాళ్లు మార్కెట్లలో తీవ్ర కదలికలే ఉంటాయని, ఇకపై క్యూ3 సీజన్, అంతర్జాతీయ పరిణామాలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తుంటాయని చెప్పారు. క్యు2తో పోలిస్తే క్యు3 బలంగా ఉంటుందని అంచనా వేశారు. డిసెంబర్‌లో ఆటో కంపెనీల గణాంకాలు పేలవంగా ఉండడంతో ఆటో కంపెనీల షేర్లపై ఒత్తిడి ఉందన్నారు. వచ్చే నెల్లో ప్రవేశపెట్టే సాధారణ బడ్జెట్ మార్కెట్లలో కీలక మార్పులకు నాంది పలకవచ్చన్నారు. మూడు అసెంబ్లీల్లో ఓటమితో కేంద్రంలోని బీజేపీ ఇకపై ప్రజాకర్షక విధానాలను తీసుకువచ్చే ఛాన్సులున్నాయన్నారు. ఈ దశలో రాజకీయాలతో సంబంధం లేని, బలమైన మేనేజ్‌మెంట్, ఎర్నింగ్స్ ఉన్న నాణ్యమైన కంపెనీల షేర్లలో క్రమానుగత పెట్టుబడులు పెట్టాలని సలహా ఇచ్చారు. కార్పొరేట్ గవర్నెన్స్ సహా క్వాలిటీ మేనేజ్ మెంట్ ఉన్న చిన్న, మధ్యతరహా స్టాకులను వాల్యూషన్ల ఆధారంగా ఎంచుకోవాలని ఆకాశ్ సూచించారు. ఇలాంటి పలు నాణ్యమైన స్టాకులు గతేడాది గరిష్ఠాలతో పోలిస్తే దాదాపు 50 శాతం వరకు డిస్కౌంట్‌తో ట్రేడవుతున్నాయని, వీటిలో మంచి వాటిని ఎంచుకోవాలని చెప్పారు. క్రూడాయిల్ ధరల పతనం పెయింట్ కంపెనీలకు కలిసివస్తుందని అంచనా వేశారు. ఇదే సమయంలో చమురు ధరల పతనం ఓఎంసీలను కుంగదీస్తుందన్నారు. 

Tags

సంబంధిత వార్తలు