భారత ప్రధానమంత్రి మోదీ మరో ఘనత

modi
  • ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు

  • ప్రపంచ నేతలందరిలో ఆయన టాప్

  • అత్యధిక లైకులున్న ఫొటోలూ మోదీవే

  • అత్యంత ప్రభావవంతమైన నేత కూడా

  • ట్విప్లొమసీ స్టడీ 2018లో వెల్లడైన లెక్కలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ మరో ఘనత సాధించారు. ఇంకో రంగంలో ఆయన అగ్రస్థానానికి దూసుకెళ్లారు. ప్రపంచం మొత్తమ్మీద ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లున్న నాయకులలో ఆయన నెంబర్ వన్‌గా నిలిచారు. విరాట్ కోహ్లీ, అనుష్కాశర్మల పెళ్లి అయిన తర్వాత వాళ్ల ఇంటికి వెళ్లి బహుమతి ఇచ్చిన ఫొటో ఈ సంవత్సరం నాయకులు పోస్ట్ చేసిన ఫొటోలన్నింటిలోకీ అత్యధిక లైకులు పొందింది. దీనికి 18.34 లక్షల లైకులు వచ్చాయి. ఇలా ఎక్కువ లైకులు పొందిన రెండో ఫొటో కూడా మోదీదే. దావోస్‌లో ప్రపంచ ఎకనమిక్ ఫోరం సమావేశాలకు వెళ్లినపుడు మంచు కురుస్తుండగా ఒక బస్టాపులో ఆయన వేచిచూస్తున్న ఫొటోకు కూడా 16.36 లక్షల లైకులు వచ్చాయి. అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో కూడా మోదీయే టాప్. ఆయన పోస్ట్ చేసిన 80 వీడియోలన్నింటికీ కూడా 8,73,302 ఇంటరాక్షన్‌లు వచ్చాయి. బర్సన్ మార్స్‌టెల్లర్ అనే అంతర్జాతీయ పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్స్ సంస్థ నిర్వహించిన ట్విప్లొమసీ స్టడీ 2018 ప్రకారం ఈ వివరాలన్నీ తెలిశాయి. మోదీకి మొత్తం 1.48 కోట్ల మంది ఫాలోవర్లు ఉండటంతో ఆయన ప్రపంచ నేతలలో అగ్రస్థానంలో ఉన్నారు. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో రెండో స్థానంలోను, అవెురికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడో స్థానంలోను నిలిచారు. ప్రపంచ నేతలలో ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్-10లో ఉన్నవారిలో పోప్ ఫ్రాన్సిస్, జోర్డాన్ రాణి రానియా, ఇంగ్లండ్ రాజకుటుంబం కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు