మంటరేపుతున్న యాసిడ్ల ధరలు

Sterlite Copper Company
  • స్టెర్లైట్ మూసివేతతో పెరిగిన రాగి దిగుమతి

  • పెరిగిన సల్ఫ్యూరిక్, ఫాస్ఫారిక్ యాసిడ్ల ధరలు

  • ఎరువుల పరిశ్రమలకు పెరుగుతున్న ఉత్పాదక వ్యయం

  • ఇతర పరిశ్రమలపైనా ప్రతికూల ప్రభావం

న్యూఢిల్లీ: స్టెర్లైట్ కాపర్ సంస్థకు చెందిన తూత్తుకుడి ప్లాంట్ మూతపడడంతో ఫాస్ఫారిక్, సల్ఫ్యూరిక్ యాసిడ్ల ధరలు ఒక్క ఉదుటున పెరిగాయని, దిగుదల రసాయనిక, ఎరువుల పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వేదాంత యాజమాన్యంలోని ఈ కంపెనీ యూనిట్‌ను  ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ ఏడాది మేలో మూసివేశారు. ‘‘కడచిన ఆరు నెలల్లో, సల్ఫ్యూరిక్ యాసిడ్ ధరలు టన్నుకు రూ. 3000 నుంచి 300 శాతం (నాలుగు రెట్ల) పెరుగుదలను కనబరుస్తూ టన్నుకు రూ. 12,000లకు పెరిగాయి. ఫాస్ఫారిక్ యాసిడ్ టన్ను ధర ఆరు నెలల క్రితం రూ. 43,000 కాగా, 23 శాతం పెరుగుదలను కనబరుస్తూ అది రూ. 53,000లకు పెరిగింది’’ అని స్టెర్లైట్ కాపర్ సి.ఇ.ఓ పి. రామ్‌నాథ్ చెప్పారు. ‘‘దేశంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ డిమాండ్‌లో 80-90 శాతాన్ని, ఫాస్ఫారిక్ యాసిడ్ డిమాండ్‌లో 15 శాతాన్ని (తూత్తుకుడి) ప్లాంట్ తీర్చేది. మా ఫ్యాక్టరీని మూసేయడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అది ధరల పెరుగుదలకు పురికొల్పింది’’ అని రామ్‌నాథ్ అన్నారు. స్టెర్లైట్ ఫ్యాక్టరీ ఏడాదికి 4,00,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో నడిచేది. అది భారతదేశపు రాగి డిమాండ్‌లో 30 శాతం పైగా తీర్చేది. సల్ఫ్యూరిక్, ఫాస్ఫారిక్ యాసిడ్లు ఉప ఉత్పత్తులుగా తయారయ్యేవి. ఎరువుల తయారీకి ఈ రెండు యాసిడ్లు ముఖ్యమైన ముడి పదార్థంగా ఉపయోగపడుతున్నాయి. రాగి ఫ్యాక్టరీ ఏడాదికి 1.2 మిలియన్ టన్నుల సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తోంది. దానిలో సగ భాగాన్ని వాణిజ్య ప్రాతిపదికపై విక్రయిస్తున్నారు. అలాగే, ఫ్యాక్టరీ నుంచి ఏటా 2,30,000 టన్నుల ఫాస్ఫారిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతోందని రామ్‌నాథ్ తెలిపారు. ఈ ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరిగితే ఎరువుల ధరలపై తప్పకుండా ప్రభావం పడుతుంది. ఎరువులను ప్రాథమికంగా కొనేది రైతులే కాబట్టి అవి వారి స్థితిగతులపైన కూడా ప్రభావం చూపుతాయి. 

రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, ఉపకరణాల వ్యయం అధికంగా ఉంటే, అది లాభాల మార్జిన్‌పై ప్రభావం చూపుతుందని రామ్‌నాథ్ అన్నారు. అనేక రకాల వస్తువుల తయారీకి రాగిని ఉపయోగించుకునే పరిశ్రమలను కూడా తూత్తుకుడి ఫ్యాక్టరీ మూసివేత దెబ్బతీస్తోందని ఆయన చెప్పారు. ‘‘గత ఆరు నెలలుగా ఫ్యాక్టరీ మూతపడి ఉండడం వల్ల రాగి దిగుమతి కూడా హఠాత్తుగా పెరిగింది. రాగిపై ప్రీమియం 10-15 శాతం పెరిగితే, రాగి దిగుమతి నెలకు దాదాపు 30,000 టన్నులుగా 2.5 రెట్లు పెరిగింది. పర్యావరణ పరమైన సమస్యలను చూపుతూ కొందరు ఫ్యాక్టరీ మూసివేతకు ఆందోళనకు దిగారు. తదనంతర పోలీసు కాల్పుల్లో నిరసనకారుల్లో 13 మంది చనిపోయారు. పర్యవసానంగా వేదాంత సంస్థకు చెందిన స్టెర్లైట్ కాపర్ యూనిట్‌ను శాశ్వతంగా మూసివేయవలసిందిగా తమిళ నాడు ప్రభుత్వం మేలో ఆదేశించింది.

సంబంధిత వార్తలు