‘ధరల’ కట్టడికి దార్లెన్నో..!

Updated By ManamThu, 09/13/2018 - 04:12
Petrol

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ విధానంలోకి తీసుకువస్తే దేశమంతా ఒకేపన్ను, ఒకే మార్కెట్ విధానం అమలులోకి వచ్చి పరోక్ష పన్నుల శాతం తగ్గుతుంది. వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే అత్యధిక రేటు 28 శాతం విధించినా పెట్రోలు, డీజిల్ ధరలు లీటరు 55 రూపాయలకు మించవు. ఫలితంగా ఆదాయంలో తగ్గుదలను కార్పొరేట్ పన్నుల సమీకరణ ద్వారా భర్తీ చేసుకోవచ్చు. 

petrol‘మనసుంటే మార్గం ఉంటుం’దని అంటారు. అదే ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తుల్లో కేంద్రప్రభుత్వానికి వర్తిస్తుంది. అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ ధర పెరిగిందంటూ రోజురోజుకూ పెట్రోలియం ఉత్పత్తులైన పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ తదితరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా యి. ఇది ప్రత్యక్షంగా కనిపించే ధరలైతే పరోక్షంగా నిత్యావసరాలన్నీ అందుబాటు ధరల్లో ఉండడం లేదు. సామాన్యుడు గిలగిలలాడుతున్నాడు. ప్రజల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిత్యం చెబుతోంది. ప్రజలేమో పెట్రోలు, నిత్యావసర ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికిదేమీ పట్టనట్టు ప్రేక్షకపాత్ర వహిస్తోంది. ధరల అదుపునకు తాము చర్యలు తీసుకోకపోతే పోయె కనీసం సానుభూతి చర్యలుగానీ, ఊరడింపు మాటలు కూడా లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్న కేంద్రంపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశంలో విహరిస్తున్నాయి. వీటి ధరలు పెరగడం మంచినీళ్లు తాగినంత సులువుగా ప్రతిరోజూ అనూహ్యంగా పెరుగుతూనే ఉ న్నాయి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా పెట్రోలు ధర లీటరు 80 రూపాయలకు పైమాటే. అలాగే డీజిల్ రేటు 70కి పైమాటే. ఆయా రాష్ట్రాల్లో విధించే వ్యాట్‌పై ఆధారపడి ఈ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రజల కష్టాలను పట్టించుకోవలసిన ప్రభుత్వం తాను చేయగలిగిందేమీ లేదన్నట్లు మీనవేుషాలు లెక్కిస్తూ ప్రజల సహనాన్ని పరీక్షిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పరివారమేమో నిస్సహాయతతో చేతులెత్తేసింది. ఈ ధరలకు అంతర్జాతీయ విపణిలో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలే కారణమనే సాకులు చెబుతున్నారు. రాష్ట్రాలేమో కేంద్రంపై నెపం నెడుతుండగా, కేంద్రమేమో రాష్ట్రాలు వ్యాట్ తగ్గించుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వల్లెవేస్తోంది. ఒకరిపై మరొకరు నెపం మోపుకోవడం చూస్తుంటే అంతా కుంటిసాకులుగా ఎవరికైనా అర్థమవుతుంది. పొరుగు దేశాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు పాతాళంలో ఉండగా ఒక్క మనదేశంలోనే ఆకాశంలో విహరిస్తున్నాయి. 2018 సెప్టెంబర్ ఒకటో తేదీ లెక్కల ప్రకారం, భారత్ (ఢిల్లీ)లో పెట్రోలు లీటరు 78.68 రూపాయులుండగా, డీజిల్ లీటరుకు 70.42 రూపాయులున్నది. అదే పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో లీటరు పెట్రోలు ధర 53.55, డీజిల్ లీటరు 61.47 రూపాయులున్నది. బంగ్లాదేశ్‌లో పెట్రోలు 73.48, డీజిల్ 55.54, శ్రీలంకలో పెట్రోలు 63.96, డీజిల్ 52.05, నేపాల్‌లో పెట్రోలు 69.94, డీజిల్ 59.86 రూపాయులున్నది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ సంఘానికి చెందిన పెట్రోలియం ప్లానింగ్, విశ్లేషణ విభాగం (పీపీఏసీ) లెక్కలివి. 

మరి భారత్‌లోనే పెట్రోలు, డీజిల్ ధరలు ఇతర దేశాలతో పోల్చితే ఎందుకింత వ్యత్యాసం? అంటే సెం ట్రల్ ఎక్సైజ్ పన్ను, రాష్ట్రాలు విధించే వ్యాట్... రెండూ కలిసి ప్రజలను కొల్లగొడుతున్నాయి. లీటరు పెట్రోలు కు కేంద్ర ప్రభుత్వం 19.48 రూపాయల ఎక్సైజ్ సుంకం వసూలుచేస్తోంది. అదే డీజిల్‌కు లీటరుకు 15.55 వసూలు చేస్తోంది. దీనికి అదనంగా రాష్ట్రాలు విధించే వ్యాట్‌తో మొత్తం రేటు తడిసి మోపెడంత అవుతోంది. ఈ పన్నులు లేకపోతే అంతర్జాతీయ విపణిలో క్రూడ్ ఆయిల్ ధరలు ఎంతున్నా లీటరు పెట్రోలు దాదాపు 40 రూపాయలుంటుంది. పెట్రోలు, డీజిల్ ధరల విషయంలో పరోక్ష పన్నులు (సెంట్రల్ ఎక్సైజ్ పన్ను, రాష్ట్రాలు విధించే వ్యాట్) పెట్రోలు ధరలపై నూటికి నూరు శాతం ప్రభావం చూపుతున్నాయని అర్థమవుతోంది. డీజిల్ ధరలపై 70 శాతం ఉంటోంది. కేంద్రం విధిస్తున్న సెంట్రల్ ఎక్సైజ్ పన్ను (జీటీఆర్) యూపీఏ ప్రభుత్వ హయాంలో కంటే ప్రజల కోసం పనిచేస్తున్న (ఎన్‌డీఏ నేతలు అలా చెప్పుకుంటున్నారు) ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలోనే అధికం. 2009-10 నుంచి 2013-14 మధ్య ఐదేళ్లకాలంలో పెట్రోలియం ఉత్పత్తులపై విధించిన పన్నుల వల్ల లభించిన స్థూల పన్ను ఆదాయం సగటున 8.8 శాతం పెరిగింది. అదే తరు వాత ఐదేళ్ల కాలం అంటే ఎన్‌డీఏ హయాంలో 2014- 15 నుంచి 2017-18 కాలంలో 12.5 శాతం చొప్పున పెరిగింది. అదేవిధంగా కార్పొరేట్ పన్నులు యూపీఏ -1 హయాంలో 36.5 శాతం ఉండగా, యూపీఏ-2 హయాంలో 30.7 శాతం ఉన్నది. యూపీఏ -2 హ యాంలో ఆదాయపు పన్ను ఆదాయంలో వాటా 19 శాతం నుంచి 21 శాతానికి పెరిగింది. ఇది చూస్తుంటే ఆదాయ సమీకరణ వ్యూహంలో ఎన్‌డీఏ అనుసరించిన వర్గ పక్షపాతాన్ని (ఛిజ్చూటట ఛజ్చీట) చూపిస్తోంది. పెద్దసంఖ్యలో కార్పొరేట్ సంస్థల పన్ను వాటాలో తగిన విధంగా తగ్గగా, ఇంధన వినియోగదారులు, ఆదాయపన్నుదారుల వాటా ద్విగుణీకృతంగా పెరగడం కనిపిస్తుంది. అంటే పేదలు, మధ్యతరగతి వారి మూల్యంపై బడా పారిశ్రామికవేత్తలు ప్రయోజనం పొందారు. ఇప్పటికైనా ఈ సామాజిక అసమానతను, అన్యాయ నిధుల సమీకరణ విధానాన్ని సవరించవలసిన అవసరం ఉన్నది. 

పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించాలంటే ప్రతిపక్షాలు సూచిస్తున్న మార్గమే శరణ్యం. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ విధానంలోకి తీసుకువస్తే దేశమంతా ఒకేపన్ను, ఒకే మార్కెట్ విధానం అమలులోకి వచ్చి పరోక్ష పన్నుల శాతం తగ్గుతుంది. కిరోసిన్, ఎల్‌పీజీలు ఇప్పటికే జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చారు. అదే విధానాన్ని పెట్రోలు, డీజిల్‌కూ అనుసరించాలి. వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే అత్యధిక రేటు 28 శాతం విధించినా పెట్రోలు, డీజిల్ ధరలు లీటరు 55 రూపాయులకు మించవు. ఫలితంగా ఆదాయంలో తగ్గుదలను కార్పొరేట్ పన్నుల సమీకరణ ద్వారా భర్తీ చేసుకోవచ్చు. 2018-19 బడ్జెట్ అంచనాల ననుసరించి కార్పొరేట్లకు పన్ను రాయితీల కారణంగా గత రెండేళ్లలో ఒక్కొక్క ఏడాదికి 85వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. ఆదాయ సమీకరణలో పారిశ్రామిక అనుకూల విధానాన్ని సవరించుకోవలసి ఉన్నది. 
ప్రసేన్‌జీత్ బోస్
ఆర్థికవేత్త, రాజకీయ కార్యకర్త
(‘వైర్’ సౌజన్యం)

Tags
English Title
The price of 'price'
Related News