ప్రణబ్ అవకాశవాదం 

Updated By ManamTue, 06/12/2018 - 00:04
PRANAB

imageప్రజాస్వామిక దేశంలో అత్యున్నత పదవికి చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ రాజకీయ నాయకుడిగా, మేధావిగా గుర్తింపు పొందారు. ఆయన రాజకీయ జీవితంలో పార్టీలు మారివుండవచ్చు, అదేమీ పట్టిం చుకోదగిన అంశం కాదు. రాష్ట్రపతిగా ఎన్నిైకెన తరువాత, పదవీ విరమణ అనంతరం ఆయన ఎంతో గౌరవప్రదంగా నడుచుకోవలసి ఉంటుంది. ఆర్‌ఎస్‌ఎస్ పంపిన ఆహ్వానాన్ని ఆయన అంగీకరించారు. ఆయన మంచి ప్రసంగమే చేసివుండవచ్చు, కానీ ఆ ప్రసంగం ఏ వేదిక నుంచి చేశారనేదే ప్రజల ఆందోళన. అది దెయ్యాల ముందు వేదాలు వల్లించినట్లే కాగలదు. చరిత్ర తెలియని వ్యక్తేం కాదు ప్రణబ్, కాకపోతే అది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను, మోదీ సైన్యాన్ని ఆకట్టుకునే అవకాశవాదం కావచ్చు. 

గాంధీజీని హత్యచేసిన గాడ్సె గురించి ఆయన ఒక్కమాట కూడా చెప్పలేదు. ఆర్‌ఎస్‌ఎస్ కాడర్‌ను మెప్పించేందుకే ఆయన ఈ అంశంపై ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. ఆర్‌ఎస్‌ఎస్ వ్య వస్థాపకుడు హెగ్డేవార్‌ను గొప్ప దేశభక్తుడిగా ప్రణబ్ ప్రశంసించారు. స్వాతంత్య్రపోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ ఏనాడూ పాల్గోలేదనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. పైపెచ్చు ముస్లింలు, క్రిష్టియన్లు, కమ్యూనిస్టులు దేశానికి శత్రువులని ఆ రోజుల్లో హెగ్డెవార్ చెప్పేవారు. అంతేగానీ బ్రిటిషువాళ్లు మన శత్రువులని ఆయనెన్నడూ చెప్పలేదు. సామ్రాజ్యవాదం పట్ల ఈనాటికీ ఆర్‌ఎస్‌ఎస్ వైఖరిలో మార్పులేదు. అయితే వారిలో కచ్చితంగా స్వల్పమార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. అదేమిటం టే - గతంలో వాళ్లు నిక్కర్లు వేసుకునేవారు, ఇప్పుడు ప్యాంట్లు ధరిస్తున్నారు. ఆవిధంగా తాము ఎదిగామని వారు భావిస్తున్నారు. అదొక్కటే వారిలో కనిపించే మార్పు. 

ఆర్‌ఎస్‌ఎస్ ఆధీనంలో ఉండే బీజేపీ పాలనలో అనేకమంది మేధావులు, రచయితలు, జర్నలిస్టులు, కమ్యూనిస్టులు, గౌరీ లంకేశ్, గోవింద్ పన్సారే, నరేంద్ర డబోల్కర్, కల్బుర్గీ వంటి హేతువాదుల్ని హత్యచేశారు. జర్మనీలో నాజీ హిట్లర్ ఏం చేశాడో అదే ప్రస్తుత ప్రభుత్వం చేస్తోంది. గోరక్షణ పేరుతో బీఫ్‌ను నిషేధించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రమే బీఫ్‌ను ఎక్కువ ఎగుమతి చేస్తోందనేది వాస్తవం కాదా? మన్‌మోహన్ సింగ్, ప్రణబ్ దాదా హయాంలో మధుకొడ, ఏ రాజా, కనిమొళి వంటి అవినీతి నేతలెందరో జైలుకెళ్లారు. అయితే, ఇప్పుడేం జరుగుతోంది? వేలాది కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణంగా పొంది న ఎగవేతదారులు దేశం విడిచి సురక్షితంగా పరారయ్యారు. బీజేపీ ప్రభుత్వం అండలేకుండానే వారు సరిహద్దులు దాటారా? పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 14 వేల కోట్ల రూపాయల మేరకు మోసం చేసి విదేశాలకు పరాైరెన నీరవ్ మోదీ ఏ విధంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో గత ఫిబ్రవరి చివరి వారంలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికపై మోదీ తదితర నాయకులతో చేతులు కలిపారు? భారత పాస్‌పోర్టుతో లలిత్ మోదీ వేరే దేశానికి ఎలా వెళ్లగలిగారు? మరి విజయ్‌మాల్యా, లలిత్ మోదీ, నీరవ్ మోదీ వంటి పన్ను ఎగవేతదారుల గురించి ప్రణబ్ ముఖర్జీ ఒక్కమాట కూడా ప్రస్తావించలేదెందుకని? అది ఆయన శుద్ధ అవకాశవాదాన్ని ప్రతిబింబించడం లేదా?

ఈ దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలన్నింటిలోనూ కేంద్ర ప్రభుత్వానికి ఆర్‌ఎస్‌ఎస్ మస్తి ష్కమే మూలం. ప్రణబ్ హయాంలో ఉన్న విదేశీ విధానం నేడు నూటికి నూరుపాళ్లు మారిపోయింది. ఆర్‌ఎస్‌ఎస్‌ను నిలబెట్టడం పోయి ఈ అంశంలో ఆయన తన ప్రసంగంలో మౌనం వహించారు. ఎప్పటిలాగానే వారు జాతీయ జెండాను ఆవిష్కరించలేదు, జాతీయగీతాన్ని ఆలాపించలేదు. 
ఉత్తరం నుంచి దక్షిణం వరకు  తాము దేశాన్ని ఆక్రమించుకుంటున్నామని వారు గొప్పలు చెప్పుకున్నారు. తాము ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రాన్ని గెలుచుకోగలమని భావిస్తున్నారు. ఆ ప్రకటన కర్ణాటక ఎన్నికల ముందు వరకు వినబడేది. వారొక విషయం మరిచిపోయారు - దేశం మొత్తం మీద వారు 32 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగారు. బీజేపీ ప్రతిష్ఠ గ్రాఫ్ కూడా దిగజారుతోందన్నది వాస్త వం. గోరఖ్‌పూర్ నుంచి వారి కౌంట్‌డౌన్ ప్రారంభ మైంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వారు 11 అసెంబ్లీ స్థానాల్లోను, నాలుగు లోక్‌సభ స్థానాల్లోను పోటీచేశారు. కానీ, అసెంబ్లీ స్థానాల్లో ఒకటి, లోక్‌సభ స్థానాల్లో ఒక్క చోట మాత్రమే గెలుపొందారు. ఉత్త రం నుంచి దక్షిణం వరకు గెలుస్తామనే వారి ఆశాభావానికి జేజేలు. గవర్నర్ ద్వారా కర్ణాటకలో వారి మెలో డ్రామాను చూశాం. కానీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడి, దేశంలోని లౌకిక శక్తులను ఏకంచేసినందుకు సుప్రీంకోర్టుకు అభినందనలు. 

ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో మిత్రపక్షాైలెన శివసేన వంటి పార్టీలకు మోకరిల్లుతోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇటీవల సినీనటి మాధురీ దీక్షిత్‌తో సమావేశమయ్యేంత వరకు వెళ్లారు. వారిగ్రాఫ్ కచ్చితంగా దిగజారిపోతోందనడానికి ఇది సూచికగా కనబడుతోంది. తన ప్రసంగం ద్వారా ప్రణబ్ ముఖర్జీ అభిమానులను ఆకట్టుకోలేకపోయారు. ఎలాంటి విషయం లేని ప్రసంగం ద్వారా ప్రజానాయకుడి వల్ల దేశానికి ఏ విధంగానూ ప్రయోజనం ఉండదని లోతుగా అధ్యయనం చేస్తే అర్ధమవుతుంది. తన ప్రయోజనాల కోసం ప్రణబ్‌ను బీజేపీ వాడుకుంటోంది. గతంలో కూడా ప్రణబ్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆర్‌ఎస్‌ఎస్ ఆహ్వానాన్ని అంగీకరించడం అవకాశవాదమన్నా కా వాలి లేదా ఆయన మూర్ఖులను రంజింపజేయగలననైనా భావించివుండాలి. తమ ఆహ్వానాన్ని మాజీ రాష్ట్రపతి చేత అంగీకరింపజేయడం ద్వారా బీజేపీ లబ్ధిపొందవచ్చుగానీ, ప్రణబ్ జీవితానికిదో మచ్చగా మాత్రం మిగిలిపోతుంది. 
- కె.నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి

English Title
Pranab is opportunistic
Related News