20 నుంచి ‘ప్రజాయాత్ర’

Updated By ManamThu, 05/17/2018 - 23:19
pavan
  • అన్ని నియోజకవర్గాల్లో నిరసన కవాతు.. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింది 

  • ఇచ్చిన విభ జన హామీలు నెరవేర్చలేదు.. ఇచ్ఛాపురం నుంచి యాత్రకు శ్రీకారం

  • ఉత్తరాంధ్రలో 17 రోజుల యాత్ర.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడి

pawanవిశాఖపట్నం: రాష్ట్రాన్ని విభజించే సమయంలో పార్లమెంటు సాక్షిగా 2014లో ఇచ్చిన హామీల అమలుకు పోరాటం చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తెలిపారు. విశాఖపట్నానికి వచ్చిన ఆయన గురువారం రామాటాకీస్ సమీపంలోని అంబేద్కర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఈనెల 20వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజాయాత్ర చేయనున్నట్టు తెలిపారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు నెరవేరలేదని, వాటిని సాధించుకునేందుకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో గంగపూజ చేసి ప్రజాయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. అక్కడి నుంచి విజయనగరం, విశాఖ జిలాల్లో ఈ యాత్ర సాగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రజలతో మమేకమై రోడ్ షోలు, బహిరంగ సభల్లో వివరిస్తానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో లక్ష మందితో నిరసన కవాతులు చేపడతామన్నారు. ప్రజా సమస్యలపై స్పందించేందుకు రోడ్డుపైకి వస్తానన్నారు. విశాఖలో రెండురోజులు పాటు ఉంటానని..  ఈ రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు. జై ఆంధ్ర ఉద్యమంలో అసుమలు బాసినవారికి నివాళులర్పిస్తామన్నారు. ఉత్తరాంధ్రలో 17 రోజుల పాటు తన యాత్ర కొనసాగుతుందన్నారు.

రాత్రి నుంచే సందడి..
బుధవారం రాత్రి విశాఖకు చేరుకున్న పవన్ అంబేద్కర్ భవన్‌లో రాత్రి బస చేశారు. భవన్‌లో నేలపైనే ఆయన విశ్రమించారు. నిర్వాహకులు ఏసీ గదిని సమకూర్చగా వద్దని తిరస్కరించారు. గురువారం తెల్లవారుజాము నుంచే జనసేన కార్యకర్తలు, అభిమానులు బారులు తీరారు. దగ్గరలోని చిన్న హోటల్‌లో టిఫిన్ చేశారు. రామాటాకీస్ రోడ్డు, అంబేద్కర్ భవన్‌లు పవన్ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం 11 గంటలకు అభిమానులను పలకరించేందుకు పవన్‌కల్యాణ్ బయటకు వచ్చారు. వారికి అభివాదం చేసి నమస్కరించి మీ అందరికీ అండగా ఉంటానని చెప్పి మళ్లీ అంబేద్కర్ భవన్‌లోకి వెళ్లారు. అక్కడ దాదాపు రెండు గంటల సేపు కార్యకర్తలతో సమావేశమైన అనంతరం కోర్ కమిటీతో  భేటీ అయ్యారు.

English Title
Prajayatra From 20
Related News