పోషకాటకం 

Updated By ManamTue, 07/10/2018 - 23:01
 Food
  • పోషక విలువలు మృగ్యమవుతున్న మన ఆహారం

 Food‘ఆకలి రుచి ఎరుగదు’ అని అంటారు, కానీ ఆకలికి రుచి తెలియక పోయినా, మనకు మాత్రం మనం తినే ఆహారంలో ఏది మంచిదో, ఏది పనికి రానిదో తెలిసి తీరాలి. లేకుంటే ఆరోగ్యం మీద ఆశ వదులుకున్నట్టే! మనందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న కనీస కోర్కె ఉండడం సహజం. ఆరోగ్యం ఒక మానవ హక్కు కూడా. కానీ ఇవాళ మనం తింటున్న ఆహారం నిజంగా ఆరోగ్యకరమైందేనా?! ఆరోగ్యకరమైన ఆహారానికి సంబంధించిన సూచనలు రోజుకో రకంగా మారిపోతున్నాయి. జీడిపప్పు తింటే ‘కొలెస్ట్రాల్’ పెరిగి పోతుందంటూ గతంలో భయపెట్టే వారు. ఇప్పుడు జీడిపప్పు వాడకం ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు. అలాగే ఇంతకు క్రితం కోడిగుడ్డులోని పచ్చసొన మంచిది కాదు, తెల్లసొన మాత్రమే తినాలి అంటూ హితవు పలికే వారు. ఇప్పుడేమో గుడ్డులోని తెల్లసొన కంటే పచ్చసొనే ఆరోగ్యకరమైంది అంటున్నారు. నెయ్యి తింటే గుండె జబ్బులు ఖాయమన్న వారు సైతం ఇప్పుడు నెయ్యి ఆరోగ్య ప్రదాత అని చెబుతున్నారు. అన్నం మానేసి, గోధుమ రొట్టెలు తినమన్నారు. సరే కదాని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలనుకున్న వారంతా పుల్కాల మీద పడ్డారు. ఇప్పుడేమో అదేపనిగా ఒకే రకం చిరుధాన్యాల్ని తినకూడదు. ఆమాటకొస్తే, ఏ ఆహారాన్ని కూడా అదే పనిగా సంవత్సరాల తరబడి తింటూ పోతే ఆరోగ్యానికి ముప్పు అంటున్నారు. ఈ జ్ఞానం నుంచే ‘మల్టీగ్రైన్’ (రకరకాల చిరుధాన్యాల మిశ్రమం) అనే ఆహారధోరణి ప్రబలింది. నిజానికి ఇలా ఆరోగ్యానికి ఇది మంచిది, అది మంచిది అంటూ చాలామంది చెబుతుంటారు. ఆరోగ్యకరమైన ఆహారానికి సంబంధించి యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలు కూడా దొరుకుతుంటాయి. ఇలా తలొక మాట చెబితే, విన్నంత మేరకు వింటున్నారు. విన్నదంతా ఆచరణలో పెట్టాలని మార్కెట్‌లో తెగ గాలించేసి మరీ కొత్తకొత్త ఆహార పదార్థాల్ని కొనుక్కుంటు న్నారు. అయితే ఇక్కడొక చిక్కుంది. ఇలా ఆరోగ్యకరమైన ఆహారం అంటూ చెప్పిన పదార్థాల్ని మార్కెట్‌లో కొనడానికి వెళితే, చేతులు కాలిపోతున్నాయి, జేబులు ఖాళీ అవుతున్నాయి. 

అతి ప్రాచీన సంస్కృతి కలిగిన భారతీయ సమాజం పవిత్రతకు పట్టం కడుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. మనకు ‘వేద విజ్ఞానం’ పేరుతో ఏం చెప్పినా బుద్ధిగా వింటాం. ప్రకృతిని పూజిస్తాం. భిన్నత్వంలో ఏకత్వం అంటూ బహుళ సంస్కృతుల మేళవింపుగా కూడా మనం రాజిల్లగలం. మన ఆహార సంస్కృతి కూడా ఈ భిన్న సంస్కృతుల మేళవింపుగానే ఉంటుంది. ‘మన దే’ అనుకుంటూ మనం స్వీకరిస్తున్న అనేకానేక వంటలకు మూలం నిజంగా మనదేశం కాదంటే కొంత బాధగానే ఉన్నప్పటికీ, అది నిజం! ఉదాహరణకు మనం అత్యంత ప్రేమగా ఆరగించే ‘చికెన్ టిక్కా మసాలా’కు మూలం భారతదేశం కాదు, అది స్కాట్లాండ్‌లోని గ్లాస్గోవ్‌లో కనిపెట్టిన వంటకం. అంతెందుకు మనం ప్రతిరోజూ మన వంటకాల్లో ఉపయోగించే బంగాళాదుంప, టమోటో, పచ్చిమిరపకాయ వంటి కూరగాయలకు కూడా మాతృదేశం భారత్ కాదు, వాటిని పోర్చుగల్ నుంచి మనం అరువు తెచ్చుకున్నాం. అంతమాత్రం చేత పొలాన్ని దున్ని మనకు అన్నదానం చేస్తున్న మన రైతుల కష్టాన్ని తక్కువ అంచనా వేయకూడదు. వారి కష్టం పవిత్రమైంది. ఆహారానికి సంబంధించి భారతీయుల నమ్మకాలు కూడా ఎక్కువ భాగం పవిత్రతతో ముడిపడి నవే! అయితే, ఇవాళ మనం తింటున్నదం తా పవిత్రమైనదేనా?! కాదన్న జవాబు వింటే, మనస్సు చివుక్కు మంటుంది. కానీ నిజాల్ని అంగీకరించి తీరాల్సిందే! 

వైవిధ్యలోపం
ప్రాచీన భారతీయ సంప్ర దాయ ఆహార సంస్కృతిని పరిరక్షించుకోవడానికి మనం అలుపెరుగని పోరాటం చేస్తు న్నాం. అయితే ‘ఆధునికత’ పేరిట జీవితంలోకి చొచ్చుకు వచ్చే సమకాలీన ఆహారపు టలవాట్లకు దూరంగా మడి కట్టుకుని కూర్చోవడం మనకే కాదు, ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని విషయం. కొత్త వంట కాల్ని, విదేశీ ఆహారప దార్థాల్ని ఒక్క సారైనా రుచి చూడాలని మనం కోరుకుంటాం. మనం కోరుకుంటున్న ఈ మార్పు మన ఆహారంలోకి రసాయనాలతో పాటు అధిక శాతం చక్కెర, ఉప్పు, ఇతర ప్రిజర్వేటివ్స్ వాడకా న్ని భారీగా చొప్పించేసింది. పాతకాలంలో ఉపయోగించే రాగి, జొన్న, సజ్జలు వంటి తృణధా న్యాల స్థానంలో రిఫైన్‌డ్ పిండి వచ్చేసింది. బియ్యాన్ని ఒకటికి పదిసార్లు శుద్ధి చేసే నెపంతో సన్నటి, తెల్లటి బియ్యాన్ని కంటికి ఇంపుగా తయారు చేయడం మొదలైంది. ఇదంతా పాత కాలపు ఆహారంలోని పీచుపదార్థాల్ని తోసిరాజని, శరీరంలో అనవసరపు చక్కెర నిల్వల్ని పెంచే విషపూరిత ప్రభావాన్ని ఆరోగ్యం మీదికి తెచ్చిపడేసింది. పోషక విలువలు ఎక్కువగా ఉన్న నెయ్యిని పక్కనబెట్టి, రిఫైండ్ ఆయిల్ మన కడాయిల్లో సలసల కాగుతూ, ఆరోగ్యానికి నిప్పు పెడుతోంది. 

వ్యవసాయమే కారణమా?
ఐదుగురు భారతీయుల్లో నలుగురు పోషకాహార లోపంతో బాధపడుతుంటే, ఒక్కరు మాత్రం అధికబరువు సమస్యతో ‘ఒబేసిటీ క్లినిక్‌ల’ చుట్టూ తిరుగుతున్నారు. అయితే మధ్యతరగ తి ప్రజల్లో చాలామంది ప్రతిపూట తమకు నచ్చిన ఏదో ఒక కూరతోనైనా సంతృప్తిగా తినగలుగుతున్న ప్పటికీ, వారు తీసుకుంటున్న ఆహారంలో పోషకాల శాతం చాలా తక్కువగా ఉంటోంది. అంటే సగటు భారతీయుని ఆహారం పోషకాల కరువుతో కునారిల్లుతోందని అర్థం అవుతోంది. మరికొంత మంది అదేపనిగా చేస్తున్న పోషకాల వేట ‘ఆత్మహత్యా’ సదృశంగా మారిపోతోంది. ఇంతటి ఉపద్రవానికి కారణం వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతిక పరమైన మార్పులేనని చెప్పవచ్చు. ఏదో ఒక ఆహార పదార్థాన్ని ప్రధాన ఆహారంగా మార్చడమన్నది వ్యవసా యపరమైన సౌకర్యానికి సంబంధిం చింది. మనిషి తన ఆహారపు అవసరాల్ని తీర్చుకునే క్రమంలో ప్రధాన ఆహారం, ప్రధాన పంటలు అంటూ వైవిధ్యమే జీవమంత్రంగా ఉన్న ప్రకృతికి విరుద్ధమైన ఒక విధానాన్ని కనిపె ట్టాడు. ఇంతవరకు మా నవ నాగరికత అభివృద్ధికి మూలంగా భావిస్తూ వచ్చిన వ్యవసాయ సంస్కృతి మనిషికి మేలు కంటే కీడే చేసిందని ఇజ్రేలీ చరి త్రకారుడు యువల్ నోవా హరారీ ఒక సంచల నాత్మక ప్రకటన చేశారు. ఆరోగ్యపరంగా మనం ఎదుర్కొం టున్న సమస్యలకు, ఆర్థికంగా రైతులు ఎదుర్కొం టున్న సంక్షోభాలకు కారణం వ్యవసా యమేనన్నది ఆయన అభిప్రా యం. మానవ శరీరం వ్యవసాయానికి, నిరంతర శ్రమకు ఉద్దేశించింది కాదు. అందుకే వ్యవసాయం నేర్చుకున్న తరువాత మనిషి ఆరోగ్యంలోకి ఆర్థరైటిస్, నడుంనొప్పి, హెర్నియా వంటి జబ్బులు వచ్చి చేరినట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంతేగాక వ్యవసాయం మానవాళి ఆహారపుట లవాట్ల మీద కూడా కొన్ని దుష్ప్రభా వాన్ని చూపినట్టు తెలుస్తోంది. ప్రాచీన మానవులు అడవుల్లో ఆహార సేకరణ జరిపేటపుడు రకరకాల ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు, దుంపలు, గింజలు వంటివి సేకరించి తినేవారు. అంటే వారి ఆహారం గొప్ప వైవిధ్యంతో కూడుకున్నదన్న మాట. మనం ఇప్పుడు ప్రధాన ఆహారంగా స్వీకరిస్తున్న ధాన్యమన్నది వారి ఆహారంలో స్వల్పంగా ఉండేది. ధాన్యాన్ని ప్రధాన ఆహారంగా మార్చివేయడం వల్ల భూమ్మీద అత్యధిక ప్రజలు పోషకాలు పూర్తిగా అడుగంటిన ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. 

తీరని ఆకలి
ఆహారంలో వైవిధ్యం నశించింది, సూక్ష్మపోషకాలు నశించాయి. దాంతో శరీరంలో రసాయనిక సమతుల్యత లోపించింది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, విటమిన్ -ఎ, ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్, అయొడిన్, థియోమిన్ వంటి పోషకాలు అవసరం. ఈ పోషకాలు లోపించడం వల్ల శరీరంలో కనిపించని ఆకలి శాశ్వతంగా ఉండిపోతుందని, అదే వ్యాధుల రూపంలో బయటపడుతుం దని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మీకు ఆకలిగా అనిపించక పోవచ్చును కానీ, తగిన మోతాదులో పోషక పదార్థాలు అందనప్పుడు శరీరంలో ఆకలి ఉండిపోతుందని డబ్ల్యుహెచ్‌వొ చెబు తోంది. ఉదాహరణకు శరీరానికి తగినంత ఐరన్ అందకపోతే అది రక్తహీనతకు దారితీస్తుంది. ముఖ్యంగా మహిళలు గర్భిణులుగా ఉన్నప్పుడు వారిని నీరసం ఆవహిస్తుంది. మనదేశంలో ఐదుగురు పురుషుల్లో ఒకరు, ఇద్దరు మహిళల్లో ఒకరు రక్తహీన తతో బాధపడుతున్నారని కుటుంబ ఆరోగ్యానికి చెందిన జాతీయ సర్వే చెబుతోంది. అలాగే విటమిన్-ఎ లోపం వల్ల దృష్టిమాంద్యంతో పాటు, అనేక రకాల ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తాయి. భారతీయుల్లో అత్యధికులు అత్యంత తక్కువ శాతం పోషకాల్ని తీసుకుంటున్నారు. పట్టణాల్లో నివసిస్తున్న సగటు భారతీయ కుటుంబం కేవలం 22.8 శాతం విటమిన్-ఎ, అవసరమైన దానిలో సగానికి సగం మాత్రమే రిబొ ఫ్లావిన్ అనే విటమిన్‌ను స్వీకరిస్తోంది. వీరి ఆహారంలో కాల్షియం, ఐరన్ కూడా లోపి స్తున్నాయి.  చక్కెర, హాని కారక కొవ్వుపదార్థాలతో కూడిన ఆహారం ప్రజలకు సులభంగా అందుబాటులోకి వస్తోంది. ఫలితంగా అనారోగ్యం పడగ విప్పుతోంది. ప్రజలు అనారోగ్యాల పాలయ్యే కొద్దీ ప్రభుత్వం ఆరోగ్య రంగం మీద పెట్టాల్సిన ఖర్చు పెరిగిపోతోంది. ఇలాంటి ఖర్చును తగ్గించేందుకు ఫ్రాన్స్, నార్వే, జపాన్, మెక్సికో వంటి దేశాలు ఒక కొత్త పద్ధతిని కనిపెట్టాయి. చక్కెర, హానికారక కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారపదార్థాలపై అధికమైన సుంకాలు విధించాయి ఈ దేశ ప్రభుత్వాలు. ఇలాంటి ఆహారపదార్థాల ఉత్పాదనను ఇరవై శాతం వరకు తగ్గించాలన్న ఆలోచనలో ఉంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. మన దేశంలో ఇలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే జాడ కూడా కనిపించడం లేదు. మద్యం, పొగాకు విక్రయాలతో ఖజానాలు నిండాల్సిన అగత్యం ఉన్న చోట ప్రభుత్వాల నుంచి ఇలాంటి నిర్ణయాల్ని ఆశించడం దురాశే అవుతుందేమో?!  

పాత ఒక ‘వింత’
దక్షిణ భారతదేశంలో గత ఇరవై ఏళ్ళుగా తృణధాన్యమైన రాగి వాడకం పూర్తిగా తగ్గిపోయింది. అది పేదవాళ్ళ ఆహారంగా ప్రజల్లో అపోహ పెరగడం వల్ల ఇలాంటి వైపరీత్యం ఏర్పడింది. ఎప్పుడైతే రాగి వాడకం తగ్గిపోయిందో, దాన్ని పండించడం కూడా తగ్గిపోయింది. డిమాండ్‌ను బట్టే ఉత్పాదన ఉంటుంది కదా! అయితే ఇప్పుడు పోషకాహార నిపుణులు రాగిని ఉపయోగించాలంటూ బోధిస్తుండడంతో, అది ధనికుని ఆహారంగా మారిపోయింది. అవిసె గింజల ఉత్పాదన కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉంది. ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల ఇలాంటి ఆహారపదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దారిద్య్రరేఖ దిగువన ఉన్న కుటుంబాలు పండ్లని కొని, తినగలిగిన స్థితిలో లేవు. తక్కువ ధరకు పండ్లు దొరికే పరిస్థితి కల్పిస్తే తప్ప, ప్రజల్లో పోషకాహార లోపాన్ని పూర్తిస్థాయిలో పోగొట్టడం సాధ్యం కాదు. గర్భం దాల్చిన మహిళలకు ఐరన్, ఫోలిక్ యాసిడ్‌లతో కూడిన మాత్రలను ఇప్పించడం వంటి చర్యలతో ప్రభుత్వం ప్రజల్ని పట్టిపీడిస్తున్న పోషకాహార లోపమనే మహమ్మారిని తరిమికొట్టలేదు. రిఫైండ్ వంట నూనెల స్థానంలో నెయ్యి, కొబ్బరి నూనెల వాడకాన్ని పోషకాహార నిపుణులు సూచిస్తు న్నారు. ఇంతవరకు పాలు పోషకాహారంగా పరిగణించినప్పటికీ, పలు ఆరోగ్య సమస్యలకు పాలు కారణమవుతున్న పరిస్థితిని కాదనలేం. మధుమేహం వంటి జబ్బులకు విరుగుడుగా నిపుణులు తృణధాన్యాల వినియోగాన్ని పెంచాలని సూచిస్తున్నారు. 

పరిష్కారం
మరి పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్న భారతీయుల సమస్యలకు పరిష్కారం లేదా? ఉంది! ఆహారాన్ని ముఖ్యంగా 12 వర్గాలుగా విభజించవచ్చు. తృణ ధాన్యాలు- సిరిధాన్యాలు, పప్పుదినుసులు, ఆకుకూరలు, ఇతర కాయగూరలు, దుంపలు, గింజలు- నూనె గింజలు, మసాలా దినుసులు, పండ్లు, చేపలు- తదితర మాంసాహారాలు, పాలు-పాల పదార్థాలు, కొవ్వుపదా ర్థాలు-నూనెలు, చక్కెర-బెల్లం. మనం రోజు తీసుకునే ఆహారంలో ఈ పన్నెండింటిలో కనీసం తొమ్మిదైనా ఉండేలా జాగ్రత్త పడితే, మనం సమతుల ఆహారాన్ని తీసుకున్నట్టే!    - కల్కి

Tags
English Title
Posakatakam
Related News