రాజకీయ రగడతో దడదడ

Updated By ManamThu, 07/19/2018 - 01:35
image
  • 146 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

  • 11వేల దిగువకు నిఫ్టీ

imageముంబై: ప్రభుత్వంపై బుధవారం లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత, బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) సున్నిత సూచి ఆల్-టైమ్ అధిక స్థాయి నుంచి వెనక్కి తగ్గింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) సూచి ‘నిఫ్టీ’ 11,000 స్థాయికి దిగువన ముగిసింది. జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్.డి.ఎ) ప్రభుత్వానికి దిగువ సభలో కలవరపడాల్సిన అవసరం లేని మెజారిటీ ఉన్నప్పటికీ, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన ఈ తీర్మానం వచ్చే ఏడాది జరుగనున్న సాధారణ ఎన్నికలకు ముందు పెరుగుతున్న రాజకీయ ఉష్ణోగ్రతలను వెల్లడిస్తోందని విశ్లేషకులు చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై సభలో శుక్రవారం చర్చ జరుగనుంది. 

సెషన్ ప్రారంభంలో నూతన ఇంట్రా-డే రికార్డు స్థాయి 36,747.87ను తాకిన బి.ఎస్.ఇ 30 షేర్ల ‘సెన్సెక్స్’, లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వార్త వెలువడిన వెంటనే మధ్యాహ్న ట్రేడ్‌లో పతనైమెంది. చివరలో అది 146.52 పాయింట్ల నష్టంతో 36,373.44 వద్ద ముగిసింది. ‘నిఫ్టీ’ 27.60 పాయింట్లు తగ్గి, 10,980.45 వద్ద ముగిసింది. 
రాజకీయ పరిణామాలు, మార్కెట్ రికార్డు స్థాయిల్లో ఉన్నప్పుడు పార్టిసిపెంట్లు లాభాల స్వీకరణకు దిగడంతోపాటు, రూపాయిలో తాజా బలహీనత, విదేశీ ఫండ్ల అమ్మకాలు నిర్విరామంగా సాగుతూండడం ట్రేడింగ్ సెంటిమెంట్ దెబ్బతినడానికి కారణమయ్యాయని బ్రోకర్లు చెప్పారు. ఆటు పోట్లతో సాగిన సెషన్‌లో ‘సెన్సెక్స్’ సుమారు 427 పాయింట్లు అటుఇటు ఊగింది. మెటల్, రియల్టీ, టెలికాం, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మంగళవారం రూ. 673.99 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 840.06 కోట్ల విలువ చేసే ఈక్విటీలను కొనుగోలు చేసినట్లు స్టాక్ ఎక్చ్సేంజిలు విడుదల చేసిన డాటా వెల్లడించింది. 

కాగా, ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జీరోమ్ పోవెల్ ఆశావాద వ్యాఖ్యలతో అవెురికాలో షేర్లు లాభపడ్డాయి. వాటి ననుసరించి ఆసియాలోని ఇతర మార్కెట్లు కూడా మిశ్రమ ఫలితాలతో ముగిసాయి. ద్రవ్య విధానాన్ని మార్చడంలో అవెురికా కేంద్ర బ్యాంక్ మరీ వేగంతో వ్యవహరించబోదని, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సరళంగా వ్యవహరిస్తుందని పోవెల్ సూచించారు. దాంతో అవెురికాలో షేర్లు ఇటీవలి ఎగువ గతిని కొనసాగించాయి.

English Title
Politician
Related News