ఎన్నికల పోలింగ్‌కు పోలీసులు సర్వసన్నద్ధం

Police department, Telangana assembly elections, State police department

హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు చెందిన 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 7వ తేదీన జరుగనున్న ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర పోలీసు విభాగం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 31 జిల్లాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా  కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రధాన కార్యాల యంలోనూ, జిల్లా ప్రధాన కేంద్రాలలోనూ, కమీషనరేట్లలోనూ అన్ని స్థాయిలలోని అధికారులకు శిక్షణా శిబిరాలు నిర్వహించి నమూనా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, హింసాత్మక ఘటనలు వంటి అంశాలపై అవగాహన కల్పించడం, సంక్షోభ నివారణకు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. 
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు శాంతి భద్రతల అదనపు డీజీపీని నోడల్ అధికారిగా నియమించడం జరిగింది. ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు ముందుగా చక్కటి ప్రణాళిక రూపొందించుకోవడానికి, తగినంత సిబ్బందిని సమకూర్చుకోవడానికి,  రాష్ట్ర సరిహద్దుల వద్ద పరిస్థితులను సమీక్షించుటకు వివిధ ప్రభుత్వ విభాగాలతో, కేంద్ర సంస్థలతో, సరిహద్దు రాష్ట్రాలలోని సరిహద్దు జిల్లాల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేశారు. 

తత్ఫలితంగా తీవ్రవాదుల కదలికలు, మత ఘర్షణల ప్రభావం, రాజకీయంగా సున్నితమైన నియోజక వర్గాల వంటి అంశాలను, పోలీస్ విభాగం అవసరాలను ఎప్పటికప్పుడూ సమీక్షించుకుంటూ తగిన ఏర్పాట్లు చేసేవిధంగా పకడ్బందీ వ్యూహరచన చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా జరపడానికి అవసరమయిన సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా మోహరించారు. రాష్ట్రంలో 414 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 404 ఎస్.ఎస్.టిలు, 3,385 సంచార బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. కీలకమైన పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో, అలాగే ప్రజల్లో భద్రత పట్ల భరోసా కల్పించేందుకు పొరుగు రాష్ట్రాలనుంచి సిబ్బందిని, కేంద్ర దళాలను కూడా రంగంలో దింపారు.

ప్రధానికి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఇతర రాష్ట్ర ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులకు ఎస్.పి.జి, కేంద్ర దళాలు, ఎన్.ఎస్.జి దళాల రక్షణలో ఉన్న ప్రముఖులతోపాటూ, ప్రమాదం (ముప్పు) ఎదుర్కొంటున్న అభ్యర్థులకు, బహిరంగ సభల నిర్వహణ, రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణకు కూడా తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వద్ద వామపక్ష తీవ్రవాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఏరివేత కార్యకలాపాలు, కవాతుల నిర్వహణ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు పోలీసు శాఖ పేర్కొంది. 

సంబంధిత వార్తలు