ఎట్లవోదం?

festival rush
  • కిటకిటలాడుతున్న రైల్వేస్టేషన్లు

  • జేబులు ఖాళీచేస్తున్న బస్‌టికెట్లు.. విమానాల్లో వెళ్దామన్నా కష్టమే

  • సొంత కార్లే మేలంటున్న జనం.. పండుగ దగ్గర పడేకొద్దీ ఆరాటం

  • ప్రైవేటు ట్రావెల్స్‌ది ఇష్టారాజ్యం.. తనిఖీల ఊసెత్తని అధికారులు

హైదరాబాద్: పెద్ద పండగ దగ్గర పడింది. ప్రైవేటు ట్రావెల్స్ లాంటి సంస్థలకు ఇది నిజంగానే పెద్ద పండగలా మారింది. ఒక్కో రైల్లో మూడు నాలుగు రైళ్లకు సరిపడ ప్రయాణికులు ఉండటం, వాటిలో ఎక్కడం దాదాపు అసాధ్యంగా కనిపించడానికి తోడు రిజర్వేషన్లన్నీ ఎప్పుడో ముందుగానే పూర్తయిపోవడం, తత్కాల్‌లో చేయించుకుందామన్నా సెకన్లలోనే అవి అయిపోయి, వెయిటింగ్ లిస్ట్ రావడంతో సంక్రాంతికి ఊళ్లు వెళ్లాలనుకునేవారు తల పట్టుకుంటున్నారు. సంక్రాంతి సీజన్ అనగానే అందరికీ పండగే. కొత్త సినిమాలను విడుదల చేయడానికి ఈ సీజన్‌నే ఎంచుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరూ సొంత ఊళ్లు వెళ్లడానికి సిద్ధం అవుతుండటంతో ఒక్కసారిగా ప్రైవేటు బస్సు చార్జీలకు రెక్కలొచ్చాయి. భారీగా ఉన్న డిమాం డును ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు సొమ్ముచేసుకొంటు న్నాయి. సంక్రాంతికి మూడు నెలల ముందే రైలు టికెట్లు బుక్ అయిపోతాయి. తత్కాల్ టికెట్లు కూడా హాట్‌కేకుల్లా పెట్టిన రెండు మూడు నిమిషాల్లోనే ఖాళీ అయిపోతున్నాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను పెట్టినా.. అవి అంతంతమాత్రంగానే ఉండటం, వాటిలోనూ టికెట్ ధర ఒకటిన్నర రెట్లు ఉండటానికి తోడు.. మామూలు రోజుల్లో సిటీ సర్వీసుగా తిరిగే బస్సులనే స్పెషల్ బస్సుల పేరుతో తిప్పేస్తారు. దాంతో కాస్త రేటు ఎక్కువైనా ప్రైవేటు బస్సులవైపు వెళ్దామని చూస్తే గుండెలు గుభేలుమంటున్నాయి. రూ. 500 ఉండే టికెట్‌ను రూ. 2వేలకు, వెయ్యి రూపాయలుంటే టికెట్‌ను మూడు వేలకు ట్రావెల్స్ సంస్థలు పెంచేశాయి. బెంగళూరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు వెళ్లాలంటే దాదాపు రెండున్నర వేల రూపాయలు పెట్టాల్సి వస్తోంది. పెంచిన ధరలను ఆయా సంస్థల వెబ్‌సైట్లలో బహిరంగంగానే పెడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంజిల్లాలతో పాటు..విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి.. గోదావరి జిల్లాలలకు పెద్దఎత్తున జనం బయలుదేరతారు. సంక్రాంతి సీజన్ వచ్చిందంటే హైదరాబాద్ నగరం సగానికి పైగా ఖాళీ అయిపోతూనే ఉంది. కానీ ఈ డిమాండుకు తగినట్లుగా ప్రభుత్వరంగ రవాణా వ్యవస్థ లేకపోవడంతో తప్పనిసరిగా ప్రైవేటువైపు చూడాల్సి వస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు సాధారణంగా రూ. 300-400 మధ్య ఉండే టికెట్ ఇప్పుడు 1000-1500 మధ్య పలుకుతోంది. ఏసీ బస్సు టిక్కెట్ ధర రూ.700 నుంచి 2000కు చేరింది. ఇంత పెద్ద మొత్తం చెల్లించి టికెట్ కొన్నా బస్సులు సకాలంలో గమ్యం చేరతాయన్న గ్యారెంటీ లేకపోవడం ప్రయా ణికులను కలవరపరుస్తోంది. ప్రైవేటు బస్సు యాజ మాన్యాలు పాత బస్సులను రోడ్డు మీదకు తేవడం.. అవి మధ్యలోనే ఆగిపోవడం ప్రతి సీజన్‌లోనూ కనిపించే తతంగమే. గతంలో ఇలాంటి సీజన్‌లలో తనిఖీలు చేసే రవాణా శాఖధికారులు ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలేమీ చేయడం లేదు. అధికార పార్టీకి చెందిన నేతలకే పలు ట్రావెల్స్ సంస్థలు ఉండటం వల్లే అధికారులు ప్రైవేటుబస్సుల జోలికి వెళ్లే సాహసం చేయడం లేదన్న  ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విమానాల టికెట్లు చుక్కల్లోనే..
సాధారణంగా వారం, పది రోజుల ముందు బుక్ చేసుకుంటే విమాన టికెట్ల ధరలు కాస్తలో కాస్త అందుబాటులోనే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మాత్రం సీజన్‌ను సొమ్ము చేసుకోవడంలో విమానయాన సంస్థలు అందరికంటే ముందున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి విమాన టికెట్ రూ. 15వేల నుంచి 25 వేల మధ్య పలుకుతోంది. జనవరి12 నుంచి 14వ తేదీ వరకు కనీసం రూ. 14,700కు తక్కువ టికెట్లే లేవు. 

బ్లాబ్లా కార్లకు డిమాండ్
కొద్దిలో కొద్ది బ్లాబ్లా కార్ లాంటి కార్ పూలింగ్ సైట్లు చాలావరకు నయంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు పండుగ సీజన్‌లో కూడా ఒక సీటుకు 700-950 వరకు చార్జీ ఉంటోంది. కారు మోడల్, అందులో ఉండే సౌకర్యాలను బట్టి సాధారణంగా కొంత రేటు పెంచుతారు తప్ప.. మరీ ఎక్కువగా అయితే ఉండదు. దానికితోడు సాధారణంగా అన్ని కార్లలోనూ ఏసీ తప్పనిసరిగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు అయితే రూ. వెయ్యి నుంచి 1500 వరకు ఉంటోంది. సాధారణంగా సొంత కార్లు తీసుకుని ఊళ్లకు బయల్దేరేవాళ్లు తాము ఒక్కరం వెళ్లడం ఎందుకని ఇలా కార్‌పూలింగ్ ఆఫర్ చేస్తారు. బస్సు టికెట్లతో పోలిస్తే దీని ధర  తక్కువగా ఉండటం, సులభంగా వెళ్లే అవకాశం ఉండటంతో ఎక్కువమంది వీటివైపు మొగ్గు చూపిస్తున్నారు.    

సంబంధిత వార్తలు