తెరపినిస్తున్న వానలు

Updated By ManamTue, 08/21/2018 - 00:24
kerala
  • కేరళలో 5,645 పునరావాస శిబిరాల ఏర్పాటు

  • రాష్ట్రంలో 69 శాతం అధిక వర్షపాతం

keralaతిరువనంతపురం: కోచిలోని నేవల్ ఎయిర్‌పోర్టు నుంచి వాణిజ్యపరమైన విమాన రాకపోకలు సోమవారం ప్రారంభమయ్యాయి. బెంగళూరు నుంచి తొలి ఎయిరిండియా విమానం ఉదయం అక్కడకు వచ్చింది. కోచి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈనెల 26 వరకు మూసి ఉంచడంతో ఇప్పటికే చిన్న విమానాలను నేవల్ ఎయిర్‌పోర్టు నుంచి నడిపిస్తున్నారు. తాజాగా ఉదయం బెంగళూరు నుంచిఎయిరిండియా విమానం వచ్చి, మళ్లీ 8.30 గంటలకు వెళ్లింది. రాజధాని తిరువనంతపురం, ఎర్నాకులం ప్రాంతాల నుంచి రైళ్ల రాకపోకలను మళ్లీ నెమ్మదిగా ప్రారంభిస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలు తమ బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లేందుకు ఎర్నాకులం-తిరువనంతపురం, అళప్పుళ-కొట్టాయం మార్గాలలో పయనిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఈనెల 8వ తేదీనుంచి ఇప్పటికి 210 మంది ప్రాణాలు కోల్పోయారు. 7.14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అళప్పుళ జిల్లాలోని చెంగన్నూరు బాగా తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ ఇంకా కొన్ని ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారిని కాపాడేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం తాజాగా వాయవ్య బంగాళాఖాతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడింది. అయితే, దాని ప్రభావం కేరళ మీద అంతగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. రాబోయే ఐదు రోజుల్లో క్రమంగా అక్కడ వర్షాలు తగ్గుతాయని అంటున్నారు. వరదల్లో చిక్కుకుపోయినవారిలో చాలామందిని కాపాడామని, వారికి పునరావాసం కల్పించడం ఇపుడు తమ ముందున్న అతిపెద్ద లక్ష్యమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. నైరుతి రుతుపవన కాలంలో (జూన్ 1 నుంచి ఆగస్టు 19) కేరళలో వర్షపాతం అసాధారణంగా పెరిగింది. అక్కడ సాధారణ వర్షపాతం ఈ కాలంలో 1619.5 మిల్లీమీటర్లు కాగా, ఈసారి మాత్రం ఏకంగా 2346.6 మిల్లీమీటర్ల వర్షం పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇడుక్కి జిల్లాలో అత్యధికంగా సాధారణం కంటే 92 శాతం ఎక్కువగా వర్షాలు పడ్డాయి. పాలక్కాడ్‌లో 72 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ రెండు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, భారీ వరదల కారణంగా ఎక్కువ మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,645 పునరావాస శిబిరాలలో 7,24,649 మంది తలదాచుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజే 22వేల మందిని వరద చుట్టుముట్టిన ప్రాంతాల నుంచి కాపాడారు. 

పొంచి ఉన్న వ్యాధుల భయం
వరద క్రమంగా తగ్గుతుండటంతో ఇప్పుడు కేరళలో వ్యాధుల భయం పొంచి ఉంది. నీరు తగ్గిన తర్వాత అంటువ్యాధులు వ్యాపించకుండా చూసేందుకు ఒక్కో పంచాయతీలో ఆరుగురు ఆరోగ్య అధికారులను మోహరిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. వరదనీరు తగ్గిన ప్రాంతాలలో ప్రజలు నెమ్మదిగా తమ ఇళ్లకు తిరిగి చేరుకుంటున్నారు. ఇళ్ల నిండా మట్టి, బురద పేరుకుపోయి ఉండటంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు.

కొనసాగుతున్న రాష్ట్ర సాయం
కేరళ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల సాయం కొనసాగుతోంది. రంది పడొద్దు మేమున్నామంటూ కేసీఆర్ సోమవారం మరోసారి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి భరోసానిచ్చారు. ఆకలితో అలమటిస్తున్న వరద బాధితులను ఆదుకునేందుకు 500 మెట్రిక్ టన్నుల బియ్యం కేరళకు పంపాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం తరపున కేరళ ప్రభుత్వానికి రూ.25 కోట్లు అందించిన విషయం తెలిసిందే. ఇటు ప్రజలు సైతం భారీగా విరాళాలిస్తున్నారు.

English Title
Openings Rains
Related News