సీఎం ఓకే.. మార్పు లేదు!

Updated By ManamMon, 09/17/2018 - 23:51
Manohar Parrikar
  • గోవాపై బీజేపీ నాయకత్వం స్పష్టీకరణ

  • రాష్ట్రానికి త్రిసభ్య కమిటీ.. నేతలతో ముమ్మర చర్చలు

  • మార్పు అవసరం లేనేలేదు.. గోవా బీజేపీ చీఫ్ వినయ్

  • ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం.. రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ లేఖ

Manohar Parrikarపణజి: గోవా నాయకత్వంలో ఎలాంటి మార్పు లేదని, ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. సీనియర్ నాయకులు బీఎల్ సంతోష్, రాంలాల్, వినయ్ పురాణిక్‌లతో కూడిన త్రిసభ్య కమిటీని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా గోవాకు పంపి, అక్కడ రాజకీయ పరిస్థితిని అంచనా వేసి రావాలని తెలిపారు. మరోవైపు గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్ పార్టీ అంటోంది. తమకు 14 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, అందువల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని రాజ్‌భవన్‌కు ఓ లేఖ పంపింది. అయితే, ఇంకా కాంగ్రెస్ నేతలకు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఏమీ ఇవ్వలేదని సమాచారం.  గోవా చేరుకున్న బీజేపీ త్రిసభ్య కమిటీ కొంతమంది సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించింది. చర్చల సారాంశాన్ని మళ్లీ చెబుతామని, ఇక్కడ ప్రభుత్వం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని.. అలాగే నాయకత్వ మార్పునకు ఎవరి నుంచి డిమాండు లేదని రాంలాల్ తెలిపారు. త్రిసభ్య కమిటీ సభ్యులు బీజేపీ సంకీర్ణ భాగస్వాములతో కూడా చర్చించారు. పర్రీకర్ ఆరోగ్యం బాగున్నందున రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఏమాత్రం అవసరం లేదని పార్టీ గోవా శాఖ అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ చెప్పారు. కేంద్ర పరిశీలకులతో తాము సంస్థాగత అంశాలపై చర్చించాము తప్ప నాయకత్వ మార్పు గురించి కాదని అన్నారు. పాంక్రియాస్‌కు సంబంధించిన సమస్యల కారణంగా గతంలో అవెురికాలో చికిత్స పొందిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్ ఇటీవల మళ్లీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో తొలుత గోవాలోను, ఆ తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్‌లోను చికిత్సకు చేరారు. గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ) సభ్యులతో పాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో గోవాలో బీజేపీ ప్రభుత్వం నడుస్తోంది. పర్రీకర్ లేని పరిస్థితికి శాశ్వత పరిష్కారం కావాలని జీఎఫ్‌పీ చెబుతున్న విషయాన్ని ప్రస్తావించగా, నాయకత్వ మార్పు అసలు అవసరం లేదని వినయ్ టెండూల్కర్ స్పష్టం చేశారు. గోవా బీజేపీ కోర్ కమిటీ మంగళవారం సమావేశమవుతుందని చెప్పారు. జీఎఫ్‌పీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్ర సభ్యులు కూడా నగరంలోని ఓ హోటల్లో బీజేపీ పరిశీలకులను కలిశారు. ప్రస్తుత పరిస్థితి గురించి తమ పరిశీలనను వారికి తెలిపామని జీఎఫ్‌పీ అధ్యక్షుడు, వ్యవసాయ శాఖ మంతిర విజయ్ సర్దేశాయ్ తెలిపారు. పరిశీలకులు తమ నివేదిక సమర్పించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు వ్యూహాలు ఉంటాయని బీజేపీ నాయకుడు, డిప్యూటీ స్పీకర్ వైుఖేల్ లోబో తెలిపారు. ప్రస్తుతానికి పార్టీలో ఎలాంటి సమస్య లేదని, ముఖ్యమంత్రి అనారోగ్యం మాత్రమే సమస్య అని అన్నారు. ఎంజీపీ సభ్యులు ముగ్గురు కూడా బీజేపీ పరిశీలకులను కలిశారు గానీ, వారు మాత్రం మీడియాతో ఏమీ మాట్లాడలేదు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో బీజేపీకి 14 మంది ఎమ్మెల్యేలున్నారు. జీఎఫ్‌పీ, ఎంజీపీలకు తలో ముగ్గురు ఉండగా వీరితో పాటు ముగ్గురు స్వతంత్రులు కూడా మద్దతివ్వడంతో 23 మంది బలంతో ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్‌కు 16 మంది, ఎన్‌సీపీకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేలున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకాశాలు పరిశీలిస్తామని, కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ పడబోమని ఏఐసీసీ కార్యదర్శి, గోవా వ్యవహారాల ఇన్‌చార్జి ఎ. చెల్లకుమార్ తెలిపారు. అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న తొందర ఏమీ తమకు లేదని.. ప్రజల పట్ల బాధ్యత ఉందని చెప్పారు. పాలక కూటమిలో ఇప్పటికే గందరగోళం మొదలైందని, మంత్రులు ఒకరిపై ఒకరు రాళ్లేసుకుంటున్నారని ఆయన అన్నారు.

English Title
Ok okay .. no change!
Related News