‘అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌’ రివ్యూ

Updated By ManamThu, 10/11/2018 - 14:32
Aravinda Sametha Veera Raghava
Aravindasametha Veeraraghava

స‌మ‌ర్ప‌ణ‌:  శ్రీమ‌తి మ‌మ‌త‌
సంస్థ‌:  హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌
ఆర్టిస్టులు:  ఎన్టీఆర్‌, పూజా హెగ్డే, జ‌గ‌ప‌తిబాబు, ఈషా రెబ్బా, నాగ‌బాబు, సునీల్‌, రావు ర‌మేశ్‌, సుప్రియా పాథ‌క్‌, న‌వీన్ చంద్ర‌, సితార‌, బ్ర‌హ్మాజీ, ఈశ్వ‌రీరావు, ర‌విప్ర‌కాశ్ త‌దిత‌రులు
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ:  పి.ఎస్‌.వినోద్‌
స్టంట్స్:  రామ్ ల‌క్ష్మ‌ణ్‌
ఎడిటింగ్‌:  న‌వీన్ నూలి
ఆర్ట్ డైర‌క్ష‌న్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌
ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) 
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  త్రివిక్ర‌మ్ 

రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో సినిమా అంటేనే అది ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్ లోకి చేరుతుంది. అయితే యుద్ధానంత‌రం ప్ర‌శాంతం ఎలా ఉంటుంది?  ఫ్యాక్ష‌న్ ఉన్నా.. దాని వ‌ల్ల ఎక్కువ‌గా న‌ష్టానికి గుర‌యిన ఆడ‌బిడ్డ‌ల ప‌రిస్థితి ఎలా ఉంటుంది?  మ‌న‌సుతో ఆలోచించి త్రివిక్ర‌మ్ రాసుకున్న క‌థ ఇది. `నేను చేస్తాను స్వామీ` అంటూ త్రివిక్ర‌మ్ ఆలోచ‌న‌ల‌కు య‌న్‌.టి.ఆర్ విలువిచ్చి చేసిన సినిమా ఇది. 12 ఏళ్ల సుదీర్ఘ‌మైన ప్ర‌యాణం త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి చేసిన చిత్ర‌మిది. సీమ భాష సొగ‌సు, వీరిద్ద‌రి `మాట‌ల‌` సొగ‌సు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిపడేస్తాయా?  ఇన్నాళ్లు ఊరించిన కాంబినేష‌న్ క‌డుపు నింపుతుందా?  పెద‌వి విరిచేలా చేయిస్తుందా.. ఆల‌స్య‌మెందుకు చ‌దివేద్దాం.
 
క‌థ‌:
రాయ‌ల‌సీమలోని కొమ్మ‌ద్ది ప్రాంతానికి నార‌ప రెడ్డి(నాగ‌బాబు) పెద్ద‌. అలాగే న‌ల్ల‌గొడి ప్రాంతానికి బ‌సిరెడ్డి(జ‌గ‌ప‌తిబాబు) పెద్ద‌. ఓ ఐదు రూపాయ‌ల కోసం కొమ్మ‌ద్ది, న‌ల్ల‌గొడి ప్రాంతాల మ‌ధ్య ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. బ‌సిరెడ్డి ఓ వ్య‌క్తిని చంపేస్తాడు. ఆ కోపంతో నార‌ప‌రెడ్డి బ‌సిరెడ్డి మ‌నుషుల‌ను చంపేస్తాడు. చివ‌ర‌కు ఒక‌రి తండ్రిని మ‌రొక‌రు చంపేసుకుంటారు. నార‌ప‌రెడ్డి కొడుకు వీర రాఘ‌వ రెడ్డి(ఎన్టీఆర్‌)  విదేశాల్లో చ‌దివి ఊరికి వ‌స్తాడు. ఆ స‌మ‌యంలో బ‌సిరెడ్డి, అత‌ని కొడుకు బాల్ రెడ్డి(న‌వీన్ చంద్ర‌) దాడి చేస్తారు. ఆ దాడిలో నార‌ప రెడ్డి చ‌నిపోతాడు. బ‌సిరెడ్డిని రాఘ‌వ పొడిచేస్తాడు. అంద‌రూ బ‌సిరెడ్డి చ‌నిపోయాడ‌నుకుంటారు కానీ.. బ్ర‌తికి పోతాడు. అయితే ఈ గొడ‌వ‌ల కార‌ణంగా అంద‌రూ చనిపోతున్నారు. ఊర్లో ఎవ‌రూ సంతోషంగా ఉండ‌టం లేద‌ని తెలుసుకున్న రాఘ‌వ గొడ‌వలు త‌గ్గాలంటే తాను ఆ ఊర్లో ఉండ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుని ఊరి వ‌దిలేసి హైద‌రాబాద్ వ‌చ్చేస్తాడు. కొన్ని ప‌రిస్థితుల్లో నీలాంబ‌రి(సునీల్‌)అనే మెకానిక్‌ని కలిసి అత‌నికి స‌హాయం చేస్తాడు. అత‌నితో షెడ్డులోనే ఉంటాడు. ఓ సంద‌ర్భంలో క్రిమిన‌ల్ లాయ‌ర్ కూతురు అర‌వింద‌(పూజా హెగ్డే) ప‌రిచ‌యమ‌వుతుంది. ఆమె చెప్పిన మాట‌లు రాఘ‌వ‌పై ఎంతో ప్ర‌భావం చూప‌డంతో వారి ఇంట్లోనే ఉంటూ వారికి కావాల్సిన విధంగా స‌హాయ పడుతుంటాడు రాఘ‌వ‌. అయితే ఓ చిన్న త‌ప్పు కార‌ణంగా రాఘవ హైద‌రాబాద్‌లో ఉన్నార‌నే నిజం బ‌సిరెడ్డికి తెలిసిపోతుంది. దాంతో వాళ్లు రాఘ‌వ‌ను దెబ్బ తీయడానికి అర‌వింద‌, ఆమె త‌మ్ముడిని కిడ్నాప్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే రాఘవ కాపాడుతాడు. చివ‌ర‌కు ఈ గొడ‌వ‌ల‌కు ఫుల్‌స్టాప్ ప‌ట్ట‌డానికి రాజ‌కీయ నాయ‌కులు(రావు ర‌మేశ్‌, శుభ‌లేక సుధాక‌ర్) స‌హాయం తీసుకుంటాడు. శాంతి చ‌ర్చ‌లు జ‌రుపుతాడు. ఇంత‌కు ఆ శాంతి చ‌ర్చ‌లు ఏమ‌వుతాయి?  బ‌సిరెడ్డి శాంతి సంధికి ఒప్పుకుంటాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Aravindasametha Veeraraghava

ప్ల‌స్ పాయింట్లు
- ఎన్టీఆర్ న‌ట‌న‌, బాడీ లాంగ్వేజ్ బావుంది
- త్రివిక్ర‌మ్ డైలాగులు
- రాయ‌ల‌సీమ ప‌ద్ధ‌తులు, యాస‌
- నేప‌థ్య సంగీతం
- కెమెరా

మైన‌స్ పాయింట్లు
- ఎడిటింగ్‌
- అక్క‌డ‌క్కడా విసుగు పుట్టించే స‌న్నివేశాలు
- కామెడీ లేక‌పోవ‌డం
- సునీల్ , హీరోయిన్ పాత్ర‌ల‌కు పెద్ద ప్రాముఖ్య‌త లేక‌పోవ‌డం
- కొన్ని పాట‌లను ఫిక్స్ చేసిన సంద‌ర్భం, పిక్చ‌రైజేష‌న్ఎఫెక్టివ్‌గా అనిపించ‌వు

విశ్లేష‌ణ‌:
 ఫ్యాక్ష‌న్ సినిమాలంటే నరుక్కోవ‌డం.. ప్ర‌గ‌, ప్ర‌తీకారాల‌తోనే సాగుతుంటుంది. చివ‌ర‌ల్లో ఏదో చిన్న‌మెసేజ్ ఇచ్చి వ‌దిలేస్తారు. కానీ అలా కాకుండా ఫ్యాక్ష‌న్ ప్రాంతంలో త‌న తండ్రిని చంపిన ప‌గ‌వాడిని కూడా చంప‌కుండా శాంతి కోసం పాకులాడే ఓ యువ‌కుడి క‌థే ఇది. త‌న‌దైన రోజు ఎవ‌డైనా కొడ‌తాడు. కానీ గొడ‌వ రాకుండా ఆపుతాడే వాడే గొప్పోడు .. అనే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు రాసుకున్న క‌థ ఇది. ఇది ఎమోష‌న‌ల్ కంటెంట్‌ను ఎక్కువ‌గా యాడ్ చేశాడు. త‌న‌దైన స్ట‌యిల్లో డైలాగ్స్‌తో మెప్పించాడు. మ‌రి ఎన్టీఆర్ లాంటి హీరో క‌దా! కేవ‌లం ఎమోష‌న‌ల పాయింట్ ఏం వ‌ర్కవుట్ అవుతుంద‌నుకోకుండా యాక్ష‌న్ సీక్వెల్స్‌లో ఎన్టీఆర్ అద‌ర‌గొట్టాడు. ముఖ్యంగా ప్ర‌థ‌మార్థంలో ఇర‌వై నిమిషాలు వ‌చ్చే ఫైట్ సీన్‌లో సిక్స్ ప్యాక్ కూడా చూపించాడు. ఇక రెడ్డి ఇక్క‌డ సూడు.. పాట‌లో డాన్సులు ఇర‌గ‌దీశాడు. ఇక హీరోయిన్‌ని, ఆమె త‌మ్ముడిని విల‌న్స్ కిడ్నాప్ చేసిన‌ప్పుడు హీరో వాళ్ల‌ని బెదిరించే తీరు.. రావు ర‌మేశ్‌తో, న‌వీన్ చంద్ర‌తో ఎన్టీఆర్ సంధి జ‌రిగే క్ర‌మంలో వ‌చ్చే డైలాగ్స్ అన్ని ట‌చింగ్‌గా అనిపిస్తాయి. జ‌గ‌ప‌తిబాబు విల‌నిజం లెజెండ్ త‌ర్వాత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంది. ఫ్యాక్ష‌నింజ‌లో మ‌రో యాంగిల్‌ను ట‌చ్‌చేసే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌. పి.ఎస్‌.వినోద్ కెమెరా వ‌ర్క్ బావుంది. పాట‌లు బాగానే ఉన్నా..పిక్చ‌రైజేష‌న్ ఎఫెక్టివ్‌గా లేదు. ఎమోష‌న్స్ భారీగా ఉండ‌టం యూత్ ప్రేక్ష‌కుల‌కు కాస్త ఇబ్బందే. ఇక పూజా హెగ్డే పాత్ర‌కు పెద్ద‌గా ప్రాముఖ్య‌త లేదు. సునీల్ కామెడీకి పెద్ద‌గా స్కోప్ లేని పాత్ర‌. ఇక ఈషా రెబ్బా పాత్ర కూడా మ‌రి చిన్న లెంగ్తీలో ఉంది. శుభ‌లేఖ సుధాక‌ర్‌, రావు ర‌మేశ్‌, సితార, ఈశ్వ‌రీ రావు, దేవ‌యాని త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల్లో మెప్పించారు. 
బోట‌మ్ లైన్‌: ఎమోష‌న‌ల్ వీర రాఘ‌వుడు 
రేటింగ్‌: 3/5

English Title
NTR's Aravinda Sametha review
Related News