వాట్సాప్ వాడినా.. ఫేస్‌బుక్ చూసినా.. పన్ను పడుద్ది

Updated By ManamSun, 06/03/2018 - 11:57
Now Tax To Impose On Whatsapp and Facebook Users on Daily basis
  • వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వాడేవారిపై రోజూవారీ పన్ను వ్యవస్థ

Now Tax To Impose On Whatsapp and Facebook Users on Daily basisప్రభుత్వాలు ఆదాయం పెంచుకోవడం కోసం ప్రతి వస్తువుపైనా పన్ను వేయడం సహజం. ఆదాయపన్ను, ఆస్తి పన్ను, వస్తుసేవా పన్ను, ఎక్సైజ్ సుంకం, దిగుమతి సుంకం.. ఇలా ఎన్నెన్నో పన్నులు విధిస్తుంటాయి ప్రభుత్వాలు. కానీ, ఇకపై వాట్సాప్ వాడాలన్నా, ఫేస్‌బుక్ చూడాలన్నా పన్ను పడుద్ది. నిజం.. వాటిని వాడే వారిపైనా పన్ను వేయాలని నిశ్చయించింది ప్రభుత్వం. అయ్యో ఇదెక్కడిది.. మోదీ మళ్లీ ఈ కొత్త పన్ను తీసుకొచ్చారా అని నిట్టూర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పన్ను వేస్తున్నది భారత్‌లో కాదు. బయటి దేశం ఉగాండాలో. 200 షిల్లింగ్‌లు (మన కరెన్సీలో సుమారు రూ.132) పన్నును విధించాలని నిర్ణయించింది ఆ దేశ ప్రభుత్వం. అదేదో నెలకో.. సంవత్సరానికో అనుకునేరు. రోజూ చెల్లించాల్సిన పన్ను మొత్తం అది.

అవును.. అయితే సొమ్ము చేసుకుందామనో, ఖజానా నింపుకుందామనో ఆ దేశం వాటిపై పన్ను వేయట్లేదు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పుకార్లు, గాసిప్‌లు హల్‌చల్ చేస్తుండడంతో వాటిని నిరోధించేందుకే ఇలా వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వైబర్ వంటి సోషల్ సైట్లను వినియోగించే వారిపై పన్ను విధించాలని పేర్కొంటూ ఆ దేశ అధ్యక్షుడు యొవెరి ముసెవెని పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు ఆమోదం కూడా లభించడం విశేషం. జూలై 1 నుంచే అమల్లోకి రాబోతున్న ఈ బిల్లును ఎలా అమలు చేస్తారన్న దానిపై ఇంకా అనుమానాలు మెదలుతూనే ఉన్నాయి.

ప్రధాన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, నిపుణులు రోజూవారీ పన్నును ఎలా అమలు చేస్తారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో 2.36 కోట్ల మంది ఫోన్లను వినియోగిస్తుండగా, కేవలం 1.7 కోట్ల మందే ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందుతున్నారు. అయితే, దేశ ప్రజలు సోషల్ మీడియా సైట్లను వాడుతున్నది లేనిది ఎలా తెలుసుకుంటారన్న అనుమానాలనూ వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. విద్యా, పరిశోధన వంటి వాటి కోసం మాత్రం నెట్‌పై పన్నులు విధించొద్దని నిపుణులు సూచిస్తున్నారు. 

English Title
Now Tax To Impose On Whatsapp and Facebook Users on Daily basis
Related News