సిమ్ తీసుకుంటున్నారా.. ఆధార్ అవసరమే లేదు

Updated By ManamWed, 06/13/2018 - 17:34
No Need to Link Aadhar Details With SIM

No Need to Link Aadhar Details With SIMన్యూఢిల్లీ: కొత్త సిమ్ కార్డ్ తీసుకుంటున్నారా..? అయితే, ఆధార్ అవసరం లేదు. పాత సిమ్‌కు ఆధార్‌ను అప్‌డేట్ చేయాలని అనుకుంటున్నారా..? చేయాల్సిన అవసరమే లేదు. ఆధార్‌ను వాటికి వినియోగించాల్సిన పనిలేదు. అవును.. ఆధార్ అవసరం లేకుండానే కొత్త సిమ్ కార్డులను ఇక తీసుకోవచ్చు. ఆధార్ వివరాలను టెలికాం ఆపరేటర్లకు ఇవ్వడం ఇష్టం లేని వాళ్లు వాటి స్థానంలో వర్చువల్ ఐడీని ఇస్తే సరిపోతుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించి టెలికాం విభాగం (డీవోటీ) మంగళవారం ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ‘‘టెలికాం శాఖలో లైసెన్సు పొందిన ఆపరేటర్లందరూ యూఐడీఏఐ ప్రతిపాదించిన మార్పులను తప్పనిసరిగా అనుసరించాలి. ఆధార్ నంబరే కాకుండా వాటి స్థానంలో వర్చువల్ ఐడీని స్వీకరించాలి.

కొత్త సిమ్ కార్డులను జారీ చేసే సందర్భాల్లో ఆధార్ కోసం పట్టుబట్టకుండా ఆధార్ ఆధారిత ఈ కేవైసీని ఆమోదించాలి. వర్చువల్ ఐడీని తీసుకోవాలి’’ అని టెలికాం శాఖ తన ప్రకటనలో వెల్లడించింది. తమ వినియోగదారులందరికీ సంస్థలు ఆధార్ నంబరుతో పాటు వర్చువల్ ఐడీని ఎంచుకునే వెసులుబాటును కల్పించాలి. ఇక, ప్రస్తుత వినియోగదారుల నుంచి సేకరించిన ఆధార్ వివరాల స్థానంలో యూఐడీఏఐ అందించే యూఐడీ టోకెన్లను పెట్టాలని టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా పరిమిత కేవైసీని కూడా ప్రవేశపెట్టాలని, వినియోగదారుడు ఎంత మేరకు సమాచారం ఇవ్వదలచుకున్నాడో ఆ సమాచారాన్నే తీసుకునేలా దానిని అమలు చేయాలని ఆదేశించింది. వర్చువల్ ఐడీ అంటే.. ఆధార్ ద్వారా ఓ 16 అంకెల సంఖ్యను సృష్టించి తాత్కాలికంగా ఆధార్ వివరాలను అందులో పెడతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వర్చువల్ ఐడీని వెనక్కు తీసుకోవచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు జనరేట్ చేసుకోవచ్చు. 

English Title
No Need to Link Aadhar Details With SIM
Related News