పశ్చాత్తాపం లేదు

Updated By ManamSat, 06/23/2018 - 20:44
No compunctution, sunday story of the week

(ఈవారం కథ)
ఎర్రగా కాలిన కట్టెతో వారం రోజుల క్రితం కొడుకు పెట్టిన వాతలతో శీలవతి మోచేయంతా బొబ్బలెక్కిపోయి ఉంది. ఆ రోజు ‘‘అయ్యో!’’ అంటూ తనకు తెలిసిన నాటువైద్యం చేయబోయింది కోమలి. ‘‘ఇప్పుడు మందేసి తగ్గిస్తారు సరే. నాలుగు రోజులయినా గడవక ముందే మళ్లీ వాతలూ, మచ్చలూ! ఇవన్నీ మనకు కొత్తకాదు కదా అత్తయ్యా.. వాటిని అలానే ఉండనివ్వండి! కాకపోతే అవి కొంత సలుపు పెడ్తాయి. అంతేగా!’’ ‘కోడలు కష్టాలు తీరేదెప్పుడో.. పుట్టింట్లో ఎలా ఉండేదో.. ఇక్కడకొచ్చి ఇలా అయిపోయింది. ఈ రౌడీగాడిని నిలువరించడం ఈ ప్రపంచంలో ఎవరి తరమూ కాదేమో!’.. మనసులో బాధపడి కొడుకుని ఆడిపోసుకోవడం తప్ప ఏమీ చేయలేని చేతకాని  బ్రతుకు కోమలిది.

No compunctution, sunday story of the weekలేవబుద్ది కావడం లేదు. గోడకు తగిలించి ఉన్న గడియారం ప్రతి అరగంటకూ గంటలు కొడుతూ కాలాన్ని గుర్తుచేసి తన పనిని తాను చేసుకుపోతోంది. ఉదయం ఐదు గంటల నుండి లేవడానికి ప్రయత్నిస్తోంది. కానీ వల్ల కావడం లేదు. అలసట ఆవహించేసరికి ప్రక్కనున్న రగ్గును పూర్తిగా కప్పుకోబోయింది. వంటిమీద అయిన గాయాలు భగ్గుమంటున్నాయి. కంటిలో నీరు చిప్పిల్లిన ఆమె నిర్వేదనగా అలానే మంచానికి కరుచుకుపోయింది. చెప్పాలంటే శీలవతికి ఇప్పుడు ఒక భీకర సంగ్రామం ముగిసిన తర్వాత ఏర్పడిన భరింపజాలని నిశ్శబ్దాన్ని పోలివుంది. అవును. రాత్రంతా ఇంట్లో ఆ వాతావరణమే మరి. భయపడింది. వెన్నులోని వణుకు అలా కొనసాగుతూనే ఉంది. శీలవతికి అసహ్యంగా ఉంది తనమీద.. ఇక్కడి మనుషుల మీద అదేవిధమైన ఏవగింపుతో ఉంది. గుండ్రాజు గుర్తుకువచ్చాడు. ఒక్కసారిగా శరీరం కంపించసాగింది. తూలి క్రింద పడబోయింది. ‘‘ఏమయిందమ్మాయ్!’’ అత్తగారి పిలుపుతో తమాయించుకోక తప్పింది కాదు. కాసేపు మాట్లాడలేదు. అసలు ఈ లోకంలో కోడళ్లను రాచిరంపాన పెట్టే అత్తగార్లను చూసింది. నిలువనీయక గృహహింసలు పెట్టే అత్తామావల్ని చూసింది. కానీ కోమలి దానికి తద్భిన్నం! అత్తగారి మీద జాలి కల్గింది. అంతలోనే నవ్వు వచ్చింది శీలవతికి. ఇక్కడ తానేమాత్రం సుఖపడుతోంది కనుక, మరొకరి మీద సానుభూతి చూపడానికి.

No compunctution, sunday story of the week‘‘ఏం చెప్పేది!’’ శీలవతి మాటల్లోని ఆవేదనను ఆమె ఆకళింపు చేసుకుంటూనే ఉంది. ‘గుండ్రాజు!’.. తల్చుకొనేసరికి గుండెలోని భయం కళ్లలోకి వచ్చి చేరిపోయింది. మంచంమీద అటుగా కదలబోయింది. నిన్న మొగుడు చేత తిన్న దెబ్బల ఒంటి నొప్పులు ఇంకా తనను వేధిస్తూనే ఉన్నాయి. శీలవతి ఉడుకుమోత్తనంగా ఉంది. ‘‘వాడు మైలకూరు పోయినాడు. రావడానికి మూడు రోజులు పట్టొచ్చు.’’ అత్తగారి మాటల్లోని ఆనందం శీలవతి గ్రహింపకపోలేదు. మైలకూరంటాడు.. మైలవరమంటాడు.. పనులమీద పోతున్నానంటాడు.. పోతున్నానన్నోడు పోక గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చేసి ఇంట్లో నానా యాగీ చేస్తాడు. వ్యాపారంలో నష్టమంటాడు. పెట్టుబడి డబ్బులు సైతం పోయినాయంటాడు. అయినవాళ్లు తనను దగా చేశారంటాడు.. అయినవి, కానివి.. అసత్యాలను, అభూత కల్పనలను కలగలిపేసి అన్ని నెపాలను పెళ్లాంమీద రుద్దేస్తాడు. శీలవతిని పెళ్లాడిన తర్వాతే తనకీ కష్టాలు ప్రారంభమయ్యాయంటాడు. ఆ ఆలోచన వచ్చిందే తడవు.. గుండ్రాజు చేతిలో శీలవతి ఓ కీలుబొమ్మయి పోతుంది. భయంతో బిక్కచచ్చిపోతుంది. భార్యమీద చేయి చేసుకుంటాడు. చేతికందిన వాటిని మీదకు విసిరి పారేస్తాడు. అప్పుడు చేతికి, నోటికి అడ్డూ ఆపూలేని పరిస్థితిలో అమ్మయినా, ఆలి అయినా సరే.. అతగాడికి లెఖ్కలేకుండా పోతుంది.

‘‘చిన్నపిల్ల.. దాన్ని ఆడిపోసుకోమాక! ఏదో మంచి ఉద్యోగం చూసుకొని నీ కాళ్లమీద నువ్వు నిలబడాలి కానీ!!’’.. కొడుకును సముదాయించబోతుంది. అంతే.. అర్థంలేని పౌరుషాన్ని తెచ్చుకొని ఒక్క దుడుకున లంఘించిన పెద్దపులి అయిపోతాడు. గాండ్రిస్తాడు. అరుస్తాడు. దాడి చేస్తాడు. సగం తాగి వదిలేసిన విస్కీ గ్లాసును ముఖానకేసి కొడతాడు. రాత్రికి తాగుదామని బార్ షాపులో అరువుపెట్టి తెచ్చుకున్న హాఫ్ బాటిల్‌ను విసిరేస్తాడు. కన్నకొడుకు కంటి ముందు రాక్షసుడిలా ప్రవర్తిస్తుంటే చేతలుడికిన కోమలి అచేతనంగా మిగిలిపోతుంది. కనీసంగానయినా నోరు విప్పి కొడుకును వారిద్దామనుకుంటుంది. తగ్గడం మాట అటుంచి మూర్ఖత్వంతో తల్లి అని కూడా చూడకుండా చేయి చేసుకుంటాడు. పాపం శీలవతి! కోడల్ని నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా జుట్టు పట్టుకొని వీధి బయటకు లాగి కిందపడేసి కుమ్మి పారేస్తుంటే ఎదుర్కోవడం చేతగాని నికృష్టమైన నైజం తనది. ‘ఇది తప్పురా!’ అని ఎదురునిలిచి కొడుకును వారించలేని అసమర్థత తనది. అంతెందుకు.. ఎదురొడ్డిన తాను వాడిచేత తన్నులు తిన్న సందర్భాలూ లేకపోలేదు. ఇరుగూ పొరుగూ ఎవరయినా ఈ గొడవలకు సర్దుబాటు చెబుతారేమో అనుకుంటుంది. కానీ గుండ్రాజు దౌర్జన్యాలకు భయపడి, లేని సంతలను నెత్తిమీదకు తెచ్చుకొని వాడికి విరోధి కావడం ఇష్టంలేక అందరూ ఆ వీధిలో తలుపులేసుకుంటున్నారు. ‘‘లేచి కాసింత ఎంగిలి పడమ్మాయ్. రాత్రి ఏమీ తినకపోతివి.’’ ‘‘పోనీ.. మీరు తిన్నారా ఏమిటి?..’’ ‘‘తిననిస్తాడా వాడు! ఇదంతా మనం ఏనాడో చేసుకున్న ఖర్మ అనుకుంటాను. ఇంట్లో అనుకూలవతి అయిన భార్య.. జరుగుబాటు చూసుకుని చక్కగా కాపురం చేసుకోక పోకిరీ వేషాలు తప్పితే...’’ అత్తగారి ఓదార్పు కబుర్లు శీలవతికి ఆవేదనను మిగులుస్తున్నాయి. ఏనాడో చేసుకున్న పాపం. అంతే! ‘‘చూస్తుంటే వీడో పెద్ద శాడిస్టులా తయూరవుతున్నాడు. బయట అందరితో గొడవలు.. ఇంట్లో భరించలేని అరాచకాలు.. నేనుపోయి మీ మావగారు బతికివున్నా సరిపోయేది. ఈ బాధలు తప్పేవి నాకు!’’
‘‘ఆయన ఉన్నా ఏం చేస్తారు లెండి.. అందరూ మూకుమ్మడిగా కలిసి నా గొంతు కోశారంతే!’’ శీలవతి మాటలు ఉక్రోషంగా ఉన్నాయి.
‘‘తప్పదు, బతకాలి. కట్టుకున్నవాడి చేత తన్నులు తింటూ రోజుకో రకమైన నరకాన్ని అనుభవిస్తూ పుట్టింటివారి ఆలంబన అసలు లేక ఇక్కడపడి ఇలా చావాల్సిందే.’’
‘‘...................’’
No compunctution, sunday story of the weekఅమ్మయినా, నాన్నయినా అల్లుణ్ణి కాదు పొమ్మనలేదు. ప్రేమగా తనను పెంచారు. కూతురు సౌఖ్యం కోసమని అప్పుచేసి వైభవంగా పెళ్లి చేశారు. ఆమె తలరాతను తాము తిరగ రాయలేరు. మధ్యవర్తుల చేత గుండ్రాజుకి చెప్పించి చూశారు. అతడి ఆగడాలను అరికట్టడానికి అనేక విధాల ప్రయత్నిస్తూనే ఉన్నారు.
‘‘కానీ వీడో పెద్ద వెధవ అమ్మా! శాడిస్టులా తయూరైనవాళ్లకు మనలాంటి మధ్యవర్తుల మాటలు ఎంతవరకు అక్కరకొస్తాయి. అయినా ఒకటి రెండుసార్లు సర్దిచెప్పబోయాను. నా మీదకే విరుచుకు పడిపోయాడు. ఇది పెద్ద మనుషుల ద్వారా తెమిలే వ్యవహారం కాదు. ఏ పోలీస్ స్టేషన్‌కో వెళ్లి తేల్చుకోవాల్సిందే.’’
ఇంటి పరువు?.. శీలవతి గుండె ఘనీభవించినట్లయింది. కడదాకా తన వెంట తోడుగా ఉంటాడని ఆశించిన కట్టుకున్నవాడు.. ఇలా నిర్దాక్షిణ్యంగా మానవ మృగం లాగా మారతాడనుకోలేదు. పెళ్లయి మూడు సంవత్సరాలు గడిచిపోయినా అత్తింటిలో మెుగుడి ఆగడాలు రోజురోజుకీ పెరుగుతున్నాయే కానీ ఏ రోజూ తగ్గడం లేదు. చెప్పాలంటే పైసా సంపాదనలేని ఇంటి మనిషి కారణంగా కూటికి ఠికాణాలేని బతుకయిపోయింది తమది.
కోటి గుర్తుకువచ్చాడు. శీలవతిలో కోటి ఆనందాలు వెల్లివిరిశాయి. ఇప్పుడు ఎక్కడున్నాడో! ఏం చేస్తున్నాడో!.. ఆనాడు అమ్మానాన్నలు తన ఉద్దేశానికి అడ్డు చెప్పకుండా ఉండుంటే ఈ రోజు తన జీవితం మరోలా ఉండుండేది. కానీ తన బతుకు ఇక్కడ రాసిపెట్టి ఉందంతే! ఒక రాక్షసుడు పెట్టే నిరంతర క్షోభను అనుభవించి తీరాల్సిందే.. అనివుంటే కోటిలు.. కోటి ఆశలు.. కోటి తాలూకు ఆరాటాలు అన్నీ వ్యర్థమైన విషయాలుగా మిగులుతున్నారుు.
గుంభనమైన శీలవతి మనసు ఒక్కసారిగా విస్ఫోటనం చెందినట్లనిపించింది. ఆ విస్ఫోటనానికావల కోటి తాలూకు కొన్ని జ్ఞాపకాలు.. మంచివాడు.. పదో తరగతి నుండి స్కూలులో తన సహాధ్యాయి. తనంటే మంచి అడ్మిరేషన్‌తో ఉండేవాడు. చదువుకొనే కాలంలో చదువే లోకంగా ఉండేవాడు. ఎప్పుడూ నవ్వుతూ పలకరించేవాడు. ఆ పలకరింపులో కొంత పులకింత కన్పించేది.

ఇంటికొచ్చినప్పుడు ‘‘అంకుల్!’’ అంటూ నాన్నతో కాలేజీ విషయూలు ఏకరువు పెడుతుండేవాడు. తన విషయం కాకుండా లెక్చరర్ల విషయూలు, స్టూడెంట్ల చదువు సందర్భాలు అనేకం చెబుతుండేవాడు. ఆ మాటల్లో శీలవతి తాలూకు కబుర్లు తరచూ విన్పిస్తుండేవి. కాలేజీలో తన చక్కని నడవడిక, చదువుపై శ్రద్ధాసక్తుల గురించి అమ్మానాన్నల ముందు కోటి చెబుతూ ఉంటే శీలవతికి ఎంతో ఆనందంగా అన్పించేది.
అమ్మానాన్నలకు సానుభూతిపరుడు కోటి. క్రమంగా అతగాడి మాటల మీద వాళ్లకు ఎంతగానో గురి ఏర్పడింది. కాలేజీలో ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు కోటి ఒకసారి తానే కల్పించుకొని అన్నాడు - ‘‘నువ్వు మంచి అమ్మాయివి. అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను. ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవాలని, నీతో కలిసి ఏడడుగులు మాత్రమే కాదు, అనేకమైన అడుగులు జీవితాంతం కలిసి నడవాలని ఉంది.’’ 
కోటి తీసుకొచ్చిన ప్రతిపాదన మెుదట్లో శీలవతికి ఆశ్చర్యం కలిగించింది. ఎప్పుడూ తన వెన్నంటి సహాయకారిగా ఉండే అతని మనసులో తాను ఉన్నానన్న విషయం తేటతెల్లమయ్యేసరికి ఆనందంగానూ అన్పించింది. కోటి మంచివాడు, సౌమ్యుడు.. ఎంతో మంది విద్యార్థుల లాగా వికృత పోకడలకు దూరంగా ఉండే మనిషి. అట్లాంటి మనిషి తనను ప్రేమిస్తున్నానని చెప్పడం శీలవతికి ఆనందంగా ఉంది.
‘‘ఇప్పటికిప్పుడు చెప్పమని అనను. ఆలోచించుకొని చెబితే మీ అమ్మానాన్నలతో మాట్లాడతాను.’’
శీలవతి సందిగ్ధంలో పడింది. తనకు ఇటువంటి ప్రేమలు, దోమల విషయంలో నమ్మకం లేదు. ఇంతవరకూ తానెవరినీ ప్రేమించనూ లేదు. కానీ కోటి బాగా ఎరిగిన మనిషి. కొన్నేళ్లు పరిచయం ఉన్న మనిషి. తనను కోరి పెళ్లి చేసుకునేందుకు ముందుకు వస్తున్నాడు. ఏదేమైనా తల్లిదండ్రుల నిర్ణయంమే తన నిర్ణయం. అదే విషయం అతడితో కచ్చితంగా చెప్పింది కూడానూ.
‘‘బయ్యవరం భవనం వారి సంబంధం.. కోటితో పోలిస్తే ఇది మంచి సంబంధం. పెళ్లికొడుకు తండ్రి కూడా ఉద్యోగస్తుడు. ఏదో ఇంటికి వచ్చి అడుగుతున్నాడని తాడూబొంగరం లేనివాడికి ఏమిస్తాం చెప్పు!’’
ఆనాటి తండ్రి మాటను శీలవతి జవదాటలేకపోయింది. గుండ్రాజును చూస్తే బాగానే అన్పించాడు. కోటి అనే అతని మీద తను మనసు పారేసుకున్నది ఏమీలేదు. అందుచేతనే గుండ్రాజుతో పెళ్లికి తను వెంటనే సమ్మతి తెలిపింది.
‘‘పొద్దు బారెక్కుతోంది.. లే అమ్మాయ్! వాడు మైలకూరు వెళ్లాడు. మూడు రోజుల వరకు మనకు భయంలేదు’’. కోడలిని దగ్గరగా తీసుకొని అంటోంది కోమలి.
ఎర్రగా కాలిన కట్టెతో వారం రోజుల క్రితం కొడుకు పెట్టిన వాతలతో శీలవతి మోచేయంతా బొబ్బలెక్కిపోయి ఉంది. ఆ రోజు ‘‘అయ్యో!’’ అంటూ తనకు తెలిసిన నాటువైద్యం చేయబోయింది కోమలి.
‘‘ఇప్పుడు మందేసి తగ్గిస్తారు సరే. నాలుగు రోజులయినా గడవక ముందే మళ్లీ వాతలూ, మచ్చలూ! ఇవన్నీ మనకు కొత్తకాదు కదా అత్తయ్యూ.. వాటిని అలానే ఉండనివ్వండి! కాకపోతే అవి కొంత సలుపు పెడ్తాయి. అంతేగా!’’
‘కోడలు కష్టాలు తీరేదెప్పుడో.. పుట్టింట్లో ఎలా ఉండేదో.. ఇక్కడకొచ్చి ఇలా అయిపోయింది. ఈ రౌడీగాడిని నిలువరించడం ఈ ప్రపంచంలో ఎవరి తరమూ కాదేమో!’.. మనసులో బాధపడి కొడుకుని ఆడిపోసుకోవడం తప్ప ఏమీ చేయలేని చేతకాని బ్రతుకు కోమలిది.
*************
‘‘బళ్లారికి ఐదు లోళ్లు తోలాలి. సరుకు రేపు సాయంత్రానికి ఆడికి చేరిపోవాల.’’ పెదరాయుడు ఆజ్ఞ అది. అతగాడి మాట పెద్దగా ఉంది, హుంకరించినట్లుగా ఉంది. ఒంగోలు మార్కెట్‌లో ఇనుమయినా, మినుమయినా సరే.. అక్కడి వ్యాపారాలన్నింటికీ పెదరాయుడే రారాజు. అతగాడు చెప్పింది జరిగి తీరాల్సిందే! అతగాడి మాటను జవదాటే పరిస్థితి ఉండదక్కడ. ఒకవేళ ఉంటే ఎదుటివాడు నిలవడం కష్టం. అక్కడ చాలా మంది ఆ మనిషిని చూస్తే జంకుతారు. ఆ మాటతీరు, తెగింపు ధోరణి, ఆధిపత్య నైజం.. అందుకే తన స్వకార్యం కోసం పెదరాయుడిని ఆశ్రయించింది శీలవతి.
‘‘బాడుగమ్మగారూ..’’ ‘‘ఎంత?’’
‘‘ఏడున్నర వెయ్యి’’.. మారుమాట లేకుండా రిజిస్టర్‌లో డ్రైవర్ చేత సంతకం పెట్టించుకొని డబ్బు చేతిలో పెట్టేస్తుంది. అందుకే రాయుడు దగ్గర వెనుకంజ వేసే చాలా మంది శీలవతిని అడిగితే సులువుగా పనులు అయిపోతున్నాయి. ఆ విధంగా పెదరాయుడు సంస్థలో చాలా తక్కువ కాలంలో పేరు సంపాదించుకొని ఎంతగానో ఎదిగిపోయింది శీలవతి. చెప్పాలంటే ఇప్పుడు అతగాడి దగ్గర అన్నీ తానయిపోయింది!
‘‘గిద్దలూరుకి పది ఇసుక లోళ్లు పంపమని కూర్మారావు కంపెనీ వాళ్లు ఫోన్ చేశారు.’’ ఫోన్‌ను పెదరాయుడికి అందివ్వబోతూ అంది.
‘‘కూర్మారావుది మంచి పార్టీ. మాట నిలకడ ఉంటుంది. డబ్బుకు భరోసా ఉంటుంది.’’
‘‘అందుకే మీకు చెప్పకుండానే లోళ్లు చెప్పేశాను.’’
‘‘నీ మాటను కాదన్నదెవడు చెప్పు!’’ శీలవతి చేతిని ప్రేమగా తీసుకున్నాడు. ‘‘అందుకే నువ్వు నచ్చనిది! ఇది ఆఫీసు. వచ్చీపోయేవాళ్లు ఉంటారిక్కడ.’’ చిన్నగా నవ్వింది.
ఆ అరకొర నవ్వు పెదరాయుడికి నచ్చుతుంది. అందుకే అప్పట్లో శీలవతి మీద మనసు పారేసుకున్నాడు. అందుకే చాలా తక్కువ కాలంలో తన దగ్గర చిన్న గుమాస్తాగా చేరిన మనిషి ఇప్పుడు తనకు అన్నీ తానయిపోయింది.
‘‘నన్నెప్పుడు నిలువనిచ్చినావు చెప్పు! అందుకే గదా గుమాస్తా అన్న ప్రతివోడినీ ఇసుకరేవుల్లోకి పంపేసి, ఇక్కడ పర్మినెంట్‌గా నిన్ను పెట్టేసుకున్నది.’’ చటుక్కున మీదకు లాక్కున్నాడు. అతగాడి ఒడిలో కూలబడిపోయింది. అది పెదరాయుడికి నచ్చుతుంది. పెదరాయుడికి నచ్చిన ప్రతిదీ శీలవతికీ నప్పుతుంది. అంత మనిషి ఒడిలో కూలబడిన శీలవతి అతగాడి కళ్లలోకి కళ్లుపెట్టి చూస్తుంది. ప్రేమగా అతగాడి నడుంచుట్టూ చేయివేసి పెనవేసుకుపోతుంది. తన నల్లని పొడవాటి కురులను అతని మెుహం మీదుగా కప్పేసి రాయుడిని కవ్విస్తుంది.
‘‘ఊ.. చిన్నగా.. లిప్‌స్టిక్ చెరిగిపోయిందంటే ఇసుక జనం ఆడిపోసుకుంటారు.’’
‘‘చెరిగిపోయిన చోట పులుముకుంటే సరి!’’
‘‘పులుముకున్నవి పావుగంటైనా ఆగేనా సామీ!’’
‘‘శీలా.. ఇప్పుడు నువ్వెంత బాగున్నావో తెలుసా..!’’
‘‘ఎంతేంటి..?’’
‘‘ఇంత.. ఈ పెదరాయుడి మనిషివి.. రాయుడు స్టేటస్ నిలబెట్టాల.. మీ అమ్మగారు చూడు.. ఎంత పెద్ద సీరలు కడతాదో.. ఈ సిన్నమ్మ సీపు సీరలు కడితే బయటోళ్లకేమో గాని నాకు సిన్నతంగా ఉంటాది..’’ శీలవతిని పూర్తిగా ఆక్రమించేసుకుంటూ అంటున్నాడు.
ఒక అవసరం తాలూకు అనివార్యత తనను ముందుకు నెడుతుంటే కొన్ని సంవత్సరాలుగా పెదరాయుడు తోటి సహచర్యం.. దానికి మించిన సహజీవనం శీలవతి జీవనానికి ఆనందాన్ని కలుగజేయకపోయినా భద్రతను, భరోసాను కలుగజేస్తూనే ఉంది. ముఖ్యంగా గుండ్రాజు అనే ఒక భయూనకమైన నడవడిక కల్గిన మనిషి నుండి.
అప్పట్లో తన కాళ్లమీద తాను నిలబడాలని పెదరాయుడిని సంప్రదించినప్పుడు ఆమె వైపు పైకీ క్రిందకీ చూశాడు. ఆమె అవసరాలు, సమస్యలు ఇట్టే అర్థమయ్యారు. ఆ క్షణానే పెదరాయుడిలోని అంతర్గతమైన అనైతిక ఆలోచనలు వెలుగు చూశారు. మెుదట్లోనే పెదరాయుడు అంత మంచివాడు కాదని తెల్సినా, ఊళ్లో అతగాడిమీద అనేకమైన దొమ్మీ కేసులు నమోదయి ఉన్నాయనీ, చివరకు ఊరి పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ కూడా ఉందనే వార్త చెవినబడినా అవేమీ రోజూ ఇంట్లో తాననుభవిస్తున్న భౌతిక దాడుల ముందు నిలువలేకపోయాయి.

మెుగుడు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేకపోతోంది. ఫూటుగా తాగివచ్చి భార్యను చితకబాదడాలు, తలను గోడకేసి కొట్టడాలు, శరీరం మీద వాతలు పెట్టడాలు, గీరడాలు, రక్కడాలు.. వీటన్నింటినీ తట్టుకోవడం తనవల్ల కావడం లేదు. వీటన్నింటికీ పరిష్కారం తనలాంటి బలహీనురాలు, ఏ ఆధారమూలేని మనిషికి ఒక బలాఢ్యుడి అండ లేదా ఆత్మహత్య... ఒక మనిషిగా పిరికితనంతో ఆత్మహత్యకు పాల్పడటం తనకు ఇష్టం ఉండదు. అందుకే శీలవతి తన నిర్ణయూన్ని సమర్థించుకుంటూనే ఉంది. అప్పటి నుండి పెదరాయుడికి భయపడి కొంతవరకు గుండ్రాజు వెనక్కి తగ్గుతూనే ఉన్నాడు. ఒక కన్నీటి తెరకావల తన అనైతిక ధోరణి ఒక్కోసారి శీలవతిని కుంగదీస్తూనే ఉంది. కానీ ఇప్పుడు హాయిగా తినగల్గుతోంది. అత్తగారికి ఇంత తిండి పెట్టగల్గుతోంది. సమాజంలో ఎవరూ తనని మాట అనడానికి సాహసించని విధంగా నడుస్తూనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఆనాడు అన్నీ ఆలోచించుకొని పెదరాయుడి కమతంలో గుమాస్తాగిరికి చేరక తప్పలేదు. నెలకు ఇచ్చేది మూడు వేల రూపాయల జీతమే అయినా తనకు మెుగుడి నుండి, అతగాడు పెట్టే చిత్రహింసల నుండి కొంత భద్రతను ఆశించి చేరింది.

కానీ పెదరాయుడు అంతటితో ఊరుకోలేదు. శీలవతి మీద కన్నేశాడు. శరణుజొచ్చిన ఆడదాని అలసత్వాన్ని అలుసుగా తీసుకొని చేరుు పట్టుకున్నాడు. వయసులో ఉన్న అందమైన ఆడదాని దగ్గర కామంతో కళ్లు కమ్మేసిన ఓ మానవ మృగం ఏం ఆశిస్తుందో అవన్నీ కోరుకున్నాడు. గుండె ధైర్యం చాలక ఎదురు చెప్పలేకపోయింది. తను పెదరాయుడికి తొత్తుగా మారిందని తెల్సిన తర్వాత గుండ్రాజు తన జోలికి రావడం తగ్గించేశాడు. అతడు ఇంట్లో చేసే అకృత్యాలన్నీ తగ్గుముఖం పడుతున్నాయి. క్రమంగా ఇంటికి రావడం కూడా తగ్గించేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. కోమలికి కోడలి ధోరణి, ప్రవర్తన మింగుడు పడకుండా ఉంది. కొడుకు ఇంటికి రాక ఎక్కడెక్కడో బయట తిరగడం కలచివేస్తోంది. కానీ కోడలు సంపాదించి తెచ్చి సుష్ఠుగా ఇంత తిండి పడేస్తోందిప్పుడు.
**************

కోటి ఇప్పటికీ తనను ప్రేమిస్తూనే ఉన్నాడు. జీవితంలో స్థిరపడినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా నిండుగా తనను మనసులో నింపుకొనే ఉన్నాడు. ఇప్పుడు ప్రేమించిన కోటిని మనువాడకుండా ఉండటానికి ఏ కారణమూ కన్పించడం లేదు శీలవతికి. కోరి వచ్చిన కోటిని వివాహం చేసుకోవడం అనేది తన బతుక్కి భరోసాగా అన్పిస్తోంది. 

‘‘నువ్వు మంచి.. మీ అమ్మానాన్నలు మంచి.. అందుకే నిన్ను పెళ్లాడాలనుకుంటున్నాను’’.. అప్పట్లో కోటి చెప్పే కబుర్లు వింతగా అన్పిస్తూ ఉండేవి. ఇప్పుడు ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడో...
తన కాళ్లమీద తను బతుకుతూ మంచి జీవితాన్ని గడుపుతూ ఉండుంటాడు. కానీ తనే ఇలా తనది కాని జీవితాన.. సయించని మనుషుల మధ్య ఇష్టం లేకుండా... 
కోటి గుర్తుకు వచ్చినప్పుడల్లా శీలవతి తెలియని ఆవేదనను అనుభవిస్తూనే ఉంటుంది.
*************
రంగుల రాట్నం లాంటి జీవితాలు.. ఎగుడుదిగుడుల దారుల్లో పడుతున్నట్లు.. తిరిగి లేవగల్గి అడుగులేస్తున్నట్లు - శీలవతి ఇప్పుడు అలవికాని అనేక నైజాల మధ్య తాదాత్మ్యం చెందుతూనే ఉంది. ఆమెలో ఇప్పుడు అపరాధ భావన లేదు. పశ్చాత్తాపం అంతకన్నా లేదు. మెుగుడి శాడిజం వల్ల అనేక అవస్థలు పడడం.. దాని నుండి విముక్తి కోసం పెదరాయుడికి చేరువవడం.. అతనితో చేయి కలిపి, అతని ద్వారా ఆ అడ్డును తొలగించుకోవడం.. తొలగించిన వ్యక్తి అనివార్యంగా యూవజ్జీవ కారాగార శిక్షను అనుభవించడం.. ఇవేమీ శీలవతికి కృతకంగా అన్పించడం లేదు.
ఒక మధ్యతరగతి ఆడదానిగా ఓ సాధారణమైన మామూలు జీవితాన్ని ఆశించింది. కానీ అసాధారణమైన రీతిలో అనేకమైన వంచనలకు గురైన నిర్భాగ్యురాలు తను. ఎవరు అవునన్నా, కాదన్నా.. తన వాదం తనది. అది తనకు సహేతుకం కూడాను. ఇప్పుడు ఏ ప్రతిబంధనాలూ లేని ఏకాకి బతుకు తనది.

కోటి ఇప్పటికీ తనను ప్రేమిస్తూనే ఉన్నాడు. జీవితంలో స్థిరపడినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా నిండుగా తనను మనసులో నింపుకొనే ఉన్నాడు. ఇప్పుడు ప్రేమించిన కోటిని మనువాడకుండా ఉండటానికి ఏ కారణమూ కన్పించడం లేదు శీలవతికి. కోరి వచ్చిన కోటిని వివాహం చేసుకోవడం అనేది తన బతుక్కి భరోసాగా అన్పిస్తోంది. కోటి తోటి మలి జీవితం స్వాంతనగా ముందుకు కొనసాగగలదన్న నమ్మకం ఏర్పడుతోంది. 
అనుకున్నట్లుగా ప్రేమించానని వచ్చిన కోటితో మూడు ముళ్లు వేయించుకొని ముందుకు కదులుతోంది. ఎదురుగా కోమలి! ఇప్పుడు అత్తగారిగా ఆమె బాధ్యత తనకే మాత్రమూ లేదు. అయినా కొడుకు దుశ్చర్యల వల్ల ఆమె పడిన బాధలు, తనను గోడకేసి కొడుతుంటే నిలువరించలేక ఆమె పడిన ఆవేదన.. కళ్లల్లో మెదిలేసరికి చలించిపోతోంది. తీవ్ర కలవరానికి గురవుతోంది. బిక్కుబిక్కుమంటున్న కోమలి బిత్తర చూపులు శీలవతిని విచలితురాలిని చేస్తున్నాయి.
భర్త కోటి చేతిని అందుకొని కదులుతూన్న ఆమె.. ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి రెండు అడుగులేసి పలికింది.. ‘‘మీ బాధ్యత మాది. మీరు మాలో ఒకరు.. ఎప్పుడూ మీరు నాతోనే ఉంటారు. ఉండాలి కూడాను.’’ 
- తన ఉద్దేశాలను గౌరవిస్తాడన్న ఆశతో కోటి కళ్లలోకి చూస్తూ అంది.
‘నీ మాటే నా మాట’ అన్నట్లు శీలవతి చేతితో పాటు, కోమలి చేతిని గౌరవంగా అందుకొని బయటకు అడుగులు వేశాడు కోటి.
- సెల్: 9985336444
- వడలి రాధాకృష్ణ

English Title
No compunctution, sunday story of the week
Related News