బయోఇంధనాల నూతన విధానం

Updated By ManamThu, 05/17/2018 - 22:32
biofuel_refinery_01
  • 2జి ఇథనాల్ ప్లాంట్లకు రూ. 5,000 కోట్లు.. ఇంధన ఉత్పత్తి ముడిపదార్థాల శ్రేణి విస్తరణ

biofuel_refinery_01న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం బుధవారంనాడు బయోఇంధనాల సమగ్ర విధానాన్ని ఆవిష్కరించింది. రైతులు మితిమీరిన పంటను బయో ఇంధనాల ఉత్పత్తికి మళ్ళించడానికి రైతులకు వీలు కల్పించడంతోపాటు అనేక ఇతర ప్రయోజనాలను కల్పించనుంది. రెండవ తరం (2జి) ఎథనాల్ రిఫైనరీల ఏర్పాటులో సాయపడేందుకు రూ. 5,000 కోట్లను కేటాయించింది. ఇథనాల్ ఉత్పత్తికి, షుగర్ మొలాసిస్‌ను మించి, అందుబాటులో ఉండే ముడి పదార్థాల శ్రేణిని విస్తరించడాన్ని జాతీయ బయోఇంధనాల విధానం (2018) లక్ష్యంగా పెట్టుకుందని అధికారిక ప్రకటన ఒకటి వెల్లడించింది. చెరకు రసం, దుంపలు, జొన్నలు, మొక్కజొన్న, పెండలం వంటి చక్కెరతో కూడిన పంటలు, కుళ్ళిన బంగాళా దుంపలు, పాడైపోయిన గోదుమలు, నూకలు వంటి మానవ వినిమయానికి పనికిరాని దెబ్బతిన్న ధాన్యాలను ఇథనాల్ ఉత్పత్తికి పరిశీలించవచ్చు. ‘‘దిగుబడులు అధికంగా ఉండి మిగులు ఏర్పడిన దశలో తమ పంటలకు సముచితమైన ధరలు లభించని రిస్కును ఎదుర్కొంటున్న’’ రైతులు మిగులు ధాన్యాలను ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగించే అంశాన్ని పరిశీలించవచ్చు. నేషనల్ బయోఫ్యూయల్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆమోదం ఉంటే తప్పించి, పెట్రోల్‌లో ఇథనాల్‌ను మిళితం చేయడానికి లేదని ఆ ప్రకటన తెలిపింది.  దేశంలో ఘన వ్యర్థ పదార్థాల సమస్య పెరిగిపోతోంది. దాన్ని పరిష్కరించే విధంగా ఘన వ్యర్థాలను డ్రాప్-ఇన్ ఇంధనాలుగా మార్చేందుకు ఒక యంత్రాంగాన్ని ఈ విధానం సమకూర్చనుంది. 2జి బయో రిఫైనరీలకు రూ. 5000 కోట్లతో వయుబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకాన్ని ఏర్పాటు చేయాలని కొత్త విధానం ప్రతిపాదించింది. ఈ రిఫైనరీలను ఆరేళ్ళ కాలంలో నెలకొల్పనున్నారు. 1జి బయోఇంధనాల (బయోఇథనాల్, బయోడీజిల్)తో పోలిస్తే 2జి బయోఇంధనాలకు హెచ్చు, కొనుగోలు ధరలు, ఇతర ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. అవి కాకుండా, కొత్త స్కీమ్ ద్వారా 2జి బయోఇంధనాలకు ప్రోత్సాహం లభించనుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దాదాపు రూ. 10,000 కోట్ల పెట్టుబడితో 2జి బయో రిఫైనరీలు పన్నెండింటిని ఏర్పాటు చేసే క్రమంలో ఉన్నాయి. బయో డీజిల్ ఉత్పత్తికి తినడానికి పనికిరాని నూనె గింజలు, వాడిన వంట నూనె, స్వల్ప కాలంలో చేతికి రాగల పంటలను ఉపయోగిస్తారు. వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు సరఫరా వైపు గొలుసుకట్టు యంత్రాంగాలను ఏర్పాటు చే యాలని నూతన విధానం సూచించింది. బయోఇంధనాల ఉత్పత్తిని మెరుగుపరచే ప్రయత్నాల మధ్య సమన్వయం సాధించేందుకు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల పాత్రలు, బాధ్యతలను నూతన విధానం రేఖామాత్రంగా వివరించింది.

విదేశీ మారక ద్రవ్య ఆదా
ఇంధనంలో మిళితం చేసేందుకు 2017-18 సంవత్సరంలో మొత్తం ఇథనాల్ ఉత్పత్తి 150 కోట్ల లీటర్లుగా ఉండగలదని అంచనా వేసినట్లు, దానివల్ల రూ. 4,000 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అయినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. దీనివల్ల పర్యావరణ, ఆరోగ్య పరంగా గణనీయమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఇంధనంలో 1 కోటి ఇథనాల్‌ను మిళితం చేయడం వల్ల సీఓటూ ఉద్గారాలు 20,000 టన్నుల మేరకు తగ్గుతాయి. బయో ఇంధనాల ఉత్పత్తికి వరి, గోదమ గడ్డి వంటి పంటల అవశేషాలను ఉపయోగించడం వల్ల విషపూరిత ఉద్గారాలను మరింత తగ్గించవచ్చునని ఆ ప్రకటన వెల్లడించింది. పైగా, 2జి ఇథనాల్ రిఫైనరీలు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచి, ఆ ఫ్యాక్టరీల నిర్వహణ, సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాయి. గ్రామ స్థాయిలో వ్యవస్థాపక సామర్థ్యం కూడా పెంపొందుతుందని ఆ ప్రకటన పేర్కొంది. 

English Title
The new policy of biofuels
Related News