కోహ్లీపై మండిపడుతున్న నెటిజన్లు

Updated By ManamThu, 11/08/2018 - 12:23
Virat Kohli

Virat Kohliటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇందుకు అతడు ఇటీవల మాట్లాడిన మాటలే కారణం అయ్యాయి. కోహ్లీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అతడి పేరు మీద ఉన్న ఓ యాప్‌ను ఇటీవల విడుదల అయ్యింది. అందులో తన అభిమానుల నుంచి వచ్చిన సందేశాలను చదువుతున్న కోహ్లీ వాటికి సమాధానం ఇచ్చాడు.

అందులో ఓ నెటిజన్.. ‘‘ఓవర్ రేటెడ్ బ్యాట్స్‌మన్.. అతడి బ్యాటింగ్‌లో నేనేం కొత్తదనం చూడలేదు. భారత ఆటగాళ్ల కంటే ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్‌ను నేను బాగా ఇష్టపడతా’’ అంటూ కోహ్లీని ఉద్దేశించి కామెంట్ పెట్టాడు. దానికి కోహ్లీ స్పందిస్తూ.. ‘‘నువ్వు ఇండియాలో నివసించేందుకు అనర్హుడవని భావిస్తున్నా. నువ్వు ఎక్కడికైనా వెళ్లు. మన దేశంలో ఉంటూ పక్కవాళ్లను ఇష్టపడుతున్నావు. నువ్వు నన్ను ఇష్టపడకపోయినా నేనేం బాధపడను. ఇతర దేశాలను అభిమానించేటప్పుడు నువ్వు మన దేశంలో ఉండాల్సిన అవసరం లేదు’’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు ఆ తరువాత వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు కోహ్లీపై మండిపడుతున్నారు.

‘‘ఇండియన్‌ టీమ్‌కు కెప్టెన్ అయినంత మాత్రాన సాటి ఇండియన్ దేశం వెళ్లిపొమ్మనే అధికారం కోహ్లీకి లేదు’’.., ‘‘కోహ్లీ దూకుడును తగ్గించుకో’’.. ‘‘కోహ్లీ నీ నుంచి ఇలాంటి సమాధానం ఊహించలేదు’’.. ‘‘అభిమానించాల్సిన బాధ్యత నీ మీద ఉందని మర్చిపోకు’’ అంటూ కామెంట్ పెడుతున్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై హీరో సిద్ధార్థ్ కూడా స్పందించాడు. ‘‘నువ్వు ఎప్పటికీ కింగ్ కోహ్లీ లాగే ఉండాలనుకుంటే కాలం నీకు ఏదో విధంగా సమాధానం చెప్తుంది. భవిష్యత్‌లో ఎలా మాట్లాడాలి? అన్న విషయంపై ద్రవిడ్ ఏం చెప్పాడు అని నువ్వు ఆలోచించేలా చేస్తుంది. ఒక భారత కెప్టెన్‌ను నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం బాధాకరం’’ అంటూ కామెంట్ పెట్టాడు.

English Title
Virat Kohli trolled for asking a fan to leave India
Related News