ఎన్డీ తివారీ కన్నుమూత

Updated By ManamThu, 10/18/2018 - 16:49
ND Tiwari passes away at Max Hospital in Delhi
ND Tiwari passes away at Max Hospital in Saket in Delhi

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎన్డీ తివారీ (93) కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన బ్రెయిన్‌లో రక్తస్రావం, మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఈ ఏడాది జూలై 8న మ్యాక్స్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి తివారీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

1925 అక్టోబర్ 18న బ్రిటిష్ ఇండియాలోని బలూటీలో ఎన్డీ తివారీ జన్మించారు. ఎన్డీ తివారీ పూర్తి పేరు పండిట్ నారాయణ దత్ తివారీ. రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఉంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సీఎంగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా పనిచేసిన ఆయన  యూపీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1976లో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1984లో రెండోసారి, 1988లో మూడోసారి యూపీ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. 

దీంతో పాటు కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఎన్డీ తివారీకి ఉంది. 1986లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1987 నుంచి 1988 వరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది. యూపీ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా ఎన్డీ తివారీ సేవలు అందించారు. 

2002 నుంచి 2007 మధ్య ఆయన ఉత్తరాఖండ్ సీఎంగా పనిచేశారు. అలాగే ఉమ్మది ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా 2007  2009 వరకూ పని చేశారు. ఎన్డీ తివారీ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, పలువురు పార్టీనేతలు సంతాపం తెలిపారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ నేతలు సంతాపం వెలిబుచ్చారు.

English Title
ND Tiwari passes away at Max Hospital in Saket in Delhi
Related News