ఆటోమొబైల్ హబ్‌గా నవ్యాంధ్ర

Updated By ManamWed, 07/11/2018 - 23:10
chandrababu
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మనమే టాప్  

  • అందరి సహకారంతోనే ప్రథమ స్థానం

  • వచ్చే జనవరిలో కియా మోటర్స్ నుంచి తొలి కారు

  • పెట్టుబడుల కోసమే సింగపూర్ పర్యటన

  • రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను ఆటోమొైబెల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రానికి దేశంలోని ప్రథమ స్థానం రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ అయిన కియా మోటార్స్ రాష్ట్రానికి వచ్చిందని, జనవరిలో కియా మోటార్స్ తొలి కారు బయటకు వస్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వాల వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు రాలేదని, అవి వస్తే రాష్ట్రం ఇప్పటికే ఆటోమొబైల్ హబ్‌గా నిలిచేదన్నారు. నియంత్రణ, ప్రక్రియ, పారదర్శక విధానాల్లో సంస్కరణలను సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ను  ప్రధమ స్థానంలో నిలిపామన్నారు. ప్రథమ స్థానం దక్కడం ఆనందం కలిగించందని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

image


ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తామే ఎప్పుడూ ముందుంటామని, ఇలాంటి ర్యాంకులు వచ్చినప్పుడే తాము చేస్తున్న కృషి ప్రజలకు తెలుస్తుందని తెలిపారు. సింగిల్ విండో పద్ధతి ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. పారిశ్రామిక అనుమతులు సకాలంలో ఇస్తున్నామని, లోపాలను వెంటనే సరిదిద్దుకోవడం వల్లే సత్ఫలితాలు వస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలోనే మొదటి ర్యాంకు వచ్చేలా సహకరించిన అందరికీ ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.   ఈ రోజు తన ఆనందం మూడింతలు అయ్యిందని అందుకు మూడు అంశాలు కారణమని ముఖ్యమంత్రి అన్నారు.

 ఒకటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా, అన్న క్యాంటీన్లను ప్రారంభించడం రెండోదని, పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించడం, అదే సమయంలో పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్‌పై స్టే రావడం మూడోదని చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా అన్నింటిలో నంబర్‌వన్‌గా ఉండాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నానన్నారు. ఒక టీమ్ లీడర్‌గా సూచనలు, సలహాలు అందిస్తానని, అయితే వాటిని అధికారులు అమలు పరచడం వల్లే ఉత్తమ ఫలితాలను సాధించగలిగామన్నారు. గతంలో చేపట్టిన సంస్కరణలలో మార్పులు తీసుకువచ్చి మరింత పటిష్టంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు.  పరిశ్రమల స్థాపన, పెట్డుబడుల విధానంలో స్నేహపూర్వక పరిస్థితులను కల్పించామన్నారు. పెట్టుబడిదారుల అభిప్రాయాల సేకరణలో 86.50 శాతంతో ఏపీ ప్రథమ స్ధానంలో నిలిచిందని, రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం మూడు శాతం తక్కువ సాధించిందన్నారు.

పెట్టుబడుల కోసమే సింగపూర్ పర్యటన
రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడుల తీసుకురావడం కోసమే సింగపూర్‌లో పర్యటించానని సీఎం చంద్రబాబు వివరించారు. సింగపూర్ పర్యటనకు సంబంధించి తనపై వచ్చిన విమర్శలను చంద్రబాబు తిప్పికొట్టారు. పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలు ఆన్‌ైలెన్‌లో ఉంచామన్నారు. సింగపూర్ పర్యటన ఎంతో సుహ్రుద్భావ వాతావరణంలో జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పేరును పెంచేందుకు ప్రపంచ నగరాల సదస్సు వేదికగా ఉంచటంలో సఫలమయ్యామన్నారు. ఇప్పటివరకు తాను 6 బిజినెస్ పెట్టుబడుల సదస్సులను నిర్వహించామని వాటిలో నూతన రాష్ట్రం ఏర్పడ్డాక మూడు నిర్వహించానన్నారు.

2,730 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్రానికి రూ.16,04,650 కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని వాటి ద్వారా 34 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నారు. ఇప్పటికే వాటిలో 1529 కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వాటి విలువ రూ.5,79,717 కోట్లు ఉన్నాయని వీటి ద్వారా 9,31,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయన్నారు. ఎంఎస్‌ఎంఈ విధానంలో  రూ.3 లక్షల 11 వేల కోట్ల మేర పరిశ్రమలు స్థాపించడం జరుగుతుందన్నారు. 2050 నాటికి పరిశ్రమల స్థాపనకు ఏపీని అత్యుత్తమ గమ్యస్థానంగా నిలుపుతామనే నమ్మకం ఉందన్నారు. అవినీతి రహిత పరిపాలనా వ్యవస్థను అందిస్తామన్న నమ్మకం మనపై కలిగిందని, ఒక నాయకుడిగా దిశానిర్ధేశం చేస్తానని, సమిష్టతత్వంతోనే విజయం సాధిద్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, పరిశ్రమల శాఖ కమిషనర్ సిదార్ధ జైన్ తదితరులు పాల్గొన్నారు.

English Title
Navodhya as automobile hub
Related News